త్వరలో ముగ్గురు ఎన్నికల పరిశీలకుల రాక
ABN , Publish Date - Apr 03 , 2024 | 12:56 AM
చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో ముగ్గురు పరిశీలకులు రానున్నారని ఆర్వో, జేసీ శ్రీనివాసులు తెలిపారు.

చిత్తూరు కలెక్టరేట్, ఏప్రిల్ 2: చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో ముగ్గురు పరిశీలకులు రానున్నారని ఆర్వో, జేసీ శ్రీనివాసులు తెలిపారు. ఎన్నికల ప్రచార, ఇతరత్రా వ్యవహారాల పరిశీలనకు వారు ఎప్పుడైనా, ఎక్కడైనా పర్యటించే అవకాశం ఉందన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం చిత్తూరు నియోజకవర్గ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జేసీ సమావేశమయ్యారు. ఈ నెల 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి ప్రచార ఖర్చులను అభ్యర్థుల ఖర్చుగా నమోదు చేస్తామన్నారు. అసెంబ్లీ అభ్యర్థి రూ.40 లక్షల వరకు ఖర్చు చేసేందుకు అనుమతులు ఉన్నాయన్నారు. ప్రచారాలకు అనుమతి తప్పనిసరన్నారు. సింగిల్‌విండో విధానం ద్వారా ప్రాధాన్యం మేరకు అనుమతులు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఎన్నికలకు సంబంధించి సందేహాలుంటే ఆర్వోతో పాటు నలుగురు ఏఆర్వోల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నుంచి అఽభ్యర్థి గురజాల జగన్మోహన్, రాజసింహులు, సురేంద్రకుమార్, వైసీపీ నుంచి అభ్యర్థి విజయానందరెడ్డి, ప్రతాప్, ఉదయ్‌కుమార్, కాంగ్రెస్ తరపున లోకేష్, బీఎస్పీ నుంచి భాస్కర్, వివిధ రాజకీయ పార్టీల నేతలు పాల్గొన్నారు.
రాజకీయ ప్రకటనలను పరిశీలించండి
వివిధ టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే రాజకీయ పార్టీల ప్రకటనలు, సమావేశాలు, ర్యాలీలను క్షుణ్ణంగా పరిశీలించి వాటికి అనుమతి పొందారో లేదో నిశితంగా పరిశీలించి నివేదికలు ఇవ్వాలని జేసీ శ్రీనివాసులు సూచించారు. కలెక్టరేట్‌లోని స్పందన హాలులో ఏర్పాటు చేసిన ఎంసీఎంసీ కేంద్రాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. టీవీ ఛానల్స్‌లో ప్రసారం చేసే ప్రకటనల కోసం అభ్యర్థులు లేదా వారి పార్టీ అధిష్ఠానం జిల్లా ఎంసీఎంసీ కమిటీ ఆమోదం పొందాలన్నారు. కమిటీ నోడల్ అధికారి నాగేశ్వరరావు, అసిస్టెంట్ అధికారి మోహన్‌బాబు, డీడీ పద్మజ తదితరులు పాల్గొన్నారు.