Share News

శుభ కార్యాలయాలకు ‘కోడ్‌’ కష్టాలు

ABN , Publish Date - Apr 16 , 2024 | 01:12 AM

బంగారం, వస్త్రాల కొనుగోళ్లు తప్పనిసరి నగదు తీసుకెళ్లాలంటే తనిఖీల బెడద ఆన్‌లైన్‌ చెల్లింపులపై అవగాహన లేమి ఆస్పత్రులకూ వెళ్లేటప్పుడూ ఇబ్బందులే

శుభ కార్యాలయాలకు ‘కోడ్‌’ కష్టాలు

చిత్తూరు, ఏప్రిల్‌ 15: ఇది శుభకార్యాల సీజను. పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు వంటివాటికి ముహూర్తాలు అధికంగా ఉండటంతో కల్యాణ మండపాలు, ఫంక్షన్‌ హాళ్లు కళకళలాడుతున్నాయి. అయితే శుభకార్యాలు చేయాలనుకున్న వారికి ఎన్నికల కోడ్‌తో కష్టాలు తప్పడంలేదు. ప్రస్తుతం ఎక్కడికక్కడ వాహనాల తనిఖీలు చేస్తున్నారు. బంగారం, వస్త్రాలు, ఫర్నిచర్‌ కొనుగోలుకు నగదు తీసుకెళుతుంటే, తనిఖీలతో స్వాధీనం చేసుకుంటున్నారు. ఆ నగదును వెనక్కు తీసుకోవడానికి నిర్వాహకులకు తలప్రాణం తోకకొస్తోంది. శుభకార్యాలకు సడలింపులుంటాయని అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. దాంతో ఈ సమయంలో ఇలాంటి కార్యాలు ఎందుకు పెట్టుకున్నామా అంటూ నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు.

ఫ ఐరాల మండలానికి చెందిన దామోదర్‌ నాయుడు తన కుమారుడి పెళ్లి కోసం యాదమరిలో ఉన్న బంధువుల నుంచి రూ.2.50 లక్షలు తీసుకుని బయలుదేరారు. కాణిపాకం క్రాస్‌లో పోలీసులు పట్టుకుని సీజ్‌ చేశారు. తన కుమారుడి వివాహానికి అప్పు తీసుకుని వెళుతున్నానని మొత్తుకున్నా పోలీసులు వినిపించుకోలేదు. ఆ డబ్బులకు సంబంధించి రికార్డులు చూపించిన వారం రోజుల తరువాత రకరకాల కాగితాల్లో సంతకాలు పెట్టించుకుని డబ్బులను ఇచ్చారు.

ఫ కృష్ణా జిల్లా పోరంకికి చెందిన ఫణీంద్ర ఆర్థికంగా మంచి స్థానంలో ఉండటంతో బెంగళూరులో తక్కువ ధరకు వెండి దొరుకుంతుందంటే రూ.12లక్షల విలువైన వెండి ఆభరణాలను తీసుకొస్తున్నారు. చిత్తూరులో పోలీసుల తనిఖీల్లో వెండి ఆభరణాలను పట్టుకున్నారు. బిల్లులు చూపించి తీసుకెళ్లమని చెప్పడంతో చేసేదేమి లేక ఆయన వెళ్లిపోయారు.

ఫ చిత్తూరు నగరానికి చెందిన ఆయిల్‌ వ్యాపారి అమీద్‌, బియ్యం వ్యాపారి షణ్ముగం కలిసి ఈ నెల 10వ తేది బ్యాంకు నుంచి అవసరాల నిమిత్తం రూ. 7.86 లక్షలను డ్రా చేసుకున్నారు. ఈ మొత్తాన్ని తీసుకుని వెళుతుండగా గాంధీ రోడ్డులో పోలీసుల తనిఖీల్లో ఈ నగదు పట్టుకున్నారు. రికార్డులన్నీ చూపించాక.. మూడు రోజుల తరువాత సీజ్‌ చేసిన డబ్బులను తిరిగి ఇచ్చారు. దీంతో తాము తీసుకొస్తున్న నగదు అత్యవసరానికి ఉపయోగపడటం లేదని పలువురు అంటున్నారు.

