తిరుమలను భ్రష్టుపట్టించారు బాబూ!
ABN , Publish Date - Jun 13 , 2024 | 12:25 AM
చంద్రబాబు మళ్లీ సీఎం కావడంతో తిరుమల భక్తులంతా ఊపిరి పీల్చుకున్నారు.
తిరుపతి, ఆంధ్రజ్యోతి:
చంద్రబాబు మళ్లీ సీఎం కావడంతో తిరుమల భక్తులంతా ఊపిరి పీల్చుకున్నారు. జగన్ పాలనలో పవిత్రమైన క్షేత్రాన్ని రాజకీయ నేతల వ్యాపార కేంద్రంగా మార్చేసిన తీరును తలచుకుంటున్నారు. సాధారణ భక్తులకు దర్శనం దుర్లబం అయిపోగా నాయకులు మాత్రం గుంపులతో వచ్చిపోయే తీరు క్యూలో పదుల గంటలు వేచివుండే భక్తుల కడుపు మండించేది. భక్తులకు ఎంతో ప్రీతిపాత్రమైన లడ్డూనే నాసిరకంగా మార్చేసి, ధర పెంచేిసిన వైనంపై ఈ ఐదేళ్లలో భక్తులు మండిపడుతూనే ఉన్నారు. కాటేజీల ధరలు పెంచి లాడ్జీల్లా మార్చేసి మధ్యతరగతిని అవస్థల పాలు చేశారు. తిరుమల కొండమీద జగన్ పాలనలో పీఆర్వోల పేరుతో దళారుల రాజ్యం విచ్చలవిడిగా కొనసాగింది. మంత్రులూ, బోర్డు సభ్యులే దర్శనాల వ్యాపారాలకు తెగబడ్డారనే విమర్శలు పెరిగాయి. వైసీపీ నేతలకు కమిషన్ల కోసం వేల కోట్ల నిధులను నిర్మాణాల పేరుతో కేటాయించేసి అధికారులు ప్రభుభక్తిని చాటుకున్నారు. ఇప్పుడు ఇవన్నీ చర్చగా మారాయి. ఎన్టీయార్ లా తిరుమల ప్రక్షాళనకు చంద్రబాబు శ్రీకారం చుడుతారనే ఆశ అందరిలో పెరిగింది. ఐదేళ్లలో తిరుమల కేంద్రగా సాగిన అరాచకాలనూ.. అవినీతినీ.. అడ్డగోలు నియామకాలనూ నిశితంగా పరిశీలించి, సరిదిద్దుతారనే ఆకాంక్ష భక్తుల్లో ఉంది.
వైసీపీ వారి దర్శనాల వ్యాపారం
టీటీడీలో పాలనలో: ఎమ్మెల్యేల నుంచి రోజుకు ఒక సిఫారసు లేఖను మాత్రమే అనుమతించేవారు. అదీ ఆరు గురికి మాత్రమే దర్శనం కేటాయించేవారు. ఎమ్మెల్యేలు స్వయంగా దర్శనానికి వెళితే మాత్రం పది మందిని అనుమతించేవారు. మంత్రులైతే రోజుకు రెండు లేఖలు అనుమతించేవారు. బోర్డు సభ్యులకు రోజుకు 30 టికెట్లు కోటా వుండేది. వారాంతపు రోజుల్లో 12 టికెట్లు ఇచ్చేవారు. ఛైర్‌పర్సన్‌కు కనిష్టంగా వంద నుంచీ గరిష్టంగా 150 టికెట్లు కేటాయించేవారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప సుపథం టికెట్లు ఇచ్చేవారు కాదు.
