Share News

మహిళా వర్సిటీ ప్రాంగణంలో పులివర్తి నానీపై హత్యాయత్నం

ABN , Publish Date - May 15 , 2024 | 12:23 AM

చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానీపై జరిగిన దాడితో మంగళవారం తిరుపతి పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయ ప్రాంగణం రణరంగంగా మారింది.

 మహిళా వర్సిటీ ప్రాంగణంలో పులివర్తి నానీపై హత్యాయత్నం

తిరుపతి, మే 14 (ఆంధ్రజ్యోతి) : చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానీపై జరిగిన దాడితో మంగళవారం తిరుపతి పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయ ప్రాంగణం రణరంగంగా మారింది. దాడులు, ప్రతిదాడులు, వాహనాల ధ్వంసం, బైక్‌ దగ్ధం, గాల్లోకి కాల్పులు, లాఠీఛార్జీలు వంటి ఘటనలతో ప్రశాంతతకు మారుపేరైన మహిళా వర్శిటీ ప్రాంతం అట్టుడికిపోయింది. వందలాదిమంది వైసీపీ, టీడీపీ మద్దతుదార్ల దాడులు, ప్రతిదాడులతో గంటల పాటు వర్శిటీ ప్రాంగణం, పరిసరాల్లో ఉద్రిక్తతలు రాజ్యమేలాయి.

మధ్యాహ్నం 3.22 గంటలకు

మహిళా విశ్వవిద్యాలయంలోని స్ట్రాంగ్‌ రూముల నుంచీ వెనుదిరిగి వస్తున్న పులివర్తి నానీ వాహనాలపై వైసీపీ వర్గీయులు బీరు బాటిళ్ళు, కర్రలు, ఇనుప రాడ్లు, సుత్తులతో దాడి చేశారు. వాహనాలు ధ్వంసం చేశారు. నానీని గాయపరిచారు. గన్‌మ్యాన్‌ గాల్లోకి కాల్పులు జరిపినా వెనక్కు తగ్గకుండా దాడులకు తెగబడడంతో గన్‌మ్యాన్‌ ధరణి కూడా తీవ్రంగా గాయపడ్డారు.

3.35 గంటలకు: దాడి నుంచీ తేరుకున్న నానీ అనుచరులు ఆయన్ను తీసుకుని వర్శిటీ మెయిన్‌ గేటు దాటి వెలుపలికి వచ్చి రోడ్డుపై బైఠాయించారు. అరగంట పాటు ధర్నా నిర్వహించి నానీని స్విమ్స్‌కు తరలించారు.

సాయంత్రం 4.10 గంటలకు:పెద్ద సంఖ్యలో మహిళా వర్శిటీలోకి చేరుకున్న టీడీపీ శ్రేణులు రాళ్ళు, ఇనుప రాడ్లతో ప్రతిదాడికి దిగారు. వైసీపీ వర్గీయులకు చెందిన కారును ధ్వంసం చేశారు. ఆవరణలో ఆందోళనకు దిగారు.

4.30గంటలకు: అలిపిరి సీఐ రామచంద్రారెడ్డి వాహనంలో లోపలికి రాగా వాహనాన్ని చుట్టుముట్టి పోలీసు వైఫల్యంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఐ వాహనం దిగి దూరంగా వెళ్ళగా వాహనాన్ని ధ్వంసం చేశారు.

5గంటలకు:చంద్రగిరి నియోజకవర్గవ్యాప్తంగా భారీ సంఖ్యలో టీడీపీ మద్దతుదారులు వర్శిటీలోకి దూసుకొచ్చారు. పోలీసు తీరును నిరసిస్తూ వర్శిటీ ఎదుట ఆందోళనకు దిగారు.

5.15గంటలకు: ఇద్దరు ఏఎస్పీలు, డీఎస్పీలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. టీడీపీ వర్గీయుల ఆందోళన మరింత తీవ్రతరమైంది.