జిల్లాలో శుభ ముహూర్తాలు ఉండటంతో పెళ్లిళ్లు అధికంగా పెట్టుకుంటున్నారు. అలాగే గృహ ప్రవేశాలు కూడా ఉన్నాయి. ఈ నెల 18, 19, 20, 21, 24, 26, 27 తేదీల్లో వివాహాలకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. చిత్తూరుతో పాటు జిల్లా అంతటా పెద్ద ఎత్తున పెళిళ్లు జరగనున్నాయి. ఈ నెల 27 తరువాత ముహుర్తాలు లేకపోవడంతో మరో మూడు నెలల ఆగాల్సి ఉన్నందున ఆ లోపు గృహ ప్రవేశాలు, నామకరణాలు, శంకుస్థాపనలు చేయడానికి చర్యలు చేపడుతున్నారు. ఇటీవల శుభ కార్యాలకు కానుకలు ఇచ్చే అలవాటు బాగా పెరిగింది. ఇక పెళ్లంటే నగలు, వస్త్రాలతో పాటు కల్యాణ మండపాలకు అడ్వాన్సులు ఇవ్వాలి. ఫొటో, వీడియో, డేకరేషన్‌, క్యాటరింగ్‌ తదితరాలను ముందుగానే మాట్లాడుకుని అడ్వాన్సులు ఇవ్వాలి. ఇందులో ఒకటీ రెండు మినహా మిగిలన్నింటికీ లక్షల్లోనే చెల్లింపులు చేయడానికి డబ్బులు తీసుకుని వెళ్లాలి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గత నెల 16 నుంచి కోడ్‌ అమల్లోకి వచ్చింది. ఈ క్రమంలో చెక్‌పోస్టుల్లో, మార్గమధ్యలో తనిఖీలు చేపడుతున్న పోలీసులు రూ.50వేలకు మించి నగదు దొరికితే సీజ్‌ చేస్తున్నారు. పోలీసు స్టేషన్‌కు పోవడంతో పాటు సీజ్‌ చేసిన డబ్బులకు ఆధారాలుచూపి వెనుక్కు తీసుకునే సరికి చుక్కలు కనిపిస్తునాయి. కొంత మంది మాత్రం మొబైల్‌ నెట్‌ బ్యాకింగ్‌ ద్వారా లావాదేవీలు జరుపుతున్నప్పటికీ చాలా మంది నగదు ద్వారానే లావాదేవీలు చేస్తున్నారు. చాలా మంది ఇళ్లల్లో ఏళ్ల తరబడి శుభకార్యాలు జరగకుండా లేక లేక కుదరడంతో కొనుగోళ్లకు బయలుదేరితే తీరా పోలీసు స్టేషన్‌కు చేరాల్సి వస్తోంది.

స్పష్టత లేని నిబంధనలు

చట్ట ప్రకారం రూ. 50వేలకు మించి నగదు చెల్లింపులకు పాన్‌కార్డు ఉండాలి. తనిఖీల్లో రూ.50వేలకు మించి నగదు ఉంటే లెక్కలు చెప్పాలని అధికారులు అంటున్నారు. అదే అధికారులు రూ. 10 లక్షలకు మించి పట్టుబడితే ఆదాయపన్నుశాఖ అధికారులకు సమాచారం ఇచ్చి అప్పగిస్తామంటున్నారు. మరోవైపు రూ.5 లక్షల వరకు పర్వాలేదని చెబుతున్నారు. దీనిపై స్పష్టత లేకపోవడంతో పాటు క్షేత్ర స్థాయిలో పోలీసులకు రూ. 50వేలు దొరికితే పోలీసు స్టేషన్లకు తీసుకెళుతున్నారు. ఆ నగదును ఆధారాలు చూపించి వెనుక్కు తీసుకోవడానికి రోజులు పడుతున్నాయి. పెళ్లి కార్డులు చూపిస్తే వదిలేస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ.. చాలా వరకు పెళ్లిళ్లకు 15 రోజులు ముందు మాత్రమే పత్రికలు ముద్రిస్తారు. కాని నగలు, ఇతర వస్తువులను నెల రోజుల ముందునుంచే కొనుగోలు చేయాల్సి ఉంది. డబ్బులు తీసుకొని వెళ్లేవారంతా పెళ్లిపత్రికలను వెంట తీసుకెళ్లడం కుదరదు. షెడ్యూల్‌ విడుదలైనప్పటి నుంచి సామాన్యులను, ఆస్పత్రి ఖర్చులకు, శుభకార్యాలకో డబ్బులు తీసుకొని వెళ్లే వారు ఇబ్బందులు పడుతున్నారు. భారీ మొత్తంలో నగదు దొరికితే చట్ట ప్రకారం వ్యవహరించాల్సిందే. అయితే రూ. 2 లక్షలో మూడు లక్షలో తీసుకెళ్ళేవారిని నిబంధనల పేరిట వేధించడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

రూ.2.29 కోట్ల నగదు సీజ్‌

ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైనప్పటి నుంచి ఈ నెల 11వ తేది వరకు జిల్లాలో రూ.2.29కోట్ల నగదు సీజ్‌ చేశారు. అలాగే, సీజ్‌ చేసిన బంగారం, వెండి, కుక్కర్లు, బియ్యం, డ్రెస్‌ మెటీరియల్‌ విలువ రూ.రూ.2.18 కోట్ల వరకు ఉంటుందని అంచనా.

బిల్లులు ఉంటే వెంటనే రిలీజ్‌

ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున నిబంధనల ప్రకారం పనిచేస్తున్నాం. రైతులు, సామాన్యులు శుభ కార్యాలు, ఇతర వాటికి డబ్బులు తీసుకొస్తే వాటికి సంబంఽధించిన ఆధారాలు కూడా తెచ్చుకోవాలి. అలా తెచ్చుకుంటే అప్పటికప్పుడు నగదును ఇచ్చేస్తాం. పెద్ద మొత్తంలో డబ్బులు, బంగారం, వెండి తదితర వస్తువులు తెస్తే బిల్లులుంటే ఇచ్చేస్తాం. లేదంటే ఖజానా శాఖలో డిపాజిట్‌ చేస్తాం. సరైన రికార్డులు చూపించిన తరువాత విడుదల చేస్తాం.

- ఎస్పీ మణికంఠ చందోలు

Updated Date - Apr 16 , 2024 | 01:12 AM