వైసీపీ హయాంలో: ఎమ్మెల్యే లేఖలపై టికెట్లను రోజుకు ఆరు నుంచీ పదికి పెంచేశారు. స్వయంగా వెళితే 20 నుంచీ 30 టికెట్లు ఇచ్చారు. మంత్రులకు రెండు లేఖలనే అనుమతించినా టికెట్ల సంఖ్యపై పరిమితి లేదు. ఎన్ని అడిగినా ఇచ్చేవారు. మంత్రి స్వయంగా వెళితే 60 నుంచీ 70 టికెట్లు జారీ చేశారు. ఇక బోర్డు సభ్యులకు ఇచ్చే టికెట్లు 35కు పెంచారు. ఛైర్‌పర్సన్ కార్యాలయం నుంచీ రోజుకు 500 నుంచీ వెయ్యి టికెట్లు ఇచ్చారు. బ్రేక్ దర్శన టికెట్లు అయితే పరిమితి అన్నదే లేకుండా పోయింది. ఎన్ని అడిగితే అన్ని ఇచ్చారు. గతంలో మొత్తం బ్రేక్ దర్శన టికెట్లు రోజుకు 2 వేల నుంచీ 3 వేల వరకూ ఇస్తుండగా వైసీపీ వచ్చాక 6 వేలకు పెంచారు.
అయినవాళ్లకు అన్‌లిమిటెడ్
వైసీపీలోనూ పలుకుబడి ఉన్న నేతలు, టీటీడీ ఈవోతో సన్నిహితంగా ఉండే ఎమ్మెల్యేలు, మంత్రులు, బోర్డు సభ్యులకు దర్శన టికెట్లపై కోటా అన్నదే లేదు. ఉదాహరణకు గత ప్రభుత్వంలో సీఎంకు సన్నిహితుడుగా పేరుపడ్డ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే నుంచి రోజుకు 16-17 లేఖలను అనుమతించేవారు. అదే సమయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర బలహీన వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు, బోర్డు సభ్యులకు సాధారణ కోటా మేరకు మాత్రమే లేఖలను అనుమతించి పరిమితంగా టికెట్లు కేటాయించేవారు.
దుకాణాలు తెరిచేశారు
కొందరు మంత్రులు, పాలకమండలి సభ్యులు దర్శనాల పేరిట కొండపై దుకాణాలే తెరిచేశారు. టికెట్లు భారీ ఎత్తున అమ్ముకునేవారని ఆరోపణలున్నాయి. ఓ మహిళా మంత్రితో సహా నలుగురైదుగురు మంత్రులు తరచూ పార్టీలను వెంటబెట్టుకుని తిరుమలకు వచ్చేవారు. జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా దర్శనాలను వ్యాపారంగా మార్చుకున్నారన్న ఆరోపణలున్నాయి.
పీఆర్వోలు పేరుతో దళారీలు
ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, బోర్డు సభ్యులు.. ఇలా ప్రతి ఒక్కరికీ కొండపై ప్రైవేటు పీఆర్వోలు వున్నారు. దాతలు నిర్మించిన అతిధి గృహాలు ప్రైవేటు పీఆర్వోలకు, దళారీలకు కేంద్రాలుగా మారాయి. రూ. కోట్లు వెచ్చించి అత్యంత విలాసవంతంగా నిర్మించిన అతిధి గృహాలలో ఒక ఫ్లోర్ మొత్తం దాతలకు, వారు సూచించిన వ్యక్తులకు కేటాయించేశారు. దాంతో వాటి నిర్వహణ ప్రైవేటు వ్యక్తులు చూస్తున్నారు. అలా ఒకో అతిధి గృహంలో 10 నుంచీ 20 మంది దాకా నిర్వహణ కోసం అనే వంకతో సిబ్బందిని నియమించారు. వారు దళారీలుగా మారి దర్శనాలు, గదుల కేటాయింపులో నిమగ్నమవుతున్నారు. ఇందువల్ల ఇవి పుణ్యక్షేత్ర వాతావరణాన్ని కోల్పోయి విలాస కేంద్రాలుగా మారాయన్న ఆరోపణలున్నాయి.
