Share News

పేద విద్యార్థులకు కార్పొరేట్‌ విద్య ఏదీ?

ABN , Publish Date - Feb 06 , 2024 | 12:31 AM

కలెక్టరేట్‌లో సోమవారం ‘స్పందన’ కార్యక్రమం జరిగింది. బాధితుల నుంచి కలెక్టర్‌ షన్మోహన్‌, జేసీ శ్రీనివాసులు వినతిపత్రాలను స్వీకరించారు.

పేద విద్యార్థులకు కార్పొరేట్‌ విద్య ఏదీ?
బాధితుల నుంచి అర్జీని స్వీకరిస్తున్న కలెక్టర్‌ షన్మోహన్‌, జేసీ శ్రీనివాసులు

వైసీపీ వచ్చాక ‘బాస్‌’ పథకం రద్దు

సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలం

‘స్పందన’లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు

చిత్తూరు, ఫిబ్రవరి 5: కలెక్టరేట్‌లో సోమవారం ‘స్పందన’ కార్యక్రమం జరిగింది. బాధితుల నుంచి కలెక్టర్‌ షన్మోహన్‌, జేసీ శ్రీనివాసులు వినతిపత్రాలను స్వీకరించారు. అధికారుల దృష్టికి వచ్చిన సమస్యల్లో కొన్ని..

గత ప్రభుత్వం తీసుకొచ్చిన బెస్ట్‌ అవైలబుల్‌ స్కీమ్‌ (బాస్‌)ను ప్రభుత్వం రద్దు చేయడంతో వందలాది మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు కార్పొరేట్‌ విద్యకు దూరమయ్యారని మాలమహానాడు ఐక్యవేదిక జిల్లా జాయింట్‌ సెక్రటరీ ధనరాజ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు పిల్లలు, వారి తల్లిదండ్రులతో కలిసి సోమవారం స్పందనలో కలెక్టర్‌ షన్మోహన్‌కు ఫిర్యాదు చేశారు. 35 ఏళ్లుగా అమల్లో ఉన్న బాస్‌ స్కీమ్‌ను వైసీపీ అధికారంలోకి వచ్చాక 2021లో రద్దు చేసిందన్నారు. కొంతమంది తల్లిదండ్రులు కోర్టుకు వెళ్లడంతో 2023లో సుప్రీంకోర్టు బాస్‌ స్కీమ్‌ను కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు. కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో జిల్లా యంత్రాంగం విఫలమైందన్నారు. ‘ప్రభుత్వం ఫీజులను విడుదల చేస్తే పాఠశాలల యాజమాన్యాలు తీసుకోవాలని, అంత వరకు పిల్లల్ని ఫీజుల కోసం ఒత్తిడి చేయకూడదని కోర్టు ఆదేశాలిచ్చింది. అయితే పాఠశాలల యాజమాన్యాలు మాత్రం ప్రభుత్వం జీవో ఇస్తే ఊరికే చదివించాలా? ఫీజులు కడితే పాఠశాలలకు పంపించండి. లేదంటే ఆపేయండని చెబుతున్నారు. పేద, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు తగు ఆదేశాలు ఇవ్వాలని’ వారు కోరారు.

పీఎం విశ్వకర్మ యోజన అమలేదీ?

పీఎం విశ్వకర్మ యోజన అమలయ్యేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సుధాకర్‌, నేతలు షణ్ముగం, ఆనంద్‌ కోరారు. చేతివృత్తుల వారి నైపుణ్యతను మరింత మెరుగుపరచడానికి, ఆర్థికంగా పైకి ఎదగడానికి దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ ఈ పథకాన్ని ప్రవేశపెడితే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు.

నా భూమిని సర్వేచేసి దారి చూపండి

కోర్టు తీర్పు ప్రకారం నా భూమిని సర్వే చేసి.. దారి చూపించాలని యాదమరి మండలం కాశిరాళ్లకు చెందిన సరోజమ్మ కోరారు. ఈ విషయంలో సచివాలయ సర్వేయర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో పాటు సమస్యను జఠిలం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.

రాజకీయాలు చేస్తున్న కార్యదర్శి

ఉద్యోగ బాధ్యతలు పక్కనపెట్టి.. రాజకీయాలు చేస్తున్న బంగారుపాళ్యం-2 కార్యదర్శి అవంతిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్థులు కలెక్టర్‌ షన్మోహన్‌కు వినతిపత్రాన్ని అందించారు. ఆమె తండ్రి, భర్త పంచాయతీ కార్యాలయాన్ని పార్టీ కార్యాలయంగా మార్చారని ఆరోపించారు. అవినీతి అక్రమాలతో పాటు అధికారపార్టీకి తొత్తుగా ఉన్న ఆమెపై విచారణ జరపాలన్నారు.

కబ్జా భూములను విడిపించండి

‘గుడిపాల మండలం నారగల్లులో 30 ఎకరాల యానాదుల భూములను అధికారపార్టీకి చెందిన నేతలు లాక్కొని మామిడి మొక్కలు నాటారు. కొన్నేళ్లుగా అనుభవంలో ఉన్న భూమిని లాక్కోవడంతో వీళ్లంతా రోడ్డున పడ్డారు. చిత్తూరు మండలం గాజులపల్లెలో యానాదులకు సంబంధించిన శ్మశాన భూమినీ ఆక్రమించారు. వీటిపై ఉన్నతాధికారులు విచారణ జరిపి కబ్జా అయిన భూములు విడిపించాలి’ అని యానాది సంఘం నేత రాము, యానాదులు కోరారు.

ఇంటి జాగా ఆక్రమణకు యత్నం

‘గతంలో ప్రభుత్వం నాకు ఇచ్చిన మూడుసెంట్లలో కొంత వరకు నిర్మాణాన్ని చేపట్టా. మిగతా స్థలాన్ని పక్కనే ఉన్న వ్యక్తి అధికారపార్టీ బలంతో లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నాడు. దీనిపై విచారించి చర్యలు తీసుకోండి’ అని కార్వేటినగరం మండలం ఆర్‌కేపేట వీధికి చెందిన మోహన్‌ కోరారు.

కలెక్టరేట్‌లో స్పందనకు 218 అర్జీలు

కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన స్పందనలో జిల్లా నలుమూలల నుంచి 218 మంది హాజరై కలెక్టర్‌ షన్మోహన్‌, జేసీ శ్రీనివాసులుకు వినతిపత్రాలను అందించారు. బాధితుల సమస్యలను విన్న వారు పరిష్కారానికి సత్వర చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. వారి దృష్టికి వచ్చిన అర్జీల వివరాలు.. రెవెన్యూశాఖకు 167, పోలీసుశాఖకు 7, హౌసింగ్‌కు 4, రేషన్‌కార్డులు, పెన్షన్లు తదితర వాటికి 10 అర్జీలతో పాటు మిగిలిన శాఖలకు 30 అర్జీలు అందాయి.

Updated Date - Feb 06 , 2024 | 12:31 AM