Share News

నామినేషన్ల స్వీకరణా? స్ర్కూట్నీయా?

ABN , Publish Date - Apr 19 , 2024 | 01:20 AM

ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు నియమావళిని ఖచ్చితంగా పాటించాలని తిరుపతి నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి హోదాలో కార్పొరేషన్‌ కమిషనర్‌ అదితి సింగ్‌ ప్రెస్‌మీట్‌ పెట్టి చెప్పిన అరగంటలోనే నిబంధనలు తుంగలో తొక్కారన్న విమర్శలు వచ్చాయి.

నామినేషన్ల స్వీకరణా? స్ర్కూట్నీయా?

తిరుపతి, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు నియమావళిని ఖచ్చితంగా పాటించాలని తిరుపతి నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి హోదాలో కార్పొరేషన్‌ కమిషనర్‌ అదితి సింగ్‌ ప్రెస్‌మీట్‌ పెట్టి చెప్పిన అరగంటలోనే నిబంధనలు తుంగలో తొక్కారన్న విమర్శలు వచ్చాయి. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ రెడ్డి గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో మేయర్‌ డాక్టర్‌ శిరీష,డిప్యూటీ మేయర్‌ ముద్ర నారాయణతో కలిసి అర్బన్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఆర్వో అదితిసింగ్‌ నామినేషన్లు స్వీకరించి, సూత్రప్రాయంగా పరిశీలించి అక్నాలెడ్జ్‌మెంట్‌ ఇచ్చి పంపాల్సి ఉంటుంది. ఆమె అలా చేయకుండా రెండు గంటలు పాటు అభ్యర్థిని, ఆయనతో వచ్చినవారిని కార్యాలయంలో కూర్చోబెట్టుకుని నామినేషన్‌ దరఖాస్తును ఆసాంతం పరిశీలించినట్టు తెలుస్తోంది.గంట పాటు ఆమె పరిశీలించాక ఏఆర్వోగా ఉన్న మున్సిపల్‌ డిప్యూటీ కమిషనర్‌కు ఇచ్చినట్టు తెలిసింది. ఆయన మరో గంట నామినేషన్‌ పత్రాలను పరిశీలించి అంతా ‘ఓకే’ అన్న తర్వాత అక్నాలెడ్జ్‌మెంట్‌ ఇచ్చి పంపారు. పక్కనేవున్న ఆర్డీవో కార్యాలయంలో చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని తన భార్య సుధారెడ్డితో కలసివచ్చి నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. కేవలం పదినిమిషాల్లానో ఈ తంతును పూర్తిచేశారు. అయితే అర్బన్‌ తహసీల్ధార్‌ కార్యాలయంలో రెండు గంటలు గడుస్తున్నా లోపలివారు బయటకు రాకపోవడం చర్చగా మారింది. ఈనెల 26న నామినేషన్ల స్ర్కూట్నీ ఉంటుంది. అభ్యర్థులు సమర్పించిన నామినేషన్‌ పత్రాలను పరిశీలించి, నిబంధనలకు లోబడి ఉన్నవాటిని పోటీ జాబితాలో పొందుపరుస్తారు. అందుకే కొందరు అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లను దాఖలు చేస్తుంటారు. మరి తిరుపతి ఆర్వో వ్యవహరించిన తీరుపై నామినేషన్ల తొలిరోజే విమర్శలు రావడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కాగా అభినయ్‌రెడ్డి రెండు సెట్ల నామినేషన్లు వేయగా అతని స్నేహితులు పెంచల ప్రసాద్‌, ఆర్‌.కృష్ణ చైతన్య, బండ్ల చంద్రశేఖర్‌, బృంగి నవీన్‌, సోమశేఖర్‌ రెడ్డి, శేఖర్‌ ఇండిపెండెంట్‌ అభ్యర్థులుగా నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. ఏజెంట్‌ ఫారాలు, బూత్‌ ఏజెంట్ల కోసమే ఈ ఆరుగురితో నామినేషన్లు వేయించారన్న ఆరోపణలొచ్చాయి.

Updated Date - Apr 19 , 2024 | 01:20 AM