చంద్రగిరి వైసీపీలో కలకలం
ABN , Publish Date - Jul 28 , 2024 | 02:01 AM
బెంగళూరు విమానాశ్రయంలో మోహిత్‌రెడ్డి అరెస్టు పనిచేయని చెవిరెడ్డి మంత్రాంగం... పలుకుబడి తండ్రీ కొడుకులు పరారీకి యత్నించారంటూ ప్రచారం

తిరుపతి, జూలై 27 (ఆంధ్రజ్యోతి): దుబాయ్ విమానమెక్కేందుకు ప్రయత్నిస్తూ తుడా మాజీ ఛైర్మన్ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి శనివారం రాత్రి బెంగళూరు విమానాశ్రయంలో అరెస్టు కావడం చంద్రగిరి నియోజకవర్గ వైసీపీలో కలకలం రేపింది. అతనితో పాటు దుబాయ్ వెళ్ళేందుకు బయల్దేరిన తండ్రి చెవిరెడ్డి భాస్కర రెడ్డి, తమ్ముడు హర్షిత్‌రెడ్డి ఈ ఘటనతో ప్రయాణం విరమించుకున్నారు. మోహిత్‌ను ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్న సమయంలో వారితో వాదనకు దిగిన చెవిరెడ్డిని కూడా విమానాశ్రయ అధికారులు నిర్బంధించారు. తండ్రీ కొడుకులు ముగ్గురూ దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నించారన్న ప్రచారం మొదలైంది. ఈ ఘటనల నేపధ్యంలో చంద్రగిరి వైసీపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో చంద్రగిరి నుంచీ టీడీపీ అభ్యర్థిగా పులివర్తి నాని, వైసీపీ అభ్యర్థిగా చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి పోటీ పడిన సంగతి తెలిసిందే. పోలింగ్ రోజు రెండు మూడు గ్రామాల్లో జరిగిన ఘర్షణల నేపధ్యంలో పోలింగ్ మరునాడు కౌంటింగు కేంద్రమైన తిరుపతి మహిళా వర్శిటీ ఎదుట టీడీపీ అభ్యర్థి పులివర్తి నానీపై హత్యాయత్నం జరిగింది. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి అనుచరులు జరిపిన ఈ భయానక దాడిలో నానీ తృటిలో తప్పించుకున్నారు. ఈ ఘటన చంద్రగిరి నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. ప్రతీకార దాడుల్లో పలువురు గాయపడగా, కొన్ని వాహనాలు సైతం ధ్వంసమయ్యాయి. నానీ గన్‌మెన్ జరిపిన కాల్పుల్లో కూడా ఇద్దరు గాయపడ్డారు. పోలింగ్ మరుసటి రోజు ఈవీఎంలు భద్రపరిచిన మహిళా వర్శిటీ ప్రాంగణంలోనే ప్రధాన రాజకీయ పార్టీ అయిన టీడీపీ అభ్యర్థిపై హత్యాయత్నం జరగడాన్ని ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణించింది. దీనిపై విచారణకు ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేసింది. ఈ కేసులో ఇప్పటికే 37మంది అరెస్టు అయి రిమాండులో వున్నారు. వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ప్రోద్బలంతోనే హత్యాయత్నం జరిగిందంటూ కేసులో అతన్ని కూడా నిందితుడిగా చేర్చారు. తనను అరెస్టు చేస్తారనే ఉద్దేశంతో మోహిత్ హైకోర్టులో ముందస్తు బెయిల్‌కు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు మరికొంత గడువు కావాలని ప్రాసిక్యూషన్ కోరడంతో వాయిదా వేస్తూ వచ్చింది. తదుపరి విచారణ ఈనెల 29న సోమవారం జరగాల్సి వుంది. అయితే ఈలోపు మోహిత్‌రెడ్డి బెంగళూరు నుంచీ దుబాయ్ వెళ్ళే ప్రయత్నంలో విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులకు పట్టుబడ్డారు. వారు అదుపులోకి తీసుకుని తిరుపతి పోలీసులకు సమాచారమిచ్చారు.అరెస్టు చేసేందుకు తిరుపతి పోలీసులు హుటాహుటిన బెంగళూరు బయల్దేరి వెళ్ళారు. ఆదివారం వేకువజామున మోహిత్‌ను తిరుపతి తీసుకొచ్చి అరెస్టు చూపించే అవకాశముంది.దీంతో హైకోర్టులో మోహిత్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ఇపుడు నిరర్ధకమైనట్టుగా భావించాల్సివుంది. హైకోర్టులో కొత్తగా బెయిల్ పిటిషన్ మళ్ళీ వేయాల్సి వుంటుంది.