సలహాదారులు..అడ్డగోలు నియామకాలు
వైసీపీ హయాంలో ఆ పార్టీ నేతలకు కావాల్సిన వారిని అధికారులుగా, సలహాదారులుగా, ఉద్యోగులుగా అడ్డగోలుగా నియమించుకున్నారు. ఉద్యోగులు, అధికారులను కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించగా, సలహాదారులను మాత్రం భారీ జీతభత్యాలతో నేరుగా నియమించారు. గతంలో టీటీడీలో ఎన్నడూ సలహాదారుల విధానం లేదు. ఉదాహరణకు అకౌంట్స్ విభాగానికి నరసింహమూర్తిని, ఇంజనీరింగ్ విభాగానికి కొండలరావును, అదే విభాగానికి రిటైర్డు చీఫ్ ఇంజనీర్ రామచంద్రారెడ్డిని సలహాదారులుగా నియమించారు. బర్డ్ ఆస్పత్రికి డాక్టర్ గురవారెడ్డిని సలహాదారుగా నియమించారు. విజిలెన్స్ విభాగంలో ప్రభాకర్ సలహాదారుడయ్యారు. సైబర్ విభాగానికి సందీప్ అనే వ్యక్తిని సైబర్ ఎక్స్‌పర్ట్‌గా నియమించి తర్వాత ఏకంగా ఐటీ విభాగానికి జనరల్ మేనేజర్‌గా నియమించారు. తొలుత రెండేళ్ళ కాల పరిమితి విధించి అది పూర్తి కావడంతో మరో మూడేళ్ళు పొడిగించారు. కీలకమైన ఎస్టేట్స్ విభాగంలో కూడా రిటైరైన అధికారి మల్లిఖార్జునను కొనసాగిస్తున్నారు. ఎస్వీబీసీకి సంబంధించి గాయని మంగ్లీ, విజయ్‌కుమార్ వంటి వారిని సలహాదార్లుగా నియమించారు. విద్యా శాఖలోనూ, ధర్మ ప్రచార పరిషత్‌లోనూ పలువురిని అడ్డగోలుగా నియమించారు. సలహాదారులకు రూ. లక్షకు పైగా వేతనం, వాహనం, వారికి గదులు కేటాయించి టీటీడీ ఖజానాను గుల్ల చేశారన్న ఆరోపణలున్నాయి. ప్రజాసంబంధాల విభాగంలో కూడా సాక్షి పత్రికలో పనిచేసిన నాగేశ్వరరావు అలియాస్ నగే్‌షను ఓఎస్డీ హోదాలో నియమించారు. ఇటీవలి ఎన్నికల్లో అతను వైసీపీ ప్రచారంలో పాల్గొన్నా చర్యలులేవు. ఏపీఆర్వోగా కొనసాగుతూనే ఉండడం విశేషం.
కమిషన్ల కోసం నిర్మాణాలకు నిధులు
టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ హయాంలో ఇంజనీరింగ్ పనులకు భారీ ఎత్తున నిధుల కేటాయింపు జరిగింది. 2019 వరకూ ఏటా బడ్జెట్‌లో ఇంజనీరింగ్ పనులకు రూ. 150 కోట్లకు మించి కేటాయింపులు వుండేవి కావు. అవి కూడా తప్పనిసరి అవసరాలకు మాత్రమే కేటాయించేవారు. వైసీపీ హయాంలో మొత్తం ఐదేళ్ళలో ఏకంగా రూ. 3 వేల కోట్లకు పైగా నిధులను ఇంజనీరింగ్ పనులకు కేటాయించడం సంచలనం రేపింది. పాలకమండలిలో కీలక వ్యక్తులు కమిషన్లకు ఆశపడినందునే ఇలా కేటాయింపులు జరిగాయన్న ఆరోపణలు వున్నాయి. వైవీ సుబ్బారెడ్డి నాలుగేళ్ళ పదవీ కాలంలో రూ. వెయ్యి కోట్ల వరకూ కేటాయించగా భూమన కరుణాకర్‌రెడ్డి బోర్డు ఛైర్మన్‌గా పనిచేసిన ఏడాదిలోపే రూ. 2 వేల కోట్ల కేటాయింపులు జరిగాయి. పర్సెంటేజీలు రాబట్టేందుకే అవసరం లేని నిర్మాణాలు కూడా ప్రతిపాదించారన్న ఆరోపణలున్నాయి. ఉదాహరణకు అంతకు మునుపే పూర్తిస్థాయి మరమ్మతులు చేపట్టి బాగుపరిచిన గోవిందరాజస్వామి సత్రాలను పూర్తిగా కూల్చివేసి కొత్తగా నిర్మించేందుకు ఏకంగా రూ. 600 కోట్లు కేటాయించారు. అలాగే నిక్షేపంగా వున్న స్విమ్స్ భవనాలను తొలగించి కొత్తగా నిర్మించేందుకు రూ. 300 కోట్లు కేటాయించారు. తిరుపతి నగరంలో రోడ్ల నిర్మాణానికి సైతం పెద్ద మొత్తంలో నిధులు కేటాయించడం వివాదం అయ్యింది.
