Share News

బెంచీలు తీసేయాల్సిందే

ABN , Publish Date - Jan 30 , 2024 | 11:56 PM

వాకింగ్‌ సమయంలో సేద తీరేందుకు బెంచీలు ఏర్పాటు చేయాలని వాకర్స్‌ అడిగారు. ఆ మేరకు చిత్తూరు కట్టమంచి చెరువు కట్టపై జీజేఎం ట్రస్టు చైర్మన్‌, టీడీపీ నేత గురజాల జగన్మోహన్‌ బెంచీలు ఏర్పాటు చేశారు. వీటికి అనుమతి లేదంటూ మంగళవారం నగరపాలక సంస్థ అధికారులు వచ్చి తొలగించేందుకు యత్నించారు.

బెంచీలు తీసేయాల్సిందే
బెంచీలను లారీలో ఎక్కిస్తున్న నగరపాలక సిబ్బంది

ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం

కమిషనరు అత్యుత్సాహం

కట్టమంచి చెరువు కట్టపై జీజేఎం ట్రస్టు ఏర్పాటు చేసిన బెంచీల తొలగింపు

వైసీపీ నేతల ఒత్తిడితో ఇలా చేశారంటూ టీడీపీ ఆగ్రహం

చిత్తూరు, జనవరి 30: వాకింగ్‌ సమయంలో సేద తీరేందుకు బెంచీలు ఏర్పాటు చేయాలని వాకర్స్‌ అడిగారు. ఆ మేరకు చిత్తూరు కట్టమంచి చెరువు కట్టపై జీజేఎం ట్రస్టు చైర్మన్‌, టీడీపీ నేత గురజాల జగన్మోహన్‌ బెంచీలు ఏర్పాటు చేశారు. వీటికి అనుమతి లేదంటూ మంగళవారం నగరపాలక సంస్థ అధికారులు వచ్చి తొలగించేందుకు యత్నించారు. ప్రజావసరాలకు ఏర్పాటు చేశామని.. అనుమతికి దరఖాస్తు చేసుకుంటామని టీడీపీ నేతలు చెప్పినా పట్టించుకోలేదు. ముందు తీసేయండి.. ఏమైనా ఉంటే ఆ తర్వాత మాట్లాడుకుందామంటూ కమిషనరు అరుణ స్పష్టంచేశారు. మున్సిపల్‌ అధికారుల అత్యుత్సాహం వెనుక వైసీపీ నేతలు ఉన్నారంటూ టీడీపీ నేతలు ఆగ్రహించారు. ఆరు నెలలుగా జీజేఎం ట్రస్టు తరపున గురజాల జగన్మోహన్‌ చిత్తూరు నియోజకవర్గంలో పలు సేవా కార్యక్ర మాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో వాకర్స్‌ అసోసియేషన్‌ నేతల విజ్ఞప్తి మేరకు రెండు రోజుల కిందట కట్టమంచి చెరువు కట్ట మీద బెంచీలను ఏర్పాటు చేశారు. వాటిపై గురజాల జగ న్మోహన్‌, జీజేఎం చారిటబుల్‌ పౌండేషన్‌ చైర్మన్‌ అని ఉంది. బెంచీలకు పసుపు రంగు ఉంది. నగరపాలక అధికారులు మంగళవారం అక్కడకు చేరుకుని బెంచీలు పెట్టడానికి అనుమతి లేదని, తొలగించాలన్నారు. దీనిపై టీడీపీ నాయకులు.. వాకర్స్‌, అధికారుల మధ్య వాగ్వాదం జరుగుతుండగానే సిబ్బంది బెంచీలను లారీలో పెట్టేశారు. ఈ క్రమంలో కొన్ని విరిగిపోయాయి.

అధికారులను నిలదీసిన టీడీపీ నేతలు

టీడీపీ శ్రేణులతో పాటు మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్‌, పలువురు నేతలు అక్కడికి చేరుకున్నారు. ఇరిగేషన్‌కు సంబంధించి స్థలంలో బెంచీలను ఏర్పాటు చేస్తే నగరపాలక అధికారులకు అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. వాకర్స్‌, ప్రజలు సేదతీరడం వల్ల కలిగే నష్టమేంటని నిలదీశారు. నగరంలోనూ వైసీపీ ఫ్లెక్సీలను వదిలేసి తమవే తీసేయడంలో ఆంతర్యం ఏమిటంటూ ఆగ్రహించారు. వైసీపీ అరాచకాలకు అంతు లేకుండా పోతోందన్నారు. ప్రజలకు మంచి చేయకపోగా చేసే వారిని అడ్డుకోవడం తగదన్నారు. అనుమతి కోసం రెండు రోజులుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా, కమిషనర్‌ అందుబాటులో లేకపోవడంతో అలస్యమైందన్నారు. అధికారులు చేయాల్సిన పనిని దాతలు చేస్తుంటే ప్రోత్సహించాల్సింది పోయి అడ్డుకోవడం దారుణమన్నారు. సంఘటనా స్థలం వద్ద టీడీపీ నేతలిచ్చే వివరణనూ కమిషనరు అరుణ పట్టించుకోలేదు. బెంచీలను తొలగించాలంటూ కార్మికులను ఆదేశించారు. ‘వాకర్స్‌ అడిగితే ఏర్పాటు చేశాం. ఇప్పుడు అనుమతికి దరఖాస్తు చేసుకుంటాం. పసుపు రంగు తీసేసి వేరే రంగు వేస్తాం. వీటిని తొలగించకండి’ అని టీడీపీ నాయకులు, జగన్మోహన్‌ కార్యాలయ సిబ్బంది చెప్పినా ఆమె పట్టించుకోలేదు. దీంతో వారు బెంచీలను తీసుకెళ్లిపోయారు.

ఫ్లెక్సీల తొలగింపులోనూ పక్షపాతం

ఈనెల 15వ తేదీన గురజాల పుట్టినరోజు సందర్భంగా నగరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను 17వ తేదీనే అధికారులు దగ్గరుండి తొలగించారు. అనేక ప్రధాన సర్కిళ్లలో వైసీపీ నేతల బ్యానర్లున్నా పట్టించుకోలేదని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ నెల 24న నారా లోకేశ్‌ జన్మదినం సందర్భంగా 50 ఫ్లెక్సీల ఏర్పాటుకు అనుమతి కోరితే రోజంతా వేచి ఉన్నాక 30కి అనుమతి ఇచ్చారు.

Updated Date - Jan 30 , 2024 | 11:56 PM