Share News

చెత్త చెత్తగా చిత్తూరు

ABN , Publish Date - Jan 05 , 2024 | 01:07 AM

చిత్తూరు చెత్తమయంగా మారింది. నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న కార్మికులు సమ్మెబాట పట్టడంతో చెత్త, వ్యర్థాలు పేరుకుపోతున్నాయి.

చెత్త చెత్తగా చిత్తూరు
టెలిఫోన్‌కాలనీలో చిందరవందరగా పడిఉన్న చెత్త

ఫ సమ్మెలో పారిశుధ్య కార్మికులు

చిత్తూరు, జనవరి 4: చిత్తూరు చెత్తమయంగా మారింది. నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న కార్మికులు సమ్మెబాట పట్టడంతో చెత్త, వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. సమాన పనికి సమానవేతనం, కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ కార్మికులు సమ్మెలోకి వెళ్లారు. దీంతో నగరంలో పారిశుధ్య పనులు నిలిచిపోయాయి. చిత్తూరు నగరపాలకసంస్థలో పర్మినెంట్‌, ఔట్‌సోర్సింగ్‌ కాంట్రాక్టు కార్మికులు కలిపి 488 మంది పని చేస్తున్నారు. వీరిలో 375 మంది ఔట్‌సోర్సింగ్‌, 113 మంది రెగ్యులర్‌ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో బుధవారం నుంచి ఔట్‌సోర్సింగ్‌ కార్మికులు సమ్మెలోకి వెళ్లడంతో నగరంలో పారిశుధ్య పనులు నిలిచిపోయాయి. నగరంలో 50 డివిజన్లలో 55వేల కుటుంబాల్లో 2.50 లక్షల మంది జనాభా ఉన్నారు. ప్రతిరోజూ 65 టన్నుల చెత్తను సేకరించి డంపింగ్‌యార్డుకు తరలిస్తున్నారు. కార్మికుల సమ్మెతో చాలాచోట్ల చెత్త సేకరణ నిలిచిపోయింది. టెలిఫోన్‌కాలనీ, తహసీల్దార్‌ కార్యాలయం ఎదురుగా, మార్కెట్‌, జంతువధశాల, విద్యుత్‌నగర్‌, ఇరువారంతో పాటు వాణిజ్య సముదాయాలు ఎక్కువగా ఉన్న చర్చివీధి, బజారువీధి తదితర ప్రాంతాల్లో చెత్త పేరుకుపోయింది. కాలువల్లో పూడిక తీయకపోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది. ప్రధాన రహదారుల్లో మట్టిపేరుకుపోయి దుమ్ముతో ప్రయాణికులు, వాహనదారులు అవస్థలు పడుతున్నారు.

100 మంది రోజువారీ కూలీలు

ఔట్‌సోర్సింగ్‌ కార్మికులు సమ్మెలోకి వెళ్లడంతో నగరపాలక అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టిసారించారు. బుధవారం కార్మికులు సమ్మెలోకి వెళ్లడంతో వందమంది దినసరికూలీలతో పాటు డ్రైవర్లను తీసుకున్నారు. వారితో చెత్త పనులు చేయించడంతో పాటు శానిటరీ ఇన్స్‌పెక్టర్లు, ఇతర సిబ్బందిని పర్యవేక్షకులుగా నియమించారు. 50 డివిజన్లకు వెయ్యి మంది పనిచేయాల్సిన చోట 488 మందే పనిచేస్తున్నారు. ఇప్పటికే ఉన్న కార్మికులతో రోజుమార్చి రోజు చెత్తను తొలగిస్తున్నారు. కార్మికుల సమ్మెతో ప్రత్యామ్నాయంగా వంద మందిని తీసుకున్నా పూర్తి స్థాయిలో చెత్తను ఎలా తొలగిస్తారని నగర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సమ్మె నేపథ్యంలో కమిషనరు అరుణ నగరంలో పర్యటించారు. చెత్తను ఇష్టారాజ్యంగా పడేయకుండా కార్మికులకుఅందించాలని స్థానికులు, దుకాణదారులను కోరారు. సహాయ కమిషనరు గోవర్ధన్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు చిన్నయ్య, నరసింహ, లోకనాథం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 05 , 2024 | 01:07 AM