Share News

హైకోర్టు బెయిల్‌ ఇచ్చినా మళ్లీ అరెస్టుకు యత్నం

ABN , Publish Date - May 03 , 2024 | 02:30 AM

బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్రయాదవ్‌పై సదుం పోలీసులు నమోదు చేసిన రెండు కేసుల్లో హైకోర్టు గురువారం బెయిల్‌ మంజూరు చేసింది.

హైకోర్టు బెయిల్‌ ఇచ్చినా మళ్లీ అరెస్టుకు యత్నం
పుంగనూరులో రామచంద్రయాదవ్‌ ఇంటి ముందున్న పోలీసులు

పుంగనూరు, మే 2: బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్రయాదవ్‌పై సదుం పోలీసులు నమోదు చేసిన రెండు కేసుల్లో హైకోర్టు గురువారం బెయిల్‌ మంజూరు చేసింది. పోలీసులు పెట్టిన కేసుల్లో ఆయనపై ఎలాంటి చర్యలూ తీసుకోరాదని అసిస్టెంట్‌ రిజిస్ర్టార్‌ జి.హెచ్‌.నాయుడు ఉత్తర్వులిచ్చారు. గతనెల 29వ తేదీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వగ్రామం సదుం మండలం ఎర్రాతివారిపల్లెకు వెళ్లడంతో వైసీపీ అల్లరి మూకలు వాహనాలు ధ్వంసం చేసి, పలువురిని గాయపరిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలో సదుం పోలీసులు రామచంద్రయాదవ్‌తోపాటు మరికొందరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీనిపై రామచంద్రయాదవ్‌ హైకోర్టుకు వెళ్లగా బెయిల్‌ మంజూరు చేయడంతో ఆయన పుంగనూరులో ఇంటికి చేరుకున్నారు.

మళ్లీ అరెస్టు చేయాలని వచ్చిన పోలీసులు

ఎర్రాతివారిపల్లెలో జరిగిన గొడవలకు సంబంధించిన కేసుల్లో రామచంద్రయాదవ్‌ను అరెస్టు చేయాలని పుంగనూరులోని ఆయన ఇంటి వద్దకు సీఐ రాఘవరెడ్డి పోలీసులతో వెళ్లారు. ఇంట్లో ఉన్న ఆయన తనకు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసిందని రెండు ఆర్డర్‌ కాపీలను సీఐకి పంపారు. అనుమతి లేకుండా ఎర్రాతివారిపల్లెకు వెళ్లి శాంతిభద్రతలకు విఘాతం కలిగించారని, ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారని ఎంపీడీవో జి.రాజశేఖర్‌ ఫిర్యాదు మేరకు సదుం పోలీసుస్టేషన్‌లో రామచంద్రయాదవ్‌పై సెక్షన్‌ 341, 188 ఐసీపీ ప్రకారం మరో కేసు ఉందని సీఐ చెప్పారు. ఈ క్రమంలో రామచంద్రయాదవ్‌ హైకోర్టు అడ్వకేట్‌ను సంప్రదించగా అది బెయిలబుల్‌ కేసని, 41ఏ నోటీసులు ఇవ్వాల్సిన కేసని, అరెస్టుకు అవకాశం లేదని సూచించడంతో ఈ విషయాన్ని యాదవ్‌ మనుషులు పోలీసులకు తెలిపారు. అయినా చాలాసేపు రామచంద్రయాదవ్‌ను అరెస్టు చేయాలని పుంగనూరు సీఐ రాఘవరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ప్రయత్నించారు. పార్టీ శ్రేణులు అక్కడికి చేరుకోవడం, ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు వెనుదిరిగారు.

పెద్దిరెడ్డి నుంచి నాకు ప్రాణహాని ఉంది: రామచంద్రయాదవ్‌, బీసీవైపీ అధ్యక్షుడు

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా పోరాడుతున్న నాకు ఆయన నుంచి ప్రాణహాని ఉంది. సదుంలో వైసీపీ మూకలు నన్ను హతమార్చాలని చూశాయి. ప్రచార రథంపై రాళ్లు, కర్రలు విసిరారు. పోలీ్‌సస్టేషన్‌లోనే నాపై దాడికి ప్రయత్నించారు. విధ్వంసం చేసిన వైసీపీ వారిని విడిచి సదుం ఎస్‌ఐ మారుతి సామాన్యులపై కేసులు పెట్టారు. పుంగనూరు సీఐ రాఘవరెడ్డి సదుంలో గాయపడిన బీసీవైపీ కార్యకర్తలను వైద్యం పేరుతో జీపులో తీసుకెళుతూ మంత్రి పెద్దిరెడ్డి మిమ్మల్ని ఎన్‌కౌంటర్‌ చేయమన్నారు. ఇప్పడు కాకపోయినా తర్వాత కచ్చితంగా చేస్తామని బెదిరించారు. వారిని చిత్రహింసలు పెట్టారు. హైకోర్టు ఆదేశాలను కూడా పోలీసులు అమలు చేయడం లేదు.

Updated Date - May 03 , 2024 | 02:30 AM