5.20గంటలకు: బీఎ్‌సఎఫ్‌ పోలీసులు రబ్బర్‌ బుల్లెట్లతో గాల్లోకి కాల్పులు జరిపారు. పోలీసులు లాఠీఛార్జి జరిపి చెదరగొట్టేందుకు యత్నించారు.

5.30 గంటలకు: వైసీపీ స్టిక్కర్‌ వున్న మొబైల్‌ చేతిలో పట్టుకుని బైక్‌పై వచ్చిన యువకుడిని ఆందోళనకారులు చితకబాది బైక్‌ను తగులబెట్టారు.

5.45 గంటలకు:మహిళా వర్శిటీ వద్దకు చేరుకున్న టియర్‌ గ్యాస్‌ వాహనాలు, కేంద్ర సాయుధ బలగాలు. వచ్చీ రాగానే లాఠీఛార్జి చేసి ఆందోళన కొనసాగిస్తున్న టీడీపీ వర్గీయులను చెదరగొట్టి తరిమివేశారు. లాఠీఛార్జిలో పదిమంది గాయపడ్డారు. అందులో ఐదుగురు మీడియా ప్రతినిధులున్నారు.

6గంటలకు:ఘటనా స్థలానికి ఎస్పీ రాక. టీడీపీ అభ్యర్థి, అతడి గన్‌ మ్యాన్‌ క్షేమంగా వున్నారని, స్ట్రాంగ్‌ రూమ్‌ సైతం భద్రంగా వుందని మీడియాకు స్పష్టం చేశారు. అభ్యర్థిపై జరిగిన దాడిలో పాల్గొన్న నిందితులను గుర్తించామని, గంటలోగా అరెస్టు చేస్తామని వెల్లడించారు.

---------

భీతావహంగా వర్శిటీ ప్రాంగణం

దట్టమైన అడవిని తలపించేలా పచ్చటి చెట్లతో, చల్లటి వాతావరణంతో ప్రశాంతతకు మారుపేరులా కనిపించే పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం ప్రాంగణం మంగళవారం చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానీపై జరిగిన దాడితో ఉద్రిక్తతలకు నిలయంగా మారింది. దాడులు, ప్రతిదాడులు, అరుపులు, కేకలతో వర్శిటీ ఆవరణ, పరిసరాలు భీతావహంగా మారాయి. ఆవరణలో పగిలిన బీరు బాటిళ్ళు, రాళ్ళు, విరిగిపోయిన కర్రలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడివున్నాయి. ఽనానీ వాహనాలు, వైసీపీ వర్గీయుల వాహనం, పోలీసు వాహనం ధ్వంసమయ్యాయి. నానీ వాహనాల్లో ప్రత్యర్థులు దాడి సందర్భంగా వదిలిపెట్టిన రాళ్ళు, ఉనుప సుత్తి వంటివి పడివున్నాయి. వందలాది మంది టీడీపీ వర్గీయులు పోలీసు వైఫల్యాన్ని ప్రశ్నిస్తూ తీవ్ర ఆగ్రహావేశాలతో ఊగిపోతూ కనిపించారు. ఇక వర్శిటీ వెనుకవైపు తుమ్మలగుంటలోనూ వెయ్యిమందికి పైగా వైసీపీ వర్గీయులు రాళ్ళు, కర్రలతో మొహరించడం మరింత్ర ఉద్రిక్తతకు కారణమైంది. ఆవరణలోనూ, వెలుపలా మొహరించిన సివిల్‌ పోలీసులు, కేంద్ర బలగాలతో, లాఠీఛార్జీలతో మొత్తం మీద వర్శిటీ ప్రాంగణం, పరిసరాలు భీతావహంగా మారాయి.

