‘టిడ్కో’ లబ్ధిదారుల ఆశలన్నీ కూటమిపైనే
ABN , Publish Date - Jul 08 , 2024 | 12:41 AM
ఐదేళ్లుగా పంపిణీకి నోచుకోని వైనం 6,288 ఇళ్లను రద్దుచేసినా డిపాజిట్లు తిరిగివ్వని వైసీపీ ప్రభుత్వం

టీడీపీ హయాంలో టిడ్కో ఇళ్లకు సామాన్య ప్రజలు డిపాజిట్లు కట్టారు. ఇళ్ల నిర్మాణాలూ దాదాపు పూర్తయ్యాయి. ఆ ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేస్తే తెలుగుదేశం పార్టీకి పేరొస్తుందని గత వైసీపీ ప్రభుత్వం అలాగే వదిలేసింది.
వైసీపీ అధికారంలోకి వచ్చాక పునాది దశలో ఉన్న టిడ్కో ఇళ్లను రద్దు చేసింది. 6288 మంది లబ్ధిదారులకు డిపాజిట్లను మాత్రం చెల్లించలేదు. అదిగో.. ఇదిగో అంటూ ఐదేళ్లూ పట్టించుకోలేదు.
అటు ఇళ్లు పూర్తయిన.. ఇటు రద్దయిన లబ్ధిదారులూ వైసీపీ ప్రభుత్వంలో ఇబ్బందులే పడ్డారు. సొంతింటి కల నెరవేర్చుకోవడానికి అప్పుచేసి డిపాజిట్లు కట్టిన వీరికి వడ్డీ భారమైంది. మరోవైపు అద్దె ఇళ్లల్లోనే నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో అటు ఇళ్ల కోసం.. ఇటు డిపాజిట్ల కోసం టిడ్కో లబ్ధిదారులు కూటమి ప్రభుత్వంవైపు ఆశగా ఎదురు చూస్తున్నారు.
- చిత్తూరు, ఆంధ్రజ్యోతి
టీడీపీ 2014-19 మధ్యలో అధికారంలో ఉన్నప్పుడు పట్టణ మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధి సంస్థ (టిడ్కో) ఆధ్వర్యంలో అర్హులైన లబ్ధిదారులకు గృహ నిర్మాణాలను చేపట్టింది. 300, 365, 430 చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు రకాల గృహ నిర్మాణాలను ప్రారంభించారు. 300 చదరపు అడుగుల గృహానికి లబ్ధిదారుడి వాటా రూ.500 కాగా, 365 చ.అడుగులకు రూ.50 వేలు, అలాగే 430 చ.అడుగులకు రూ.లక్ష డిపాజిట్ చేయాలి. ఈ మొత్తాన్ని లబ్ధిదారుల నుంచి అధికారులు నిర్మాణానికి ముందే వసూలు చేశారు. ప్రతి యూనిట్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాయితీ రూ.1.50 లక్షల చొప్పున, మొత్తం రూ.3 లక్షలు ఉంటుంది. యూనిట్‌ను బట్టి బ్యాంకు రుణాలూ ఉంటాయి.
6288 ఇళ్ల రద్దు
టీడీపీ హయాంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అన్ని నగర, పురపాలక సంఘాల్లో 17,395 టిడ్కో గృహాలను మంజూరు చేసింది. అప్పట్లోనే లబ్ధిదారుల నుంచి డబ్బులు కూడా వసూలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక పునాది దశలో ఉన్న గృహాలను 2020 జూన్‌లోనే రద్దు చేసేసింది. ఇలా ఉమ్మడి జిల్లాలో 6288 గృహాలు రద్దయ్యాయి. తిరుపతిలో 1200, చిత్తూరులో 672, మదనపల్లెలో 1056, శ్రీకాళహస్తిలో 1632, పుంగనూరులో 624, పుత్తూరులో 576, నగరిలో 528 గృహాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది.
రూ.37.82 కోట్ల డిపాజిట్లు పెండింగ్
వైసీపీ ప్రభుత్వం 6,288 మంది గృహాలను రద్దు చేసినా, వారు చెల్లించిన డిపాజిట్లను మాత్రం వెనక్కి ఇవ్వలేదు. రద్దయిన గృహాల్లో 1360 మంది రూ.500 వంతున చెల్లించిన రూ.6.80 లక్షలు, 2784 మంది రూ.50 వేల చొప్పున చెల్లించిన రూ.13.92 కోట్లు, 2384 మంది రూ.లక్ష చొప్పున చెల్లించిన రూ.23.84 కోట్ల డిపాజిట్లను వెనక్కి ఇవ్వలేదు. మొత్తంగా రూ.37.82 కోట్లు వెనక్కి ఇవ్వాల్సి ఉంది. మాకు ఇళ్లు దక్కలేదు.. డిపాజిట్లూ వెనక్కి ఇవ్వలేదంటూ లబ్ధిదారులు నాలుగేళ్లుగా ఆవేదన చెందుతున్నారు.
ఇదీ టిడ్కో గృహాల పరిస్థితి
చిత్తూరు నగరంలోని పూణేపల్లె వద్ద టిడ్కో గృహ సముదాయాల్ని నిర్మించారు. టీడీపీ ప్రభుత్వంలో 70 శాతం పనులు పూర్తయ్యాయి. పునాది దశలో ఉన్న 672 గృహాలను ప్రభుత్వం రద్దు చేసింది. మిగిలిన 2832 గృహాల నిర్మాణానికి రూ.140 కోట్లను ఖర్చు చేశారు. గృహ సముదాయంలో రోడ్లు, కాలువలు వంటి మౌలిక వసతులూ కల్పించారు. 2020 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందించారు. అయినా ఇక్కడ లబ్ధిదారులకు ఇళ్లను పంపిణీ చేయలేదు. నెల రోజుల్లో టిడ్కో ఇళ్లను పంపిణీ చేయాలంటూ ఇటీవల జరిగిన చిత్తూరు నగరపాలక సంస్థ సమావేశంలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అధికారులను ఆదేశించారు. రద్దయిన ఇళ్ల లబ్ధిదారులకూ ప్రజాప్రతినిధులు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది.
ఫ పుంగనూరు మున్సిపాలిటీ పరిధిలోని గూడూరుపల్లె వద్ద నిర్మించిన టిడ్కో గృహ సముదాయాలను గతేడాది అక్టోబరులో అప్పటి మంత్రి పెద్దిరెడ్డి ప్రారంభించారు. వాటర్ ట్యాంకు నిర్మాణం, విద్యుత్తు మీటర్లు, డ్రైనేజీ పనులు పెండింగులోనే ఉన్నాయి. ఇళ్లు రద్దయిన 624 మంది చేసిన డిపాజిట్లను వెనక్కి ఇవ్వలేదు.