తండ్రీ కొడుకులు పారిపోయే ప్రయత్నం చేశారంటూ ప్రచారం
మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి, ఆయన కుమారులు మోహిత్, హర్షిత్ దుబాయ్ వెళ్ళే క్రమంలో మోహిత్ పట్టుబడడంతో ఈ ముగ్గురూ దుబాయ్ పారిపోయే ప్రయత్నం చేశారన్న ప్రచారం మొదలైంది. వాస్తవానికి పులివర్తి నానీ తనపై జరిగిన హత్యాయత్నం కేసులో చెవిరెడ్డి భాస్కర రెడ్డి, ఆయన తనయులు , తమ్ముడు రఘునాఽథ రెడ్డి తదితరుల పాత్ర వుందని, వారిని నిందితులుగా కేసులో చేర్చాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతానికి మోహిత్‌రెడ్డిని నిందితుడిగా కేసులో చేర్చిన పోలీసులు తర్వాతి దశలో చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఆయన సోదరుడు రఘునాథరెడ్డి, కుమారుడు హర్షిత్‌రెడ్డి పేర్లు కూడా కేసులో చేర్చే అవకాశాలు లేకపోలేదు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో కక్ష సాధింపు చర్యలు, వేధింపులు వుంటాయని, ఈ కేసులో అరెస్టు కూడా చేయచ్చనే అంచనాతో తండ్రీ కొడుకులు ముగ్గురూ దుబాయ్ వెళ్ళిపోయే ప్రయత్నం చేశారనే ప్రచారం జరుగుతోంది.ఇది నిజమైనా కాకపోయినా ఈ తరహా ప్రచారం జరుగుతుండడంతో చంద్రగిరి వైసీపీ శ్రేణులు ఆందోళనలో పడ్డాయి.స్నేహితుడి పెళ్ళి వుంటే మోహిత్ ఒక్కరే బయల్దేరి ఆ క్రమంలో అరెస్టయినా సమాధానం చెప్పుకునే పరిస్థితి వుండేదని, అలా కాకుండా తండ్రీ కొడుకులు ముగ్గురూ దుబాయ్ బయల్దేరడం ఈ ప్రచారానికి ఊతమిస్తోందని సొంత పార్టీ వర్గాలు వాపోతున్నాయి. అన్ని స్థాయుల్లో పలుకుబడి, మంత్రాంగం చేయగలిగిన శక్తిసామర్థ్యాలున్న చెవిరెడ్డి తనయుడి అరెస్టును అడ్డుకోలేకపోవడం కూడా శ్రేణుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీసినట్టవుతోంది. ఉన్నత న్యాయస్థానాల నుంచీ రక్షణ పొందలేకపోవడం కూడా కార్యకర్తల స్థైర్యం సడలేందుకు కారణమవుతోంది. చెవిరెడ్డి, ఆయన కుటుంబం స్థాయిలోనే ఇలా వుంటే తమ పరిస్థితి ఏమిటన్న ఆలోచన వారిలో ఆందోళన రేకెత్తిస్తోంది. కాగా విదేశాల్లో చదివిన తన కొడుకును వీధి పోరాటాలకు సిద్ధం చేస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి శనివారం రాత్రి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తన కొడుకు వయసు 25 ఏళ్ళని, విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి ప్రజా జీవితంలోకి వచ్చాడని పేర్కొన్నారు. అలాంటి వాడిని అక్రమ కేసులో అరెస్టు చేయించారని, వీధి పోరాటాలకు సిద్ధం చేస్తున్నారని పేర్కొన్నారు. దీనికి చంద్రబాబుకు కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు.ప్రజల పక్షాన ఏ స్థాయి పోరాటానికైనా తాము సిద్ధంగా వున్నామని ప్రకటించారు.