పుంగనూరులో దారుణం
ABN , Publish Date - Jan 30 , 2024 | 01:47 AM
నాలుగేళ్లుగా ఇంటి స్థలం ఇస్తానని తీసుకున్న డబ్బును అడిగినందుకు రియల్‌ఎస్టేట్ వ్యాపారి పుంగనూరులో మహిళపై దాడి చేశాడు. కుమారుడి సహా ఆమెను ఇంట్లో నిర్బంధించాడు.
ఫ జాగా కోసం ఇచ్చిన డబ్బు అడిగిన మహిళను కుమారుడి సహా నిర్బంధించిన రియల్టర్
ఫ 100కు డయల్ చేయడంతో విడిపించిన పోలీసులు
పుంగనూరు, జనవరి 29: నాలుగేళ్లుగా ఇంటి స్థలం ఇస్తానని తీసుకున్న డబ్బును అడిగినందుకు రియల్‌ఎస్టేట్ వ్యాపారి పుంగనూరులో మహిళపై దాడి చేశాడు. కుమారుడి సహా ఆమెను ఇంట్లో నిర్బంధించాడు. దీనిపై బాధితురాలు శిరీష పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె తెలిపిన ప్రకారం.. పుంగనూరు కొత్తఇండ్లుకు చెందిన మధుసూదన్ భార్య శిరీష, ఇంటి స్థలం కోసం నాలుగేళ్ల క్రితం, మండలంలోని భీమగానిపల్లె పంచాయతీ ఉలవలదిన్నెకు చెందిన రియల్‌ఎస్టేట్ వ్యాపారి ఆదినారాయణకు రూ.11 లక్షలు ఇచ్చారు. ఎన్నిసార్లు అడిగినా ఆయన ఇంటి స్థలం ఇవ్వలేదు. వాయిదాలు వేస్తూ వచ్చాడు. తమ డబ్బు ఇవ్వాలని, తన కుమారుడికి కాలేజీ ఫీజు కట్టాలని ఆమె రియల్టర్‌పై ఒత్తిడి తెచ్చారు. తన ఇంటికి వస్తే డబ్బులు ఇస్తానని చెప్పాడు. దీంతో ఆమె ఇంటర్ చదువుతున్న తన కుమారుడు నిఖిల్‌ను వెంటపెట్టుకుని సోమవారం ఉదయం 8 గంటలకు ఉలవలదిన్నెలోని అతడి ఇంటికి వెళ్లారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ఆదినారాయణ ఇంటికి రాగా, ఆమె డబ్బు కావాలని అడిగారు. దీంతో అతడు ఆమెపై దౌర్జన్యం చేసి కుమారుడి సహా శిరీషను ఇంటిలోపలకు నెట్టి నిర్బంధించాడు. ఈ ఘటనకు భయాందోళన చెందిన ఆమె.. ఉలవలదిన్నెలో రియల్ ఎస్టేట్ వ్యాపారి తమను నిర్బంధించారని, కాపాడాలంటూ డయల్ 100కు ఫోను చేశారు. పోలీసులు వెళ్లి తలుపులు కొట్టి వారిని బయటకు తీసుకొచ్చారు. తమకు న్యాయం చేయాలని బాధితురాలు ఫిర్యాదు చేయగా పుంగనూరు పోలీసులు కేసు నమోదు చేశారు.