Share News

తిరుపతి ఎంపీ అభ్యర్థిగా చింతా మోహన్‌

ABN , Publish Date - Apr 10 , 2024 | 02:09 AM

ఇండియా కూటమి పొత్తులో భాగంగా తిరుపతి అసెంబ్లీ సీటు సీపీఐకి వెళ్లడంతో ఎంపీ సీటు కూడా ఇతరులకు కేటాయిస్తారేమోనన్న అనుమానాలకు కాంగ్రెస్‌ అధిష్ఠానం తెరదించింది. మంగళవారం విడుదల చేసిన రెండోజాబితాలో తిరుపతి ఎంపీ అభ్యర్థిగా డాక్టర్‌ చింతా మోహన్‌కే అవకాశం కల్పించింది.

తిరుపతి ఎంపీ అభ్యర్థిగా చింతా మోహన్‌

తిరుపతి , ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి) : ఇండియా కూటమి పొత్తులో భాగంగా తిరుపతి అసెంబ్లీ సీటు సీపీఐకి వెళ్లడంతో ఎంపీ సీటు కూడా ఇతరులకు కేటాయిస్తారేమోనన్న అనుమానాలకు కాంగ్రెస్‌ అధిష్ఠానం తెరదించింది. మంగళవారం విడుదల చేసిన రెండోజాబితాలో తిరుపతి ఎంపీ అభ్యర్థిగా డాక్టర్‌ చింతా మోహన్‌కే అవకాశం కల్పించింది. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న చింతా మోహన్‌ రాష్ట్ర విభజన అనంతరం 2014, 2019 సాధారణ ఎన్నికల్లోనూ, 2021 ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ తరపున ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందారు. అయినా పార్టీనే అంటిపెట్టుకుని కాంగ్రెస్‌ జెండాను ఊరూ వాడా తిప్పారు. అయితే ఎంపీ సీటు తనకు వస్తుందని రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు అంజయ్య ఇటీవల మీడియా ముందు ఇండియా కూటమి తరపున స్వీయ ప్రకటన చేశారు. అసెంబ్లీ సీటుతో పాటు ఎంపీ సీటు కూడా ఇండియా కూటమికి వెళ్లే అవకాశాలున్నాయన్న వార్తల నేపథ్యంలో చింతా మోహన్‌ పదిరోజులుగా ఢిల్లీలో మకాం వేశారు.ఎట్టకేలకు ఏఐసీసీలో తనకున్న ప్రాబల్యాన్ని మరోసారి చాటుకున్నారు. ఆయన తిరుపతి ఎంపీగా ఉప ఎన్నికలతో కలిపి పదకొండోసారి పోటీ చేయబోతున్నారు.ఆరు సార్లు ఎంపీగా గెలిచి, ఒక పర్యాయం కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు.

Updated Date - Apr 10 , 2024 | 02:09 AM