Share News

ముగిసిన ప్రచార హోరు

ABN , Publish Date - May 12 , 2024 | 02:29 AM

జిల్లాను హోరెత్తించిన ప్రధాన రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రం ఆరు గంటలతో ముగిసింది. పోలింగ్‌కు ఇక ఒక్క రోజే గడువుంది.

ముగిసిన ప్రచార హోరు

రేపే పోలింగ్‌

పోల్‌ మేనేజ్మెంట్‌పై పార్టీల దృష్టి

టీడీపీలో గెలుపుపై జోష్‌

కలిసొచ్చిన కూటమి పార్టీలు

వైసీపీలో చల్లారని అసంతృప్తులు

జిల్లాను హోరెత్తించిన ప్రధాన రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రం ఆరు గంటలతో ముగిసింది. పోలింగ్‌కు ఇక ఒక్క రోజే గడువుంది. దీంతో ప్రధాన పార్టీలు పంపకాలు, పోల్‌ మేనేజ్‌మెంట్‌పై దృష్టి పెట్టాయి. గత నెల 18న నోటిఫికేషన్‌ జారీ అయ్యాక అన్ని నియోజకవర్గాల్లోనూ రాజకీయ సమీకరణలు వేగంగా మారాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీల నడుమ ఐక్యత ఏర్పడింది. ఇక, టికెట్‌ ఆశించి.. రానివారిలో చిన్నపాటి అసంతృప్తులున్నా తొలగిపోయాయి. రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్న లక్ష్యంతో పార్టీ గెలుపుకోసం కృషి చేస్తున్నారు. చివరి రోజైన శనివారం చిత్తూరులో చంద్రబాబు ముగింపు సభ పెట్టడం ఆ పార్టీలో జోష్‌ నింపింది. జిల్లాలో జరిగిన సభల్లో చంద్రబాబు స్థానికంగా చేపట్టనున్న అభివృద్ధి పనుల గురించీ హామీలిచ్చారు. వైసీపీ అధినేత జగన్‌ స్థానికాంశాలను ప్రస్తావించకపోవడంపై ప్రజలతో పాటు వైసీపీ శ్రేణుల్లోనూ అసంతృప్తి నెలకొని ఉంది. మరోవైపు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, రాష్ట్ర వ్యాప్తంగా కూటమికి లభిస్తున్న ఆదరణ నేపథయంలో జిల్లాలోని టీడీపీలోకి భారీగా వలసలు జరిగాయి.

ఫ కుప్పంలో చంద్రబాబుకు లక్ష మెజారిటీ లక్ష్యంగా నేతలు, శ్రేణులు ముందుకు సాగుతున్నారు. నారా భువనేశ్వరి రెండు రోజులపాటు విస్తృతంగా ప్రచారం చేశారు. అదే సమయంలో వైసీపీలో అంతర్గత విభేదాలతో సతమతమవుతోంది.

ఫ పలమనేరులో నేతలు, కార్యకర్తలతో కలిసి కట్టుగా అమరనాథరెడ్డి ప్రచారం సాగించారు. వైసీపీ అభ్యర్థి వెంకటేగౌడను అవినీతి, ఆక్రమణల ఆరోపణలు, పార్టీలో సమన్వయలేమి, అసమ్మతి వెన్నాడుతున్నాయి.

ఫ నగరిలో గాలి భానుప్రకాష్‌ అందరినీ కలుస్తూ.. ప్రచారంలో ముందుకు వెళుతున్నారు. మంత్రి రోజాతో విభేదించిన నేతలంతా టీడీపీలో చేరడం ఆయనకు అదనంగా కలిసొచ్చే బలం. ఇక, రోజా సోదరులపై వచ్చిన అవినీతి ఆరోపణలు వైసీపీకి నష్టం కలిగించే అంశాలు.

ఫ చిత్తూరులో కీలక నాయకులంతా ఒక్కటిగా చేరడంతో టీడీపీ బలం రెట్టింపైంది. చంద్రబాబు సభ సక్సె్‌సతో జోష్‌తో ఉన్నారు. ఇక, వైసీపీ అభ్యర్థి విజయానందరెడ్డి మీద ఎర్రచందనం స్మగ్లింగ్‌ కేసులు.. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జనసేనలోకి వెళ్లడం.. బుల్లెట్‌ సురేష్‌ స్తబ్ధుగా ఉండడం ఆందోళన కలిగించే అంశాలు.

ఫ పూతలపట్టులో ఈసారి గెలవాలన్న కసితో టీడీపీ శ్రేణులు పనిచేస్తున్నాయి. సీనియర్‌ నేతలు, శ్రేణులను మురళీమోహన్‌ కలుపుకొని వెళుతున్నారు. వైసీపీలో అసంతృప్తులు, ఎమ్మెల్యే ఎంఎ్‌సబాబు కాంగ్రె్‌సలో పోటీ చేయడం సునీల్‌కుమార్‌పై తీవ్ర ప్రభావం చూపనుంది.

ఫ జీడీనెల్లూరులోనూ టీడీపీ అభ్యర్థి థామస్‌ విస్తృతంగా ప్రచారం చేపట్టారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామి మీద ఉన్న తీవ్ర వ్యతిరేకత.. ఈయన మేనల్లుడు రమేష్‌ కాంగ్రెస్‌ నుంచి పోటీ చేయడం.. వైసీపీ అభ్యర్థి అయిన కృపాలక్ష్మి మీద ప్రభావం చూపిస్తోంది.

ఫ పుంగనూరులో పెద్దిరెడ్డి అరాచకాలు, దౌర్జన్యాలు, విధ్వంసాన్ని టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి, శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లారు. వైసీపీ అణచివేత ధోరణిపై జనంలోనూ అసహనం ఉంది. ఇక బీసీవై నేత రామచంద్రయాదవ్‌ కూడా బరిలో ఉన్నారు.

ఫ చిత్తూరు పార్లమెంటులో వైసీసీ ఎంపీ అభ్యర్థి రెడ్డెప్ప డమ్మీ అని, పెద్దిరెడ్డి కాళ్ల దగ్గరి మనిషి అని పేరుంది. టీడీపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు చదువుకున్న ఉన్నత అధికారి కావడంతో దళితులు టీడీపీ వైపు ఆకర్షితులవుతున్నారు.

పంపకాలపై దృష్టి

ప్రభుత్వ వ్యతిరేకత, అసంతృప్తుల నేపథ్యంలో వైసీపీ తాయిలాలపైనే దృష్టి పెట్టంది. కుప్పంలో ఏకంగా రూ.4 వేలు చొప్పున పంపిణీ చేశారు. చిత్తూరు, పలమనేరులో ఇరుపార్టీలూ రూ.2 వేలు చొప్పున పంపిణీ చేస్తున్నారు. పుంగనూరులో వైసీపీ అధికంగా రూ.3 వేలు చొప్పున ఇస్తోంది. పూతలపట్టు, జీడీనెల్లూరు ప్రాంతాల్లో ఏరియాను బట్టి రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకు ఇస్తున్నారు. కాగా, పొరపాటున ఎవరైనా ఓ ఇల్లు మిస్‌ అయిపోతే, పంపిణీ చేసిన వ్యక్తి ఇంటికెళ్లి మరీ ఓటు డబ్బులివ్వమని చాలాచోట్ల జనం డిమాండు చేస్తున్నారు.

Updated Date - May 12 , 2024 | 08:06 AM