Share News

డీజేలు వాడితే కేసులు పెడతాం: జేసీ

ABN , Publish Date - Mar 28 , 2024 | 12:48 AM

రాజకీయ పార్టీలు మైక్‌, స్పీకర్‌కు అనుమతి తీసుకొని ప్రచారాల్లో డీజే స్పీకర్లతో వైలేషన్‌ చేస్తున్నారని, దీనిపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయని జేసీ శ్రీనివాసులు తెలిపారు.

డీజేలు వాడితే కేసులు పెడతాం: జేసీ
సమావేశంలో మాట్లాడుతున్న జేసీ శ్రీనివాసులు

చిత్తూరు రూరల్‌, మార్చి 27: రాజకీయ పార్టీలు మైక్‌, స్పీకర్‌కు అనుమతి తీసుకొని ప్రచారాల్లో డీజే స్పీకర్లతో వైలేషన్‌ చేస్తున్నారని, దీనిపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయని జేసీ శ్రీనివాసులు తెలిపారు. దీనిపై శనివారం జరిగిన రాజకీయ పార్టీల సమావేశంలో హెచ్చరించనున్నట్లు తెలిపారు. అయినా తీరు మారకుంటే కేసులు నమోదు చేస్తామన్నారు. చిత్తూరు నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి అయిన ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ప్రచారాలు, ర్యాలీలు, సమావేశాల నిర్వహణకు 48 గంటల ముందే అనుమతులు తీసుకోవాలని చెప్పారు. కోడ్‌ ఉల్లంఘన జరుగుతుంటే ప్రజలు సీ-విజిల్‌ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయాలన్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఏఆర్‌వో అరుణ, డీఎస్పీ రాజగోపాల్‌, చిత్తూరు, గుడిపాల తహసీల్దార్లు శ్రీనివాసులు రెడ్డి, విజయలక్ష్మి, చిత్తూరు ఎంపీడీవో సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రోజువారి నివేదికల రికార్డులు నమోదు చేయాలి

చిత్తూరు కలెక్టరేట్‌: ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏర్పాటు చేసిన బృందాలు రోజువారి నివేదిక రికార్డులు సక్రమంగా నమోదు చేయాలని జేసీ శ్రీనివాసులు అన్నారు. బుధవారం డీఆర్వో పుల్లయ్యతో కలసి నోడల్‌ ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. త్వరలో జిల్లాకు ఎన్నికల పరిశీలకులు రానున్నారని, వారికి ఇకపై రోజువారి నివేదికల రిజిస్టర్లు అందించాల్సి ఉంటుందన్నారు. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు ఒక షిఫ్టు, రాత్రి 8 నుంచి ఉదయం 8 గంటల వరకు రెండో షిఫ్టుగా బృందాలు పనిచేయాలన్నారు.

ఇప్పటి వరకు రూ.36లక్షల నగదు సీజ్‌

తమ ప్రచారాలకోసం రాజకీయ పార్టీలు దరఖాస్తు చేసుకున్న వెంటనే ప్రాధాన్యత మేర ఆన్‌లైన్‌ ద్వారా అనుమతులిస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ అన్నారు. బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ముఖే్‌షకుమార్‌ మీనా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. అనుమతులు లేకుండా, ఎటువంటి బిల్లులు లేకుండా తీసుకువెళ్తున్న రూ.36లక్షల నగదును సీజ్‌ చేసినట్లు వెల్లడించారు. అందిన ఫిర్యాదులకోసం ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేశామని, సెల్‌ ద్వారా ఎప్పటికప్పుడు ఫిర్యాదులను బృందాలకు పంపి వెనువెంటనే పరిష్కారం చేస్తున్నట్లు చెప్పారు.

వలంటీర్లు రాజీనామా చేసి ప్రచారంలో పాల్గొనవచ్చు

చిత్తూరు రూరల్‌: వలంటీర్లు రాజీనామా చేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనవచ్చునని జేసీ శ్రీనివాసులు బుధవారం తెలిపారు. ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం పొందుతున్న వారు.. రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో పాల్గొనకూడదన్నారు. రాజీనామా చేస్తే పాల్గొనవచ్చన్నారు. రాజీనామా చేసిన వారి స్థానాల్లో పక్క వార్డు వలంటీరుకు బాధ్యతలు అప్పగిస్తామన్నారు.

Updated Date - Mar 28 , 2024 | 12:48 AM