బడి బస్సులు భద్రమేనా...?
ABN , Publish Date - Jul 14 , 2024 | 12:36 AM
బడి బస్సుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులవుతున్నా ఫిట్నెస్ పరీక్షలు పూర్తికాకపోవడం విమర్శలకు తావిస్తోంది. సాధారణంగా మే చివరి వారంలో ప్రతి విద్యాసంస్థ వాహనం ఫిట్నెస్ సర్టిఫికెట్ కాలపరిమితి ముగుస్తుంది. ఆ వెంటనే ఆ వాహనానికి మరమ్మతులు పూర్తి చేసి ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందాలి. చాలా విద్యా సంస్థల యాజమాన్యాలు అలా చేయకుండానే విద్యార్థులతో బస్సులను రోడ్డపైకి తీసుకువస్తున్నారు
చిత్తూరు సిటీ, జూలై 10: బడి బస్సుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులవుతున్నా ఫిట్నెస్ పరీక్షలు పూర్తికాకపోవడం విమర్శలకు తావిస్తోంది. సాధారణంగా మే చివరి వారంలో ప్రతి విద్యాసంస్థ వాహనం ఫిట్నెస్ సర్టిఫికెట్ కాలపరిమితి ముగుస్తుంది. ఆ వెంటనే ఆ వాహనానికి మరమ్మతులు పూర్తి చేసి ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందాలి. చాలా విద్యా సంస్థల యాజమాన్యాలు అలా చేయకుండానే విద్యార్థులతో బస్సులను రోడ్డపైకి తీసుకువస్తున్నారు.
నిబంధనలు ఇలా..
పిల్లల భద్రతకు సంబంధించిన విషయం కాబట్టి బడి బస్సుల ఫిట్నెస్ విషయంలో రవాణా శాఖ గతంలో కంటే కఠినంగా నిబంధనలు రూపొందించింది. ఫ బస్సు పసుపురంగులోనే ఉండాలి. ఫ ఎడమవైపు విద్యా సంస్థ పేరు, ఫోన్ నంబరు, చిరునామా స్పష్టంగా కనిపించేలా రాయాలి. ఫ ప్రతి బస్సులో డ్రైవర్‌తో పాటు అటెండర్, టీచర్, పేరెంట్స్ మానిటరింగ్ సభ్యులుండాలి. ఫ బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థుల సమాచారం ఉండాలి. ఫ సామర్థ్యానికి మించి ఎక్కించరాదు. ఫ ప్రథమ చికిత్స పెట్టె, అందులో మందులుండాలి. ఫ ఇంజన్ కంపార్టుమెంట్లో అగ్నిమాపకయంత్రం, పొడి ఉంచాలి. ఫ పర్మిట్, ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్ తదితర పత్రాలు తప్పనిసరిగా ఉండాలి.ఫ విద్యార్థుల బ్యాగులు పెట్టుకోవడానికి ప్రత్యేక షెల్పులు ఏర్పాటు చేయాలి. ఫ డ్రైవర్‌కు 60 సంవత్సరాలు మించరాదు. అదే క్యాటగిరి బస్సును ఐదేళ్లు నడిపిన అనుభవం ఉండాలి. ఫ డ్రైవర్, అటెండర్ యూనిఫాం ధరించాలి. ఫ బస్సు బయలుదేరే ముందు డ్రైవర్‌కు బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించాలి.
నిబంధనలకు భయపడే...
ప్రభుత్వం రూపొందించిన నిబంధనలు బడి బస్సుల యాజమాన్యాలకు కంటగింపుగా మారింది. ఫిట్నెస్‌కు వెళితే లోపాలు వెలుగుచూస్తాయనే భయంతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో సుమారు 980 పాఠశాల బస్సులున్నాయి. అందులో ఇప్పటివరకు 900 బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు పూర్తయ్యాయి. మిగిలిన 80 ఇంకా చేసుకోలేదు.
పాఠశాల బస్సులపై స్పెష్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం
పాఠశాల బస్సులపై తరచూ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం.. నెల రోజుల్లో నిబంధనలు పాటించని 24 బస్సులపై కేసులు నమోదు చేసి, 8 సీజ్ చేశాం. ఫిట్నెస్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాం. భారీ జరిమానాతో పాటు, వాహనాన్ని సీజ్ చేస్తున్నాం. విద్యార్థులను చేరవేసే ఆటోలనూ తనిఖీ చేస్తున్నాం. పరిమితికి మించి పిల్లలను ఎక్కిస్తే కేసులు నమోదు చేస్తాం.
- నిరంజన్ రెడ్డి, డీటీసీ