పోలీసు వైఫల్యంతోనే టీడీపీ అభ్యర్థిపై దాడి

పులివర్తి నానీపై దాడి ఘటనలో పోలీసు వైఫల్యం స్పష్టంగా బయటపడింది. సోమవారం పోలింగ్‌ సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని బ్రాహ్మణ కాలవ, పులివర్తివారిపల్లి, రామిరెడ్డిపల్లి, కూచువారిపల్లి గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రామచంద్రాపురం మండలం బ్రాహ్మణకాలవలో బీఎ్‌సఎఫ్‌ జవాన్‌ గాల్లోకి కాల్పులు జరిపే దాకా పరిస్థితి విషమించింది. టీడీపీ అభ్యర్థి పులివర్తి నానీ స్వగ్రామమైన పాకాల మండలం పులివర్తివారిపల్లిలో వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌ను టీడీపీ వర్గీయులు అడ్డుకున్నారు. చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లిలో టీడీపీ వర్గీయులపై దాడులు జరిగాయి. పక్కనే వున్న కూచువారిపల్లికి వెళ్ళిన చెవిరెడ్డి మోహిత్‌, అతని సోదరుడు హర్షిత్‌రెడ్డి, అనుచరులను టీడీపీ వర్గీయులు నిర్బంధించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అతికష్టమ్మీద వారిద్దరినీ గ్రామం నుంచీ బయటకు పంపగలిగినా వారి అనుచరులు ఇద్దరు గ్రామంలోనే చిక్కుకుపోయారు.వారిని గ్రామస్తులు నిర్బంధించి దాడి చేసినట్టు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అలాగే మోహిత్‌ అనుచరులకు చెందిన రెండు కార్లను తగులబెట్టారు. వైసీపీ సర్పంచ్‌ ఇంటిని సైతం తగులబెట్టారు. చెవిరెడ్డి స్వగ్రామమైన తుమ్మలగుంటలో టీడీపీ నేత దొడ్ల కరుణాకర్‌రెడ్డిపై దాడికి యత్నం జరిగింది. ఈ ఘటనల నేపధ్యంలో నియోజకవర్గవ్యాప్తంగా టీడీపీ, వైసీపీ వర్గాల నడుమ ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. వీటి తీవ్రతను అంచనా వేయడంలో పోలీసులు దారుణంగా తప్పటడుగు వేశారు. వైసీపీ, టీడీపీ అభ్యర్థుల కదలికలను, ఎత్తుగడలను కూడా పోలీసు అధికారులు అంచనా వేయడంలో విఫలమయ్యారు. దాడులు, ప్రతిదాడులు జరిగే అవకాశముందన్న కనీస ఆలోచన గానీ, వాటిని అడ్డుకునే కనీస ప్రయత్నం గానీ చేయలేదు. అలాంటి ఆలోచన చేసివుంటే అభ్యర్థుల వెంట షాడో పార్టీలను నియమించి వుండేవారు. రెండు పార్టీల సామాజిక మాధ్యమాల మీద కన్నేసేవారు. వారి కదలికల సమాచారం షాడో పార్టీల ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుని ఇలాంటి ఘటనలను నిలువరించే వీలుండేది. ఈ విషయంలో పోలీసులు దారుణంగా విఫలమైనట్టు కనిపిస్తోంది.

టీడీపీ శ్రేణులు వచ్చినంత వేగంగా పోలీసులు రాలేదు

మహిళా వర్శిటీ ఆవరణలో నానీపై దాడి జరగ్గ్గా ఆయన సతీమణి సుధారెడ్డి సామాజిక మాధ్యమాల్లో అటు పోలీసులకు, ఇటు టీడీపీ శ్రేణులకు వెంటనే రావాలని పిలుపిచ్చారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఎక్కడెక్కడో వున్న టీడీపీ కార్యకర్తలు వందలమంది అరగంటలో మహిళా వర్శిటీకి చేరుకోగా పోలీసు బలగాలు మాత్రం సకాలంలో రాలేదు. దానివల్లే ఐదారు వందలమంది టీడీపీ మద్దతుదారులు వర్శిటీ ఆవరణలోకి ప్రవేశించి ప్రతి దాడులకు పాల్పడ్డారు. చివరికి పోలీసు వాహనం కూడా వారి దాడిలో ధ్వంసమైంది. దీనికి కూడా పోలీసు వైఫల్యమే కారణంగా కనిపిస్తోంది.

