Share News

మరో దళిత నిరసన స్వరం

ABN , Publish Date - Jan 21 , 2024 | 02:05 AM

జీడీనెల్లూరు నుంచే మళ్లీ తనకో తన కూతురికో అవకాశం లభిస్తుందని బలంగా నమ్మిన నారాయణస్వామికి చేదు అనుభవం ఎదురైంది.

మరో దళిత నిరసన స్వరం

  • మూకుమ్మడిగా రాజీనామా చేస్తామంటూ హెచ్చరికలు

చిత్తూరు, ఆంధ్రజ్యోతి: జీడీనెల్లూరు నుంచే మళ్లీ తనకో తన కూతురికో అవకాశం లభిస్తుందని బలంగా నమ్మిన నారాయణస్వామికి చేదు అనుభవం ఎదురైంది. ఎంపీగా పోటీ చేయడానికి ఏ మాత్రం ఆయన సుముఖంగా లేరు. అయినా ఆశ చావక, సీఎం జగన్‌ను కలిసేందుకు శనివారం నుంచి విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. దీనికి సమాంతరంగా ఆయన అనుచరవర్గం నిరసన స్వరం పెంచింది. శుక్రవారం కార్వేటినగరం, జీడీనెల్లూరు మండలాల వైసీపీ నాయకులు స్థానికంగా ప్రెస్‌మీట్లు నిర్వహించి నారాయణస్వామికే టికెట్‌ ఇవ్వాలంటూ తీర్మానించారు. శనివారం పెనుమూరు, ఎస్‌ఆర్‌పురం మండలాల నాయకులు చిత్తూరు ప్రెస్‌క్లబ్‌లో, వెదురుకుప్పం మండల నాయకులు తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో నారాయణస్వామికి మద్దతుగా ప్రెస్‌మీట్‌ పెట్టారు. నారాయణస్వామికి టికెట్‌ ఇవ్వకుంటే పదవులకు రాజీనామా చేస్తామంటూ అల్టిమేటం జారీ చేశారు. జ్ఞానేంద్రరెడ్డి వర్గానికి ఓటు బ్యాంకు లేదని ఆరోపించారు. నారాయణస్వామికి పెనుమూరు జ్ఞానేంద్రరెడ్డితోపాటు నియోజకవర్గంలోని రెడ్డి సామాజికవర్గం వ్యతిరేకంగా ఉన్నా, మిగిలినవర్గాలు ఆయనతోనే ఉన్నాయి. ఇప్పుడు పెద్దిరెడ్డికి నమ్మకస్తుడైన ఎంపీ రెడ్డెప్ప తెరమీదికి రావడంతో నారాయణస్వామికి టికెట్‌ రాకపోవడం వెనుక పెద్దిరెడ్డి ఉన్నాడనే అంశం ప్రచారం అవుతోంది. నారాయణస్వామితో ఉన్న వర్గాలన్నీ రెడ్డెప్ప అభ్యర్థి అయితే పనిచేయబోమని బహిరంగంగా చెప్తున్నాయి. రెడ్డెప్ప నాన్‌లోకల్‌ అనే మాట కూడా వైరల్‌ అవుతోంది.

రెడ్ల మాటే ఫైనల్‌

పెనుమూరు మండలానికి చెందిన జ్ఞానేంద్రరెడ్డి వర్గం ఆది నుంచీ నారాయణస్వామిని వ్యతిరేకిస్తోంది. వీరికి మంత్రి పెద్దిరెడ్డి అండ ఉండడంతో పదవులు దక్కాయి. పనులూ అయ్యాయి. అనేకమార్లు నారాయణస్వామికి టికెట్‌ ఇస్తే ఓడిస్తామంటూ వ్యతిరేకవర్గం ప్రకటించింది. అయినా నారాయణస్వామికి సీఎం జగన్‌తో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా టికెట్‌ ఆయనకే వస్తుందనుకున్నారు. ఊహించని విధంగా ఆయన్ను మార్చేసి, నియోజకవర్గంతో ఏమాత్రం సంబంధం లేని రెడ్డెప్పకు టికెట్‌ ఇచ్చారు. నారాయణస్వామికి టికెట్‌ రాకుండా చేయడంలో పెద్దిరెడ్డి ప్రమేయం ఉందని ఆయన అనుచరులు ఆగ్రహిస్తున్నారు. డిప్యూటీ సీఎం అయినా కూడా రెడ్డి సామాజికవర్గం నిర్ణయమే ఫైనల్‌ అని వైసీపీలో రుజువైందని అంటున్నారు.

