రీసర్వే తప్పుల దిద్దుబాటు
ABN , Publish Date - Oct 22 , 2024 | 01:51 AM
గంగాధర నెల్లూరు మండలం కోటాగరం గ్రామానికి చెందిన ధనలక్ష్మి, లక్ష్మీపతిరెడ్డి దంపతులకు 2.15 ఎకరాల పొలముంది. ప్రస్తుతం మామిడి సాగు చేస్తున్నారు. రీసర్వే చేశాక ఐదు సెంట్ల భూమి తగ్గించి 2.10 ఎకరాలకే పట్టాదారు పాసుపుస్తకం జారీ చేశారు. ఈ 5 సెంట్ల భూమి నమోదు చేయాలని గ్రామ, మండల స్థాయి రెవెన్యూ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఆలకించలేదు.గత వైసీపీ ప్రభుత్వం చేపట్టిన రీసర్వేలో ఇలాంటి బాధితులెందరో..
నేటినుంచి రెవెన్యూ గ్రామ సభలు
బాధితుల నుంచి అర్జీల స్వీకరణ
15 రోజుల్లో పరిష్కారానికి కృషి
జిల్లాలో రీసర్వే జరిగిన మండలాలు: 29
రీసర్వే జరిగిన రెవెన్యూ గ్రామాలు: 329
రీసర్వే చేసిన విస్తీర్ణం: 3,02,555ఎకరాలు
మొత్తం ఎల్‌పీఎంల సంఖ్య: 3,25,897
మొత్తం ఖాతాలు: 1,57,896
గంగాధర నెల్లూరు మండలం కోటాగరం గ్రామానికి చెందిన ధనలక్ష్మి, లక్ష్మీపతిరెడ్డి దంపతులకు 2.15 ఎకరాల పొలముంది. ప్రస్తుతం మామిడి సాగు చేస్తున్నారు. రీసర్వే చేశాక ఐదు సెంట్ల భూమి తగ్గించి 2.10 ఎకరాలకే పట్టాదారు పాసుపుస్తకం జారీ చేశారు. ఈ 5 సెంట్ల భూమి నమోదు చేయాలని గ్రామ, మండల స్థాయి రెవెన్యూ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఆలకించలేదు.గత వైసీపీ ప్రభుత్వం చేపట్టిన రీసర్వేలో ఇలాంటి బాధితులెందరో..
చిత్తూరు, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): ‘భూసర్వే అన్నారు. రికార్డుల్లో విస్తీర్ణం తగ్గించారు. హద్దులు మార్చేశారు. రైతుల మధ్య విభేదాలు సృష్టించారు’ ....ఇదీ గత వైసీపీ ప్రభుత్వం చేపట్టిన రీసర్వే ఫలితం. వివాదాలు పరిష్కరించకపోగా.. మరింతగా పెరగడంతో న్యాయం చేయాలంటూ రెవెన్యూ కార్యాలయాల చుట్టూ రైతులు తిరిగేలా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమస్యను గుర్తించి రీసర్వే తప్పుల దిద్దుబాటుకు అడుగులు వేస్తోంది.ఇందులో భాగంగా రీసర్వే పూర్తయిన గ్రామాల్లో మంగళవారం నుంచి గ్రామ సభలు నిర్వహిస్తోంది. అక్టోబరు 22 నుంచి నవంబరు 15 వరకు ఈ సభల్ని నిర్వహించేందుకు సోమవారం జాయింట్ కలెక్టర్ విద్యాధరి షెడ్యూల్ విడుదల చేశారు. జిల్లాల విభజనకు ముందు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తొలి పైలట్ గ్రామంగా గుడిపాల మండలం ముత్తకూరుపల్లెను ఎంపిక చేసి ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష’ పేరుతో రీసర్వేను ప్రారంభించారు. సుమారు వందేళ్ల తర్వాత సమగ్ర భూ సర్వేకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, రూపాయి ఖర్చు లేకుండానే సర్వే చేస్తామని, ఉచితంగా హద్దురాళ్లు నాటుతామని ప్రభుత్వం ప్రకటించింది. రీసర్వే కోసం ప్రత్యేకంగా ఓ డిప్యూటీ తహసీల్దార్‌ను కేటాయించి, పల్లెల్లో ఎలాంటి భూవివాదాలు లేకుండా చేయడమే లక్ష్యమని చెప్పినా.. రీసర్వే తర్వాత గ్రామాల్లో భూసమస్యలు మరింత పెరిగాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 2021 జనవరిలో భూరీసర్వే ప్రారంభించారు. ప్రస్తుతమున్న జిల్లాలోని 29 మండలాల్లోని 329 రెవెన్యూ గ్రామాల్లో విడతల వారీగా సర్వే పూర్తి చేశారు. 1,57,896 ఖాతాల్లోని 3,02,555 ఎకరాల్ని సర్వే చేశారు. సర్వే పూర్తయిన రైతులకు భూహక్కు పత్రాలను అందించారు. భూ విస్తీర్ణంలో తేడాలు, సర్వే నెంబర్లు కన్పించకపోవడం, 5 సెంట్ల నుంచి ఎకరాలకు ఎకరాలు భూహక్కు పత్రాల్లో మాయమవడం.. పట్టా భూములు ప్రభుత్వ భూములుగా మారిపోవడంతో రైతులు పలుచోట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వే జరిగిన ప్రతి గ్రామంలోనూ భూవివాదాలు తీవ్రమయ్యాయి. రీసర్వే వద్దంటూ రైతులు ఆందోళనలూ చేశారు.