స్ట్రాంగ్‌ రూమ్‌ కాపలా పోలీసులు అడ్డుకోకుంటే నానీ పరిస్థితి ఏమయ్యేది?

మహిళా వర్శిటీ ఆవరణలోని ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూముల వద్ద కాపలా వున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవడంతో నానీపై దాడికి పాల్పడిన వైసీపీ వర్గీయులు పరారయ్యారు. ఒకవేళ కాపలా పోలీసులు అక్కడికి సకాలంలో రాకపోయివుంటే నానీ, అతడి అనుచరుల పరిస్థితి ఏమై వుండేదన్న ప్రశ్న భయం గొలుపుతోంది. వైసీపీ వర్గీయులు రాళ్ళు, కర్రలు, ఇనుప రాడ్లు, సుత్తులు వంటివి వెంట తెచ్చుకుని వాటితోనే దాడికి దిగిన తీరు వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తోంది. దాడిలో నానీకి జరగరానిది ఏదైనా జరిగివుంటే చంద్రగిరి, తిరుపతి, చిత్తూరు నియోజకవర్గాల్లో టీడీపీ శ్రేణులు మరింత రెచ్చిపోయి ప్రతీకార దాడులకు దిగివుండేవారు. అదే జరిగితే పరిణామాలు తీవ్రంగా వుండేవి.

స్ట్రాంగ్‌ రూమ్‌ల భద్రత డొల్లతనం బట్టబయలు

మహిళా వర్శిటీ ఆవరణలోని ఇంజనీరింగ్‌ విభాగం గదుల్లో ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్‌ రూమ్‌లు ఏర్పాటు చేశారు. అక్కడ మూడంచెల భద్రత కల్పించామని కలెక్టర్‌, ఎస్పీ స్వయంగా వెల్లడించారు. తొలి అంచెలో అంటే గదుల వద్ద సీఐఎ్‌సఎఫ్‌ బలగాలు, రెండవ అంచెలో అంటే భవనం వెలుపల సాయుధ బలగాలు, మూడవ అంచెలో సాధారణ పోలీసులు, హోమ్‌గార్డులు కాపలా వుంటారని చెప్పారు. ఎన్నికల అధికారులను, అభ్యర్థులను, వారి జనరల్‌ ఏజెంట్లను అది కూడా వారి ఐడీలను తనిఖీ చేశాకే లోనికి అనుమతించాల్సి వుండగా 150మందికి పైగా వైసీపీ కార్యకర్తలు వాహనాల్లో వర్శిటీ ఆవరణలోకి ఎలా రాగలిగారన్నది ప్రశ్న. అంతమంది యధేచ్ఛగా మారణాయుధాలతో లోనికి వచ్చి టీడీపీ అభ్యర్థి వాహనాలను ధ్వంసం చేసి అభ్యర్థిపైన, గన్‌మ్యాన్‌పైనా దాడి చేయడం కలకలం సృష్టించింది. ఇదే సాధ్యమైనప్పుడు స్ట్రాంగ్‌ రూముల్లోని ఈవీఎంలను పోలీసు యంత్రాంగం ఎంతవరకూ కాపాడగలదన్న ప్రశ్న తలెత్తుతోంది. మొత్తానికి స్ట్రాంగ్‌ రూములున్న వర్శిటీ ఆవరణలో భద్రత డొల్లతనాన్ని ఈ ఘటన బట్టబయలు చేసింది.

Updated Date - May 15 , 2024 | 12:23 AM