Share News

చంద్రగిరి వైసీపీకి దెబ్బ మీద దెబ్బ

ABN , Publish Date - Apr 22 , 2024 | 02:32 AM

చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ముఖ్యనేతలు తమను ఎదగనివ్వకుండా అడ్డుకుంటున్నారని ఐదేళ్ళ నుంచీ తీవ్ర అసంతృప్తిని అణచిపెట్టుకుని వున్న పలువురు గ్రామ, మండల స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు ఎన్నికల వేళ ఆ పార్టీని వీడి టీడీపీలో చేరుతున్నారు.

చంద్రగిరి వైసీపీకి దెబ్బ మీద దెబ్బ
నారా లోకేశ్‌ సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నేతలు

టీడీపీలోకి మాజీ జడ్పీటీసీ సరితా రమణమూర్తి, బడి సుధా యాదవ్‌, గణపతి నాయుడు

లోకేష్‌ సమక్షంలో చేరిన పలువురు నేతలు

టీడీపీలో అంతకంతకూ పెరుగుతున్న జోష్‌

తిరుపతి, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ముఖ్యనేతలు తమను ఎదగనివ్వకుండా అడ్డుకుంటున్నారని ఐదేళ్ళ నుంచీ తీవ్ర అసంతృప్తిని అణచిపెట్టుకుని వున్న పలువురు గ్రామ, మండల స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు ఎన్నికల వేళ ఆ పార్టీని వీడి టీడీపీలో చేరుతున్నారు. తాజాగా ఆదివారం రాష్ట్ర ఓబీసీ ఫోరమ్‌ కన్వీనర్‌, తిరుపతి రూరల్‌ మండల పరిధిలోని పుదిపట్ల సర్పంచ్‌ బడి సుధా యాదవ్‌, పద్మావతీపురం మాజీ సర్పంచ్‌ గణపతి నాయుడు, అతడి భార్య తిరుచానూరు మార్కెట్‌ కమిటీ మాజీ ఛైర్‌పర్సన్‌ శ్రీవిద్య, చంద్రగిరి మాజీ జడ్పీటీసీ సరితా రమణమూర్తిలతో పాటు పలువురు గ్రామ, మండల నాయకులు ఉండవల్లిలో నారా లోకేశ్‌ సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానీ వారిని యువనేతకు పరిచయం చేశారు. అందరికీ పార్టీ కండువాలు కప్పిన లోకేశ్‌ చంద్రగిరిలో టీడీపీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీపై నమ్మకముంచి చేరిన వారికి మంచి భవిష్యత్తు వుంటుందని భరోసా ఇచ్చారు. యువనేత సమక్షంలో పార్టీలో చేరిన వారిలో వైసీపీ సీనియర్‌ నాయకుడు రమణ, పుదిపట్ల ఎంపీటీసీ శ్రీకాంత్‌, సాయినగర్‌ ఎంపీటీసీ వినోద్‌, మల్లంగుంట మాజీ సర్పంచ్‌ దిలీప్‌, పుదిపట్ల ఉప సర్పంచ్‌ మునిరత్నం నాయుడు, శ్రీనివాసపురం ఉప సర్పంచ్‌ సునీల్‌, విండో డైరెక్టర్‌ మునికృష్ణారెడ్డి తదితరులున్నారు.

