Share News

నిరసన ప్రదర్శనలతో ‘భారత్‌ బంద్‌’

ABN , Publish Date - Feb 17 , 2024 | 12:22 AM

కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రైతు, కార్మిక వర్గం శుక్రవారం చేపట్టిన భారత్‌ బంద్‌.. నిరసన ప్రదర్శనలతో ముగిసింది.

నిరసన ప్రదర్శనలతో ‘భారత్‌ బంద్‌’
గాంధీ విగ్రహం ఎదుట నిరసన ప్రదర్శనలు చేస్తున్న కార్మిక, రైతు, ప్రజా సంఘాల నేతలు

చిత్తూరు రూరల్‌, ఫిబ్రవరి 16: కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రైతు, కార్మిక వర్గం శుక్రవారం చేపట్టిన భారత్‌ బంద్‌.. నిరసన ప్రదర్శనలతో ముగిసింది. దుకాణాలు, కార్యాలయాలు యథావిధిగా పనిచేశాయి. బస్సులు, ఆటోలు తిరిగాయి. రైతు, కార్మిక సంఘాల నేతలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చిత్తూరులో నిరసన ప్రదర్శనగా గాంధీ విగ్రహం వద్దకు చేరిన నేతలు.. కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మోదీ ప్రభుత్వం తుంగలో తొక్కడమే కాక రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందని విమర్శించారు. కార్మికులకు నష్టం కలిగించే లేబర్‌ కోడ్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండు చేశారు. ఉపాధి హామీ పథకానికి రూ.2 లక్షల కోట్లు కేటాయిస్తూ 200 రోజులు పని కల్పించాలన్నారు. ఆహార భద్రత చట్టాన్ని పటిష్ఠం చేయాలని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలన్నారు. ఏఐటీయూసీ, సీఐటీయూ నేతలు నాగరాజు, సురేంద్రన్‌, చైతన్య, సురేష్‌, దొరస్వామి, జయశంకర్‌, సుగుణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 17 , 2024 | 12:22 AM