పెద్దిరెడ్డికి పంటికింద రాయి

జిల్లాలో పెద్దిరెడ్డి తర్వాత నేరుగా సీఎం జగన్‌ను కలిసి చనువుగా పనులు చేయించుకోగల వ్యక్తి నారాయణస్వామి అని పేరుంది. పెద్దిరెడ్డితోపాటు తొలి విడతలో మంత్రి పదవి దక్కించుకున్నారు. రెండో విడతలో పెద్దిరెడ్డికి మాత్రమే మంత్రి పదవి వస్తుందని, నారాయణస్వామికి ఇవ్వడం లేదని పెద్దఎత్తున ప్రచారం జరిగింది. చివరి నిమిషంలో మళ్లీ పెద్దిరెడ్డితోపాటు మంత్రి పదవి కొనసాగింది. అవకాశం వచ్చినప్పుడల్లా తనను వ్యతిరేకించే రెడ్డి సామాజికవర్గం మీద విమర్శలు చేసేవారు. తన నియోజకవర్గానికి కలెక్టర్‌, జేసీ వంటి జిల్లా అధికారులను పిలుచుకువచ్చి సమావేశాలు, పర్యటనలు చేయించేవారు. తాను సిఫారసు చేసిన పని ఏదైనా అధికారులు నిర్లక్ష్యం చేస్తే ‘రెడ్లు చెప్తేనే చేస్తారా.. దళితులు చెప్పే పనులకు విలువ ఇవ్వరా’ అంటూ ప్రశ్నించి పనులు చేసుకునేవారు. ఈయన డిప్యూటీ సీఎం కావడంతో జిల్లా స్థాయిలో జరిగే ప్రతి సమావేశంలోనూ తప్పక ప్రాధాన్యం ఇవ్వాల్సి వచ్చేది. పెద్దిరెడ్డి జిల్లా అంతా శాసించినా, నారాయణస్వామి మాత్రం ఈ ఐదేళ్లు ఆయనకు పంటికింద రాయిలా మారారని చెప్పవచ్చు. అందుకే పెద్దిరెడ్డి జీడీనెల్లూరులో నారాయణస్వామి వ్యతిరేక వర్గాన్ని ప్రోత్సహించినట్లు చెబుతారు.

‘గడప గడప’లో అవమానం జరిగినా..

జిల్లాలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నారాయణస్వామి మిగిలిన ఎమ్మెల్యేల కంటే ఎక్కువగా చేశారు. అయినా అడుగడుగునా నిలదీతలు, అవమానాలు ఎదురయ్యాయి. జీడీనెల్లూరు మండలం పాచిగుంట గ్రామంలో ఈయన వస్తున్నారని ప్రజలు ఇళ్లకు తాళాలు వేసుకుని వెళ్లిపోయారు. పూతలపట్టు మండలంలోని ఓ గ్రామంలో ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబు పర్యటించి వెళ్లిపోయాక అక్కడివారు పసుపు నీళ్లు చల్లారు. దళిత ఎమ్మెల్యేలకు అవమానం జరిగినా మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలు స్పందించలేదని నారాయణస్వామి ఓ సందర్భంలో ఆవేదన చెందారు. ఇలా జిల్లాలో దళిత ఎమ్మెల్యేల పట్ల తొలి నుంచీ సొంత పార్టీ నాయకులే చిన్నచూపు ప్రదర్శిస్తున్నారు. తాజాగా టికెట్‌ విషయంలోనూ ఆ చిన్నచూపు కొనసాగింది.

Updated Date - Jan 21 , 2024 | 08:13 AM