Share News

టీడీఆర్‌ బాండ్ల నిలిపివేతపై కలకలం

ABN , Publish Date - Apr 06 , 2024 | 01:28 AM

ట్రాన్స్‌ఫర్‌బుల్‌ డెవల్‌పమెంట్‌ రైట్‌ (టీడీఆర్‌) బాండ్ల చెల్లుబాటు నిలిపివేస్తూ రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కలకలం రేపింది.

   టీడీఆర్‌ బాండ్ల నిలిపివేతపై కలకలం

తిరుపతి, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి) : ట్రాన్స్‌ఫర్‌బుల్‌ డెవల్‌పమెంట్‌ రైట్‌ (టీడీఆర్‌) బాండ్ల చెల్లుబాటు నిలిపివేస్తూ రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కలకలం రేపింది. లావాదేవీలకు నోచుకోని టీడీఆర్‌ బాండ్లు చెల్లవంటూ గత నెల 23న పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి జారీ చేసిన ఉత్తర్వులు ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఉత్తర్వుల నాటికి బాండ్లను వినియోగించుకోని వారి గుండెల్లో గుబులు రేగింది. ఎక్కువ సంఖ్యలో రోడ్లను నిర్మించి తద్వారా టీడీఆర్‌ బాండ్లు జారీచేసి, పెద్దమొత్తంలో లబ్ధి పొందాలని భావించిన వైసీపీ నేతల ఆలోచనలకు తాజా ఉత్తర్వులతో బ్రేకు పడింది. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో పెద్దమొత్తంలో టీడీఆర్‌ బాండ్ల దోపిడీ జరిగిందని విపక్షాలు ఆరోపించడంతో పాటు, మీడియాలో పెద్దఎత్తున కథనాలు వచ్చిన నేపథ్యంలో శ్రీలక్ష్మి రెండు నెలల క్రితమే విచారణకు ఆదేశించింది. అయితే ఈ విషయమై తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ నుంచి ఎలాంటి నివేదిక పంపకపోగా అధికార పార్టీకి చెందిన కీలక నేతలు ఆమెపై విరుచుకుపడ్డట్టు తెలుస్తోంది. దీంతో ఆగ్రహించిన ఆమె ఏకంగా టీడీఆర్‌ బాండ్ల చెల్లుబాటును నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం చర్చనీయాంశమైంది. తిరుపతిలో నిర్మించిన మాస్టర్‌ప్లాన్‌ రోడ్లకు ముందుగా సరైన సర్వే చేయకపోవడంతో పాటు కొన్ని చోట్ల దౌర్జన్యకరమైన పద్ధతుల్లో భూములు తీసుకుని హడావుడిగా రోడ్ల నిర్మాణం చేపట్టడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.మున్సిపల్‌ కౌన్సిల్‌ ప్రతిపాదించిన మొత్తం 42 రోడ్లలో ఇప్పటివరకు నిర్మించిన 18 రోడ్లకు సంబంధించి 1121 మంది భూములు కోల్పోయారు. వీరిలో 373 మందికి టీడీఆర్‌ బాండ్లు జారీచేశారు. గొల్లవానిగుంట, కొర్లగుంట ప్రాంతాల్లో స్వల్పంగా భూములు కోల్పోయిన వారితో పాటు అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న కొందరికి పెద్దమొత్తంలో బాండ్లు జారీ ఆయ్యాయి. ఇంకా 1200కు పైగా టీడీఆర్‌ బాండ్లు ఇవ్వాల్సి ఉంది.చదరపు గజానికి రూ.35వేల చొప్పున 2.80 లక్షల చదరపు గజాల స్వాధీనంతో కూడిన 342 టీడీఆర్‌ బాండ్ల జారీపై వివరణాత్మక నివేదికను సమర్పించాలని తిరుపతి కమిషనర్‌ను పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి ఆదేశించారు. మొత్తం రూ1,013 కోట్ల విలువైన టీడీఆర్‌ బాండ్లు జారీ చేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే ఉత్తర్వులు వెలువడే నాటికే 75 శాతం టీడీఆర్‌ బాండ్ల వినియోగం జరిగిపోయిందని కార్పొరేషన్‌ వర్గాలు చెబుతున్నాయి.టీడీఆర్‌ బాండ్ల చెల్లుబాటును పూర్తిగా రద్దు చేయలేదని తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు అవి చెల్లుబాటు కావని అంటున్నాయి. ఎక్కువ సంఖ్యలో రోడ్లను నిర్మించి తద్వారా టీడీఆర్‌ బాండ్లు జారీచేసి, పెద్దమొత్తంలో లబ్ధి పొందాలని భావించిన వైసీపీ నేతల పన్నాగానికి తాజా ఉత్తర్వులతో బ్రేకు పడిందనే భావించవచ్చు.

Updated Date - Apr 06 , 2024 | 01:28 AM