తిరుమల ఘాట్‌లో అదుపు తప్పిన బస్సు
ABN , Publish Date - Apr 02 , 2024 | 01:06 AM
తిరుమల ఘాట్ రోడ్డులో సోమవారం పెనుప్రమాదం తప్పింది. ముందు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పింది.
చెట్టును ఢీకొని ఆగడంతో బయటపడిన ప్రయాణికులు
తిరుమల, ఏప్రిల్1(ఆంధ్రజ్యోతి): తిరుమల ఘాట్ రోడ్డులో సోమవారం పెనుప్రమాదం తప్పింది. ముందు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పింది. చెట్టును ఢీకొనడంతో లోయలోకి దూసుకుపోకుండా ప్రమాదం తప్పింది. విజిలెన్స్ అధికారులు వివరాల మేరకు.. ఏపీ 03 జెడ్ 5617 నెంబరు గల ఆర్టీసీ బస్సు 15 ప్రయాణికులతో సోమవారం మధ్యాహ్నం తిరుపతి నుంచి తిరుమలకు బయలుదేరింది. హరిణి ప్రాంతానికి సమీపంలో ముందు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయే క్రమంలో అదుపుతప్పి ఎడమవైపు పిట్టగోడను బలంగా ఢీకొంది. గోడసైతం పగిలిపోవడంతో ముందుకు దూసుకువెళ్లి చెట్టును ఢీకొని ఆగిపోయింది. బస్సులోని ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. చెట్టు లేకుంటే లోయలోకి దూసుకుపోయి పెద్ద ప్రమాదం వాటిల్లి ఉండేది. విషయం తెలుసుకున్న పోలీసులు, విజిలెన్స్ అధికారులు ఘటనా ప్రాంతానికి చేరుకుని విచారణ మొదలుపెట్టారు. ప్రమాద నేపథ్యంలో కొంతసేపు వాహనాలు నిలిచిపోయాయి. బస్సును పక్కకు తొలగించి ట్రాఫిక్ సమస్య లేకుండా చర్యలు తీసుకున్నారు.