సుగుటూరు గంగజాతర ప్రారంభం
ABN , Publish Date - Apr 03 , 2024 | 01:52 AM
పుంగనూరు సుగుటూరు గంగమ్మ జాతర మంగళవారం వైభవంగా ప్రారంభమైంది

పుంగనూరు, ఏప్రిల్ 2: పుంగనూరు సుగుటూరు గంగమ్మ జాతర మంగళవారం వైభవంగా ప్రారంభమైంది. స్థానిక నగరిలోని జమిందారీ ప్యాలెస్ దర్బారు కొలువలోఓ గంగమ్మను ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తుల దర్శనార్థం ఉంచారు. ఈ ఏడాది అందరికీ ఉచిత దర్శనం కల్పించడంతో అధిక సంఖ్యలో భక్తులు రావడం, పోలీసులు లేకపోవడంతో తోపులాట జరిగింది. ఎండకు మహిళలు, వృద్ధులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భక్తులు తిరిగి వెళ్లే మార్గంలోనే అధికారపార్టీ శ్రేణులు పలుమార్లు ఎదురుగా రావడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇంటి ఇలవేల్పు సుగుటూరు గంగమ్మకు మంగళవారం రాత్రి ప్యాలె్‌సలో జమిందారీ కుటుంబీకులు ఆనవాయితీ పప్రకారం తొలిపూజ చేశారు. సోమశేఖర చిక్కరాయులు, మల్లిఖార్జునరాయులు, వారి కుటుంబీకులు పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం మంత్రి పెద్దిరెడ్డి సతీమణి స్వర్ణలత, చిత్తూరు ఎంపీ ఎన్.రెడ్డెప్ప, డీసీసీబీ ఛైర్‌పర్సన్ ఎం.రెడ్డెమ్మ తదితరులు పూజలు చేసి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం పుష్పపల్లకిలో అమ్మవారిని కొలువుతీర్చి తేరువీధి, సెంటర్‌లాడ్జి, సుబేదారువీధి, బెస్తవీధి, తూర్పుమొగసాల, కుమ్మరవీధి, కట్టకిందపాళ్యం ప్రాంతాల్లో ఊరేగించారు. ఊరేగింపులో జంతుబలులు ఇచ్చారు. పట్టణంలోని అమ్మవారి ఆలయాల వద్ద విద్యుత్ దీపాలతో అలంకరణలు చేశారు.
నేడు ఆలయంలో భక్తుల సందర్శన
పుంగనూరు ప్యాలెస్ ఆవరణలోని సుగుటూరు గంగమ్మ ఆలయంలో అమ్మవారిని బుధవారం వేకువజామునుంచి భక్తుల సందర్శనార్థం అనుమతిస్తారు. జాతరలో అమ్మవారికి గెరిగెలు సమర్పించి మొక్కులు తీర్చుకోవడానికి ప్రత్యేక క్యూలైన్ ఏర్పాట్లు చేశారు.