Share News

కోడ్‌ ఉల్లంఘనలపై చర్యలు చేపట్టాం: కలెక్టర్‌

ABN , Publish Date - Mar 29 , 2024 | 12:42 AM

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలపై అందే ప్రతి ఫిర్యాదుపైనా రాజకీయ పార్టీలకు అతీతంగా చర్యలు చేపడుతున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ షన్మోహన్‌ తెలిపారు.

కోడ్‌ ఉల్లంఘనలపై చర్యలు చేపట్టాం: కలెక్టర్‌
రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌

చిత్తూరు కలెక్టరేట్‌, మార్చి 28: ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలపై అందే ప్రతి ఫిర్యాదుపైనా రాజకీయ పార్టీలకు అతీతంగా చర్యలు చేపడుతున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ షన్మోహన్‌ తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో గురువారం ఆయన సమావేశమయ్యారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాల మేరకు రాజకీయ పార్టీలు ప్రచారాల కోసం ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. 48 గంటల ముందుగా సువిధ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. 85 సంవత్సరాల పైబడిన, విభిన్న ప్రతిభావంతులకు ఇంటి నుంచే ఓటింగ్‌ విధానంపై కసరత్తు చేపట్టామని, అందుకు గల కారణాలను ఆయన వివరించారు. టెలివిజన్‌ ఛానల్‌లో, కేబుల్‌ నెట్‌వర్కులు, డిజిటల్‌ డిస్‌ప్లేలు, వాయిస్‌ మేసేజ్‌ల ప్రచారానికి అనుమతి తీసుకోవాలని స్పష్టంచేశారు. ఇంటింటి ప్రచారానికి రోజువారి అనుమతులు తీసుకోవాలనే దానిపై పునఃసమీక్షించాలని పలువురు నాయకులు కోరారు. ఈ అంశాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్తానన్నారు. ట్రేడ్‌ యూనియన్‌ వద్ద జెండాలు తొలగిస్తున్నారని, ఇది ఎన్నికల కోడ్‌ పరిధిలోకి రాదని సీపీఎం గంగరాజు వివరించారు. రాజీనామా చేసిన వలంటీర్ల నుంచి సిమ్‌కార్డులు, మొబైల్స్‌ వెనక్కి తీసుకోవాలని కొందరు సూచించగా, వారి రాజీనామా పత్రాన్ని ఆమోదించాక తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో జేసీ శ్రీనివాసులు, డీఆర్వో పుల్లయ్య, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌ లక్ష్మీప్రసన్న, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈవీఎం గోదాము పరిశీలన

రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలిసి కలెక్టరేట్‌లోని ఈవీఎం గోదామును కలెక్టరు పరిశీలించారు. మే 13న పోలింగ్‌ ఉన్న నేపథ్యంలో 10 రోజులు ముందుగా ఈవీఎంలను పోలీసు బందోబస్తు మధ్య నియోజకవర్గ స్థాయిలో స్ర్టాంగ్‌ రూములకు తరలిస్తామన్నారు. మే 9న ఈవీఎంలను మరోసారి పరిశీలిస్తామన్నారు. డీఆర్‌వో పుల్లయ్యతో పాటు నేతలు అట్లూరి శ్రీనివాసులు (బీజేపీ), గంగరాజు (సీపీఎం), భాస్కర్‌ (కాంగ్రెస్‌), సురేంద్రకుమార్‌ (టీడీపీ), ఉదయ్‌కుమార్‌ (వైసీపీ) తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 29 , 2024 | 12:42 AM