90,287మంది ముద్రతో హక్కుపత్రాలు
రీసర్వే జరిగిన గ్రామాల్లో సరిహద్దు రాళ్లను పాతారు. రైతులకు భూహక్కు పత్రాలను పంపిణీ చేశారు. రాళ్ల మీద, భూహక్కు పత్రాల మీద అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఫొటోలను ముద్రించి ఇచ్చారు. దీన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకించినా ఖాతరు చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే.. జగన్ ఫొటోలతో ఉన్న భూహక్కు పత్రాలను తొలగించి రాజముద్రతో కొత్తవాటిని అందిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో జిల్లాలో రీసర్వే జరిగిన 329 గ్రామాల్లో 90,287 పుస్తకాల్ని పంపిణీ చేయగా.. వాటిని రద్దు చేసి కొత్త వాటిని పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
ప్రతి సోమవారం రీసర్వే ఫిర్యాదులే
గత ప్రభుత్వం హయాంలో స్పందన పేరుతో, ప్రస్తుతం ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదిక పేరుతో ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న గ్రీవెన్స్ డేలో భూసమస్యలపై అర్జీలే అధికంగా వస్తున్నాయి. ఈ భూసమస్యల్లో కూడా రీసర్వేలో జరిగిన తప్పుల గురించే అధిక ఫిర్యాదులు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో వీటిని సరిదిద్దేందుకు నేటినుంచి నవంబరు 15 వరకు గ్రామ సభల్ని నిర్వహించనున్నారు.వచ్చిన అర్జీలను పరిశీలించి 15 రోజుల్లో పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోనున్నారు.
గ్రామ సభలకు బృందాల నియామకం
వీడియోగ్రఫీ చేయాలి
రెవిన్యూ రికార్డులను తీసుకువెళ్లాలి
చిత్తూరు కలెక్టరేట్, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా భూరీసర్వే బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు రీసర్వే జరిగిన పల్లెల్లో గ్రామసభలు నిర్వహించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. మంగళవారం నుండి నవంబరు 15వ తేదీవరకు గ్రామసభలు నిర్వహించనున్నారు. ఇందుకు బృందాలను నియమించారు. ఆర్‌ఎస్ డీటీ, మండల్ లెవల్ సర్వే అధికారి, వీఆర్వో, సర్వేయర్ అన్ని గ్రామాలకు వెళతారు. ఆర్వోఆర్, 22ఏ జాబితా, గ్రామ చిత్రాలు, భూసర్వేలో చేసిన మార్పులు - చేర్పులు పత్రాలను గ్రామసభలకు తీసుకొని వెళ్తారు. రీసర్వే సందర్భంగా బాధితులైన రైతుల నుంచి రీసర్వేలో గుర్తించిన రైతు భూమి వివరాలు, పట్టాదారు పాసుపుస్తకం వివరాలను సేకరిస్తారు. మండల రెవిన్యూ ఇన్‌స్పెక్టర్ అన్ని గ్రామ పంచాయతీలకు తప్పనిసరిగా వెళ్ళాలి. ఆర్‌ఎస్ డీటీ రోజూ గ్రామసభ పూర్తయిన తర్వాత నివేదికలను కలెక్టర్‌కు పంపాలి. మండల సర్వేయర్ గ్రామసభ రిజిస్టర్ నిర్వహించాలి. గ్రామ రెవిన్యూ అధికారులందరూ విధిగా గ్రామసభలకు హాజరు కావాలని కలెక్టర్ సుమిత్‌కుమార్ ఆదేశించారు. ముందస్తుగా గ్రామసభలు జరిగే తేదీ, స్థలం తదితర వివరాలను ముందస్తుగా రైతులకు తెలిసేవిధంగా ప్రచారం చేయాలని అందులో పేర్కొన్నారు.