అలిపిరి నుంచే బాదుడు మొదలు
తిరుమల కొండమీద వైసీపీ పాలనలో ధర పెంచనిదంటూ ఏదీ మిగల్లేదు. అలిపిరి టోల్‌గేట్ నుంచే ఈ బాదుడు మొదలుపెట్టారు. 15 రూపాలున్న కారు టోల్ ఫీజును ఏకంగా రూ.50లు కి పెంచేశారు. మినీ లారీ, మినీ బస్సులకు రూ. 50 నుంచీ రూ. వందకు పెంచారు.
లాడ్జీలతో పోటీపడేలా కాటేజీల అద్దెలు
కొండపై గతంలో పాంచజన్యం, కౌస్తుభం సముదాయాల్లోని గదుల అద్దె రూ. 500 చొప్పున నందకంలోని గదుల అద్దె రూ. 600 చొప్పున వుండగా వైసీపీ ప్రభుత్వం వచ్చాక రూ. వెయ్యి చేశారు. గతంలో 120 ఏసీ గదుల అద్దె రూ. వెయ్యి చొప్పున వుండగా రూ. 1500కు పెంచారు. అలాగే నారాయణగిరి 1, 2, 3 సముదాయాల్లో రూ. 150గా వున్న గదుల అద్దె ఒకేసారి రూ. 1700కు పెంచేశారు. నారాయణగిరి 4వ సముదాయంలో రూ. 750గా వున్న గదుల అద్దెను కూడా రూ. 1700కు పెంచారు. వాటిలోనే రూ. 200గా వున్న పెద్ద గదుల అద్దెను ఏకంగా రూ. 2200 చేశారు. స్పెషల్ టైప్ కాటేజీల అద్దెను సైతం రూ. 750 నుంచీ రూ. 2200కు, కొన్ని కార్నర్ సూట్లు రూ. 1500 నుంచీ రూ. 2800కు వంతున పెంచేశారు. ఇక వివిజీహెచ్ గదుల అద్దె రూ. 1500 నుంచీ రూ. 2200కు పెంచారు. తిరుమలలో పద్మావతీ అతిధి గృహాల ప్రాంతంలో రూ. వెయ్యి నుంచీ రూ. 3 వేల దాకా ఉండే గదుల అద్దెలు రూ. 6వేలకు చేరుకున్నాయి. సన్నిధానంలో గది అద్దె రూ. 6600 నుంచి రూ. 14 వేలకు పెంచేశారు.
ప్రసాదాల ధరల పెంపు
వైసీపీ పాలనలో పవిత్రమైన తిరుపతి లడ్డూ కూడా భక్తులకు అందని స్థితికి చేర్చారు. లడ్డూ నాణ్యతపై భక్తులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
టీడీపీ పాలనలో: బ్రేక్ దర్శన టికెట్‌పై రెండు లడ్డూలు, అలాగే ఏ ఆర్జిత సేవకు వెళ్ళినా రెండు లడ్డూలు, రూ. 300 టికెట్ భక్తులకు రెండు లడ్డూలు, నడక దారిభక్తులకు ఒక లడ్డూ చొప్పున ఉచితంగా అందేవి. సర్వదర్శన భక్తులకు రూ. 10 ధరతో రెండు లడ్డూలు, రూ. 25 ధరతో రెండు లడ్డూలు చొప్పున ఇచ్చేవారు.
