Share News

ఇంటర్‌ పరీక్షలకు సర్వం సిద్ధం

ABN , Publish Date - Mar 01 , 2024 | 02:12 AM

ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభంకానున్నాయి. తొలిరోజు ప్రథమ సంవత్సర విద్యార్థులకు లాంగ్వేజ్‌ పేపర్‌-1పరీక్ష జరగనుంది.

ఇంటర్‌ పరీక్షలకు సర్వం సిద్ధం

63,055మంది విద్యార్థులకు 87 కేంద్రాలు

మూడు సమస్యాత్మక కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు

తిరుపతి(విద్య), ఫిబ్రవరి 29: ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభంకానున్నాయి. తొలిరోజు ప్రథమ సంవత్సర విద్యార్థులకు లాంగ్వేజ్‌ పేపర్‌-1పరీక్ష జరగనుంది. ఈ నెల 20వ తేదీ వరకు ఉదయం 9-12గంటల మధ్య జరిగే ఈ పరీక్షలను సీసీ కెమెరాల నిఘాలో పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని ఆర్‌ఐవో ప్రభాకరరెడ్డి తెలిపారు. కేంద్రాల్లోని సీసీ కెమెరాలను ఆన్‌లైన్‌ స్ర్టీమింగ్‌ ద్వారా ఇంటర్‌ బోర్డుతో పాటు ప్రాంతీయ ఇంటర్‌ బోర్డు కార్యాలయాల్లోని కంట్రోల్‌ రూమ్స్‌కు అనుసంధానం చేసి, పర్యవేక్షించే ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.సమస్యాత్మక కేంద్రాలైన నాగలాపురం, పిచ్చాటూరు, చిన్నగొట్టిగల్లు కళాశాలల్లో రోజూ సిట్టింగ్‌ స్క్వాడ్‌ ఉంటుందని, ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు పర్యవేక్షిస్తాయని వివరించారు. ప్రాథమిక వైద్య చికిత్స నిమిత్తం ఏఎన్‌ఎం అందుబాటులో ఉంటారని, పరీక్షలు జరిగే రోజు విద్యార్థులు ఆర్టీసీ బసులో ఉచిత ప్రయాణం చేసే వెసులుబాటు ఉందన్నారు.పరీక్షలకు 87 కేంద్రాలను ఏర్పాటు చేశామని, ప్రథమ, ద్వితీయ సంవత్సరాలలో కలిపి 63,055మంది విద్యార్థులు హాజరుకానున్నారని తెలిపారు.హాల్‌ టికెట్లపై ప్రిన్సిపాల్‌ సంతకం అవసరంలేదని, హాల్‌టికెట్‌ చూపిన విద్యార్థులందరినీ అనుమతించాలని ఆర్‌ఐవో తెలిపారు. కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే ఆర్‌ఐవో కార్యాలయంలోని టోల్‌ఫ్రీ నెంబరు 0877-2237200కి ఫోన్‌ చేయాలని కోరారు.

Updated Date - Mar 01 , 2024 | 02:12 AM