Share News

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో గందరగోళం

ABN , Publish Date - Apr 24 , 2024 | 01:49 AM

వైసీపీ ప్రభుత్వంపై ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. వీరు పోలింగ్‌ విధుల్లో పాల్గొంటున్నందున పోస్టల్‌ బ్యాలెట్‌ విధానం ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశముంది.

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో గందరగోళం

ఫ జిల్లా సరిహద్దు మండలాల్లో సమస్యలు

ఫ పుంగనూరు, పుత్తూరులలో ఆఫీసుల చుట్టూ టీచర్ల ప్రదక్షణలు

చిత్తూరు, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వంపై ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. వీరు పోలింగ్‌ విధుల్లో పాల్గొంటున్నందున పోస్టల్‌ బ్యాలెట్‌ విధానం ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశముంది. ఈ ఓట్లలో సింహభాగం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటాయనే భావనతో వైసీపీ అనుకూల అధికారులు గందరగోళం సృష్టిస్తున్నారు.సాంకేతిక లోపాలు చూపించి సంబంధిత దరఖాస్తులను చెల్లకుండా చేసేందుకు సహకరిస్తున్నారు. ముఖ్యంగా పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం ఫాం 12 దరఖాస్తు సమర్పణ గురించి చిత్తూరు కలెక్టర్‌ షన్మోహన్‌ అన్ని శాఖల ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు టీచర్లు ఎక్కడున్నప్పటికీ పనిచేస్తున్న మండలంలో దరఖాస్తులు సేకరించి పంపేలా ఎంఈవోలకు ఆదేశాలు అందాయి. అయితే, అంతకుముందే ఈ విషయానికి సంబంధించి భిన్నమైన సూచనలు రావడంతో పలువురు టీచర్లు తమకు ఓటు హక్కున్న నియోజకవర్గ ఆర్వో కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించారు. రామసముద్రం మండలంలో పనిచేస్తూ పుంగనూరులో ఓటు హక్కున్న టీచర్లు పెద్ద సంఖ్యలో పుంగనూరు ఆర్వో కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించారు. వీటిని అనుమతించడంలో పలు ఇబ్బందులు ఎదురయ్యాయి. నగరి చిత్తూరు జిల్లాలో ఉన్నప్పటికీ పుత్తూరు మండలం తిరుపతి జిల్లాలో ఉంది. దీంతో వివిధ మండలాల్లో పనిచేస్తున్నప్పటికీ పుత్తూరులో ఓటు హక్కు కలిగిన టీచర్లు పుత్తూరు ఎంఈవో కార్యాలయానికి తమ దరఖాస్తుల్ని సమర్పించారు. వీటిలో నగరి నియోజకవర్గానికి సంబంధించినవి 279 ఉండగా, ఇతర నియోజకవర్గాలకు సంబంధించినవి 53.. మొత్తంగా 332 దరఖాస్తులను విద్యాశాఖ సిబ్బంది తీసుకున్నారు. వీటిని నియోజకవర్గాల వారీగా విభజించి మంగళవారం మధ్యాహ్నం నగరి ఆర్వో కార్యాలయంలో సమర్పించడానికి వెళ్లగా వారు తిరస్కరించారు. చిత్తూరు జిల్లా కలెక్టర్‌ ఆదేశాల ప్రకారం పనిచేస్తున్న మండలాల్లో సమర్పించాల్సిందేనని స్పష్టం చేశారు. వందల సంఖ్యలో ఓట్లు ఉన్నందున చిత్తూరు కలెక్టర్‌తో చర్చించి పరిష్కారం చూపాలని కోరినప్పటికీ నగరి ఆర్వో వెంకటరెడ్డి పట్టించుకోలేదు. దీంతో విద్యాశాఖ సిబ్బంది దరఖాస్తులను తీసుకుని రాత్రి 8 గంటల ప్రాంతంలో చిత్తూరు కలెక్టరేట్‌కు చేరుకున్నారు. సమయం మించిపోవడంతో అక్కడున్న సిబ్బంది బుధవారం ఉదయం రావాలని తెలిపారు. ఒకవైపు పోస్టల్‌ బ్యాలెట్‌ దరఖాస్తు గడువు 26 వరకు పెంచినట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి చెప్తుండగా, క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదురవుతుండడం పట్ల ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Apr 24 , 2024 | 01:49 AM