Share News

కాపలాదారుపై దాడి!

ABN , Publish Date - Feb 02 , 2024 | 12:41 AM

పులిచెర్ల మండలం మంగళంపేట సమీపంలోని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మామిడితోటలో గురువారం వేకువజామున రెండు చిరుతలు హల్‌చల్‌ చేశాయి.

కాపలాదారుపై దాడి!
చికిత్స పొందుతున్న రవి

రెండు చిరుతలు వచ్చాయంటున్న బాధితులు

పులిచెర్ల మండలం మంగళంపేట సమీపంలోని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మామిడితోటలో గురువారం వేకువజామున రెండు చిరుతలు హల్‌చల్‌ చేశాయి. వీటి దాడిలో కాపలాదారుడు రవి గాయపడ్డారు. కాపలాదారు భార్య భాగ్యమ్మ తెలిపిన ప్రకారం.. సోమల మండలం వినాయకపురం ఎస్టీ కాలనీకి చెందిన రవి దంపతులు ఐదేళ్లుగా ఇక్కడి మామిడితోటలో కాపాలాదారుగా ఉంటున్నారు. గురువారం వేకువజామున 3 గంటల సమయంలో మామిడితోటలోని పశువులు గట్టిగా అరవడంతో రవి వెళ్లారు. ఇతడిని గమనించిన రెండు చిరుతలు వెళ్లిపోతూ దాడి చేయడంతో.. భుజం, వీపై గాయాలయ్యాయి. ఈ పరిణామంతో భయపడిన రవి అపస్మారక స్థితికి చేరుకున్నారు. చిరుతుల దాడి గమనించిన భాగ్యమ్మ.. మరొకరి సాయంతో రవిని ద్విచక్రవాహనంలో సదుం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అతడికి ఎలాంటి ఇబ్బంది లేదని, రెండు రోజులు ఆస్పత్రిలో ఉండాలని వైద్యులు చెప్పినట్లు ఆమె తెలిపారు. జడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు పెద్దిరెడ్డి ఆస్పత్రికి చేరుకొని రవిని పరామర్శించారు. కాగా, సంఘటనా స్థలాన్ని పరిశీలించామని, ఆ ప్రాంతంలో పశువులు తిరగడంతో చిరుతలు సంచరించినట్లు ఆనవాళ్లు కనిపించలేదని మంగళంపేట సెక్షన్‌ ఎఫ్‌బీవో నిఖిల్‌ తెలిపారు.

- కల్లూరు

Updated Date - Feb 02 , 2024 | 12:41 AM