అలిపిరి కాలినడకన ఓవర్‌పాస్ నిర్మాణం జరిగేనా?
ABN , Publish Date - Jul 08 , 2024 | 12:39 AM
తిరుమలకు అలిపిరి కాలినడక దారిలో వెళ్లే శ్రీవారి భక్తుల ప్రాణాలకు రక్షణ కల్పిస్తూ నిర్మించాలనుకున్న ఓవర్ పాస్(పైవంతెన) నిర్మాణానికి ఏపీలో కొలువుదీరిన ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చి పూర్తి చేయాలని భక్తులు కోరుతున్నారు.

మంగళం, జూలై 7: తిరుమలకు అలిపిరి కాలినడక దారిలో వెళ్లే శ్రీవారి భక్తుల ప్రాణాలకు రక్షణ కల్పిస్తూ నిర్మించాలనుకున్న ఓవర్ పాస్(పైవంతెన) నిర్మాణానికి ఏపీలో కొలువుదీరిన ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చి పూర్తి చేయాలని భక్తులు కోరుతున్నారు. చిరుతపులుల దాడుల్లో చిన్నారి మృత్యువాత పడిన ఘటన గతంలో సంచలనం రేపింది. 2023 జూన్ 22న అలిపిరి కాలినడక దారిలో ఏడో మైలు వద్ద చిరుతపుల్లి కౌశిక్ అనే బాలుడిపై దాడి చేసి గాయపరిచింది. బాలుడు అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ సంఘటన జరిగిన రెండు నెలలకే ఆగస్టు 11వ తేదీన నడిచి వెళుతున్న లక్షిత అనే బాలికపై లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో చిరుత దాడి చేసి.. సమీప అటవీప్రాంతంలోకి లాక్కెళ్లి చంపేసింది. దాంతో అప్పటి టీటీడీ అధికారులు సాయంత్రం ఐదు గంటల తర్వాత కాలినడక దారిని మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో అటవీశాఖ అఽధికారులు ముందు జాగ్రత్త చర్యగా ఏర్పాటు చేసిన బోన్లలో ఆరు చిరుత పులులు పట్టుబడ్డాయి. అయితే కాలినడక దారిలో భక్తులు ఒంటరిగా కాకుండా గుంపులుగా వెళ్లాలని చెబుతూ మైకులను టీటీడీ ఏర్పాటు చేసింది. అలాగే రక్షణ కోసం భక్తులకు వెదురు కర్రలు కూడా అందజేసింది. ఈ సమయంలోనే ఏడో మైలు నుంచి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు ఓవర్‌పాస్ (పైవంతెన) ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ముందుకొచ్చింది. చిన్నారులపై చిరుత పులులు దాడి చేసిన సంఘటనా స్థలాన్ని వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా బృందం పరిశీలించింది. ఓవర్‌పా్‌సతోపాటు జంతువులు తిరిగేందుకు వీలుగా అండర్‌పాస్.. అలాగే కాలినడక మార్గానికి రెండువైపులా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని నిపుణుల బృందం సూచించింది. దీనికి దాదాపు రూ.50కోట్లు ఖర్చు అవుతుందని అంచనా కూడా వేసింది. ఈ వంతెన వల్ల జంతువుల నుంచి కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని.. అలాగే వన్యప్రాణులకు కూడా భక్తుల నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదని పేర్కొంది. దాదాపు ఎనిమిది నెలల క్రితమే ప్రతిపాదనలు టీటీడీకి వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అందజేసింది. కానీ టీటీడీ ఇప్పటి వరకు స్పందించిన దాఖలాలు లేవు. కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో ఇప్పటికైనా ఈ ప్రతిపాదనలపై టీటీడీ తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.