Share News

వెంకటగిరిలో రేపు రా.... కదలిరా బహిరంగ సభ

ABN , Publish Date - Jan 18 , 2024 | 12:51 AM

ఏర్పాట్లను పరిశీలించిన పార్టీ నాయకులు

వెంకటగిరిలో రేపు రా.... కదలిరా బహిరంగ సభ
చంద్రబాబు సభ నిర్వహించే ప్రాంతంలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న టీడీపీ నాయకులు

వెంకటగిరి, జనవరి 17: వెంకటగిరి పట్టణంలోని తిరుపతి రోడ్డు మార్గంలో తెలుగు దేశం పార్టీ రా కదలిరా పేరిట 19వతేది నిర్వహిస్తున్న బహిరంగ సభ ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.సభా ప్రాంగణంలో స్టేజ్‌ ఏర్పాటు చేసే ప్రదేశంలో వేదపండితులచే భూమిపూజా కార్యక్రమం బుధవారం నిర్వహించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు హాజరయ్యే ఈ సభ ఏర్పాట్లను బుధవారం తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడు నరసింహయాదవ్‌, వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తదితరులు పరిశీలించారు. ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్సీ రామ్‌గోపాల్‌ రెడ్డి చంద్రబాబు రూట్‌ మ్యాప్‌ను నాయకులకు వివరించారు.టీడీపీ నాయకులు మస్తాన్‌యాదవ్‌, పులికొల్లు రాజేశ్వరరావు, కేవీకే ప్రసాద్‌ నాయుడు, జన్ని రమణయ్య, మధు నాయుడు, సీసీ నాయుడు, శాంతారావు, కాపా శ్రీనివాసుల నాయుడు, కొరపాటి రామచంద్రానాయుడు, సుధ తదితరులు పాల్గొన్నారు.

దొంగే దొంగా..దొంగా అని అరిచినట్లుంది

చంద్రబాబుపై వైసీపీ సర్కారు పెట్టిన కుట్రపూరిత కేసులు దొంగే దొంగా.. దొంగా అని అరిచిన చందంగా ఉందని నరసింహయాదవ్‌ ఆక్షేపించారు.రా కదలిరా బహిరంగ సభా ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కోర్టు తీర్పులను సైతం జగన్‌ పత్రికలో వక్రీకరించి రాయడాన్ని అయన తీవ్రంగా ఖండించారు.తెలుగుదేశం, జనసేన నాయకులు చిన్న ట్వీట్‌ పెడితేనే పెద్ద కేసులు కట్టే ప్రభుత్వం జగన్‌ పత్రిక తప్పుడు రాతలు రాస్తుంటే చూస్తూ ఊరుకోవడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రజలు జగన్మోహన్‌ రెడ్డిని ఇంటికి సాగనంపేందుంకు సిద్ధంగా ఉన్నారని ఇందుకు చంద్రబాబు నిర్వహించే సభలకు అంచనాలకు మించి జనం హాజరు కావడమే నిదర్శనమన్నారు. కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ చంద్రబాబుపై ఎన్నితప్పుడు కేసులు పెట్టినా కడిగిన ముత్యంలా ఆయన బయటకు వస్తారన్నారు.

Updated Date - Jan 18 , 2024 | 12:51 AM