Share News

వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్ని వ్యవస్థలూ నాశనం

ABN , Publish Date - Apr 06 , 2024 | 01:44 AM

వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయని చిత్తూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు సీఆర్‌ రాజన్‌ ఆరోపించారు.

వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్ని వ్యవస్థలూ నాశనం
సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ నేతలు

చిత్తూరు సిటీ, ఏప్రిల్‌ 5: వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయని చిత్తూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు సీఆర్‌ రాజన్‌ ఆరోపించారు. ఇలా, గాడి తప్పిన పాలనను సక్రమమైన మార్గంలో పెట్టాలంటే మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకే సాధ్యమన్నారు. చిత్తూరులోని జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన చిత్తూరు పార్లమెంటు పరిధిలోని టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్యనేతల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంక్షేమ పథకాలకు పుట్టినిల్లు టీడీపీ అని పేర్కొన్నారు. కూటమి ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు విజన్‌ ఉన్న నేత అన్నారు. ఖజానా ఖాళీ అయిన రాష్ట్రాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి టీడీపీ ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసిందని చెప్పారు. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్‌ సిక్స్‌ పథకాలను అమలు చేస్తామని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్సీ దొరబాబు మాట్లాడుతూ గతంలో మద్యాన్ని విక్రయించడానికి అధికార యంత్రాంగాన్ని వినియోగించిన వైసీపీ ప్రభుత్వం పింఛన్ల పంపిణీకి ఎందుకు వినియోగించడంలేదని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం సక్రమంగా పింఛన్లు అందించని కారణంగా సుమారు 32 మంది మరణించారని, ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనని అన్నారు. ఇందుకు సీఎం బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో టీడీపీ నేతలు సురేంద్రకుమార్‌, మోహన్‌రాజ్‌, జనసేన పార్టీ నేతలు ఆరణి కవిత, మురళి రెడ్డి, బీజేపీ నేతలు అట్లూరి శ్రీనివాసులు, మోహన్‌ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 06 , 2024 | 01:45 AM