రేపు జనసేనలో చేరనున్న ఆరణి
ABN , Publish Date - Mar 06 , 2024 | 12:59 AM
చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గురువారం జనసేన పార్టీలో చేరనున్నారు. పలువురు కార్పొరేటర్లతో పాటు భారీ ఎత్తున అనుచరులతో కలిసి జనసేనలోకి వెళ్లేందుకు చర్యలు చేపట్టారు.

చిత్తూరు, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గురువారం జనసేన పార్టీలో చేరనున్నారు. పలువురు కార్పొరేటర్లతో పాటు భారీ ఎత్తున అనుచరులతో కలిసి జనసేనలోకి వెళ్లేందుకు చర్యలు చేపట్టారు. తన వెంట ఎంత మందిని తీసుకెళతారన్నది సస్పెన్స్‌గా ఉంది. హైదరాబాదులో ఆదివారం జనసేనాని పవన్ కల్యాణ్‌ను కలిసి వచ్చినప్పటి నుంచి ఆయన్ను మద్దతుదారులు, జనసేన నాయకులు పెద్దఎత్తున కలుస్తున్నారు. ‘నియోజకవర్గంలో వైసీపీ అభివృద్ధి కోసం ఏళ్లుగా కష్టపడ్డాను. ఐదేళ్లు ఎమ్మెల్యేగా నిజాయితీగా పనిచేశాను. అలాంటి నన్ను కాదని ఓ స్మగ్లర్‌కు టికెట్ ఇచ్చారు. రాజ్యసభ హామీని కూడా నిలబెట్టుకోలేదు. వైసీపీ నన్ను అడుగడుగునా అవమానించింది. అందుకే పార్టీ మారాల్సి వచ్చింది’ అని తనను కలిసిన వారందరితోనూ ఎమ్మెల్యే శ్రీనివాసులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. చిత్తూరులో వైసీపీ అభ్యర్థి విజయానందరెడ్డిని ఓడించి, టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్‌ను గెలిపించాలన్నదే తన ముందున్న లక్ష్యంగా తన వర్గీయులకు చెప్పి.. వారిని సమాయత్తం చేస్తున్నట్లు సమాచారం. ఇక, వైసీపీ అధిష్ఠానం తనకు చేసిన అన్యాయాన్ని, జరిగిన అవమానాన్ని వివరిస్తూ బుధవారం ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించనున్నారు. కాగా, జనసేన తరపున తిరుపతి టికెట్‌ను కేటాయించాలని పవన్‌ను ఆరణి కోరినట్లు తెలిసింది. టీడీపీ- జనసేన పొత్తులో భాగంగా ఉమ్మడి జిల్లాలో రెండు సీట్లు జనసేనకు కేటాయించాల్సి వస్తుంది. ఆ జాబితాలో తిరుపతి కూడా ఉంది. ఇటీవల ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో తిరుపతి ప్రస్తావన లేదు. దీంతో ఆయన తిరుపతి మీద దృష్టి పెట్టినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత, తిరుపతిలో సామాజికవర్గ బలం, టీడీపీ- జనసేనకు ఉన్న సానుకూలత.. తన విజయానికి సులువు అవుతాయనే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.