ముఖ్య నేతల చేరికతో వైసీపీకి కోలుకోలేని దెబ్బ

చంద్రగిరి నియోజకవర్గంలో ఎక్కడికక్కడ సొంత బలం కలిగిన సుధా యాదవ్‌, గణపతి నాయుడు, మునికృష్ణారెడ్డి తదితరులు టీడీపీలో చేరడంతో వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. వీరిలో మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి అనుచరుడైన సుధా యాదవ్‌ గత ఎన్నికల తర్వాత వైసీపీలో చేరినప్పటికీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తనను ఎదగనివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ ఎదురు తిరిగారు. తిరుపతి రూరల్‌ పుదిపట్ల పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీ చేసిన అతడిని వైసీపీ నేతల ఒత్తిళ్ళతో పోలీసు అధికారులు ముప్పుతిప్పలు పెట్టారు. పలు కేసులు పెట్టారు. చెవిరెడ్డి కుటుంబం యావత్తూ పుదిపట్లలోనే మకాం వేసింది. అయినా 500 పైచిలుకు ఓట్ల మెజారిటీతో సుధా యాదవ్‌ సర్పంచుగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచీ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఓ దశలో గల్లా కుటుంబం మద్దతుతో చంద్రగిరి టీడీపీ టికెట్‌ కోసం గట్టిగా ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే పులివర్తి నానీ నియోజకవర్గంలో పాతుకుపోవడం, పార్టీ శ్రేణుల్లో పట్టు పెంచుకోవడం, దానికి తోడు అదివరకే నారా లోకేశ్‌ ఆయన్ను అభ్యర్థిగా ప్రకటించేసి వుండడంతో సుధా యాదవ్‌ ప్రయత్నాలు ఫలించలేదు. పులివర్తి నానీ చొరవ తీసుకుని సుధా యాదవ్‌ను అటు అధినేత చంద్రబాబుతోనూ, ఇటు యువనేత నారా లోకేశ్‌తోనూ కలిపి మాట్లాడించారు. పార్టీలో చేరి విజయానికి కృషి చేయాలని, భవిష్యత్తులో తప్పక ప్రాధాన్యత ఇస్తామని వారిద్దరూ హామీ ఇవ్వడంతో ఆదివారం ఆయన టీడీపీలో చేరిపోయారు. పద్మావతీపురం మాజీ సర్పంచ్‌ గణపతి నాయుడుకు స్థానికంగా ప్రజాబలముంది. ఆయన చేరిక కూడా నిస్సందేహంగా తిరుపతి రూరల్‌ తిరుచానూరు, పరిసర ప్రాంతాల్లో టీడీపీని బలోపేతం చేసింది.

ఇటీవలే చేరిన పలువురు ప్రముఖులు

కొద్ది నెలల కిందట తిరుచానూరు మాజీ సర్పంచ్‌ సీఆర్‌ రాజన్‌ వైసీపీ నుంచీ టీడీపీలే చేరగా ఇటీవలే ఆయనను చిత్తూరు పార్లమెంటు అధ్యక్షుడిగా పార్టీ నియమించింది. టికెట్‌ ఆశించిన డాలర్స్‌ దివాకర్‌ రెడ్డి సైతం కొద్ది రోజుల కిందట చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. అదే విధంగా చంద్రగిరి మండలంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఈవీ రమణమూర్తి, మార్కెట్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ ముడిపల్లి సురేష్‌రెడ్డి, పాకాల జడ్పీటీసీ నంగా పద్మజారెడ్డి, ఆమె భర్త నంగా బాబురెడ్డి, ఎంపీటీసీ కస్తూరి, మాజీ ఎంపీపీ లక్ష్మీకాంతమ్మ, మాజీ సర్పంచ్‌ జ్ఞానేశ్వరి, మాజీ ఏఎంసీ ఛైర్మన్‌ లింగయ్యనాయుడు, చిన్నగొట్టిగల్లు వైస్‌ ఎంపీపీ సునీత, ఆమె భర్త దామోదర్‌, ఆర్సీపురంలో నీలకంఠ చౌదరి తదిరులు వైసీపీని వీడి టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. నియోజకవర్గంలో ఇలాంటి అంగబలం, అర్థబలం కలిగిన నాయకులు చేరుతుండడంతో టీడీపీ శ్రేణుల్లో నైతిక స్థైర్యం ఇనుమడిస్తోంది. అదే సమయంలో అధికార పార్టీ వర్గాలు వరుస వలసలతో డీలా పడుతున్నాయి.

Updated Date - Apr 22 , 2024 | 02:32 AM