వైసీపీ హయాంలో: లడ్డూలపై సబ్సిడీ రద్దు చేశారు. శ్రీవారిని దర్శించుకునే ప్రతి ఒక్కరికీ ఒక ఉచిత లడ్డూ ఇచ్చే విధానం ప్రారంభించినా, అదనపు లడ్డూ ధరను రూ. 25 నుంచీ రూ. 50కు పెంచారు. రూ. 300 టికెట్, రూ. 500 బ్రేక్ దర్శన టికెట్‌లతో సహా సుప్రభాతం, అర్చన, తోమాల, ఆర్జిత సేవల టికెట్లపై గతంలో ఇస్తుండిన రెండు లడ్డూలలో ఒక లడ్డూ కోత విధించారు. కళ్యాణోత్సవం టికెట్‌పై గతంలో కండువాతో పాటు పెద్ద లడ్డూ, వడ ఇవ్వగా ఇపుడు పెద్ద లడ్డూ, వడ ఇవ్వకుండా ఆ రెంటింటి బదులు చిన్న లడ్డూ ఒకటి ఇస్తున్నారు. తిరుప్పావై సేవ టికెట్ ధరను రూ. వంద నుంచీ రూ. 500కు పెంచేశారు.
క్యూ లైన్లలో అన్న పానీయాల కొరత
గతంలో క్యూలైన్లలో భక్తులకు ఎప్పటికప్పుడు తాగునీరు, మజ్జిగ, పాలు వంటి పానీయాలతో పాటు సాంబారు అన్నం, టిఫిన్లు అందించే వారు. ఇప్పుడవి సక్రమంగా అందడం లేదు. చిన్నపిల్లలు, వృద్ధులతో పాటు మధుమేహం వున్న వారితో వస్తున్న కుటుంబాలు క్యూలైన్లలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
అన్నదానంలో నాణ్యత ఏదీ?
రుచికి, శుచికి పేరుపడిన శ్రీవారి అన్న ప్రాసాదాలలో నాణ్యత కరువైందన్న ఫిర్యాదులు కూడా గత ఐదేళ్ళుగానే వస్తున్నాయి. ఉడకని అన్నం, పలుచని సాంబారు వంటివి భక్తుల అసంతృప్తికి కారణం అవుతున్నాయి.
బ్రేక్ వేళల మార్పుతో ఇబ్బందులు
వీఐపీ బ్రేక్ దర్శనం గతంలో వేకువజామున వుండేది. సుప్రభాతం, అర్చన, తోమాల సేవల సమయాల్లో కూడా సామాన్య భక్తులకు లఘు దర్శనం వుండేది. రాత్రి క్యూలైన్లలో వున్న భక్తులకు వేకువ జామునే దర్శనం అయిపోయేది. నైవేద్యం తర్వాత వీఐపీ బ్రేక్ దర్శనాలు ముగించి తిరిగి ఉదయం 10 గంటల నుంచీ సర్వ దర్శనం మొదలయ్యేది. వైసీపీ ప్రభుత్వంలో వీఐపీ బ్రేక్ దర్శన సమయాన్ని వేకువ జాము నుంచీ ఉదయం 9 గంటలకు మార్చడంతో మధ్యాహ్నం 2 నుంచీ సర్వ దర్శనం మొదలవుతోంది. వీఐపీలకు, సామాన్య భక్తులకు కూడా ఈ విధానం ఇబ్బంది కలిగిస్తోంది. దీనివల్ల వీఐపీలు రోజంతా గదులు ఖాళీ చేయడంలేదు. గదుల కొరత కూడా ఏర్పడుతోంది.
ఉద్యోగులకూ అసౌకర్యం
టీటీడీ ఉద్యోగులు ఇదివరకూ తమ కుటుంబాలతో వేకువ జామున వీఐపీ బ్రేక్ సమయంలో దర్శనం చేసుకుని తిరిగి తమ విధులకు యధాప్రకారం హాజరయ్యే వారు. ఇపుడు బ్రేక్ సమయం మార్చడంతో దర్శనం తర్వాత కనీసం ఒక పూట విధులకు హాజరు కాలేని పరిస్థితులు ఏర్పడ్డాయి.
పుట్ట గొడుగుల్లా హాకర్లు
వైసీపీ అధికారంలోకి వచ్చాక తిరుమలలో హాకర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చారు. ఎలాంటి లైసెన్సులు లేకపోయినప్పటికీ వైసీపీ నేతల అండదండలతో అనధికారికంగా తట్టలు పెరిగిపోయాయి. షాపింగ్ కాంప్లెక్స్, వరాహస్వామి కాంప్లెక్స్, వైకుంఠం, సప్తగిరి, అన్నదాన సత్రం, యాత్రికుల సముదాయం వంటి ప్రాంతాల్లో వందల కొద్దీ తట్టలు ఏర్పాటు చేసుకున్నారు. ఇందువల్ల అటు టీటీడీ అధికారులకూ, ఇటు వైసీపీ నేతలకూ కోట్లు ముడుతున్నాయనే ఆరోపణలున్నాయి.
కళ్యాణ మండపాల్లో అద్దెల మోత
తిరుపతిలో టీటీడీకి చెందిన శ్రీనివాస, పద్మావతీ కళ్యాణ మండపాల్లో అద్దె రూ. 6 వేల నుంచీ రూ. 7 వేల వరకూ వుండేది. మధ్యతరగతి ప్రజలకు ఇవి వరంలా ఉండేవి. వీటిలోనూ ప్రజలకు అందనంత అద్దెలు పెంచేశారు. శ్రీనివాస కళ్యాణ మండపాల్లో అద్దెలు రూ. 1.18 నుంచి రూ. 1.41 లక్షలు చేశారు. అలాగే పద్మావతీ కళ్యాణ మండపాల్లో రూ. 1.35 లక్షలకు పెంచేశారు.
తిరుచానూరులోనూ ధరల దరువు
తిరుచానూరు అమ్మవారి ఆలయంలోనూ పలు సేవల ధరలు పెంచి సదుపాయాల్లో కోత విధించారు. సుప్రభాత సేవ, ఏకాంతసేవ టికెట్ ధరలను రూ. 25 నుంచీ రూ. 50 చేశారు. సహస్ర నామార్చన సేవ టికెట్ రూ. 25 నుంచీ రూ. వందకు పెంచారు. తిరుప్పావడ సేవ టికెట్ ధర రూ. 600 నుంచీ రూ. వెయ్యికి పెంచారు. అభిషేకం సేవ టికెట్ రూ. 400 నుంచీ రూ. 500 చేశారు. అభిషేకానంతర దర్శనం టికెట్ రూ. 20 నుంచీ రూ. 250కు పెంచారు. కళ్యాణోత్సవ టికెట్‌పై ఇదివరకూ భక్తులకు అన్నప్రసాదం ఇస్తుండగా దాన్ని ఎత్తేశారు. పుష్పాంజలి సేవ టికెట్‌పై ప్రసాదాలతో పాటు ఇచ్చే క్యారీ బ్యాగ్‌కు కోత విధించారు. కుంకుమార్చన టికెట్ రూ. 200 నుంచీ రూ. 250కి పెంచారు. ఆ టికెట్‌పై ఇద్దరికి బదులు ఒకరినే అనుమతిస్తున్నారు. రెండు లడ్డూల బదులు ఒక లడ్డూనే ఇస్తున్నారు.