Share News

డిప్యూటీ మేయర్‌, కార్పొరేటర్‌ పదవులకు అభినయ్‌ రాజీనామా

ABN , Publish Date - Jun 27 , 2024 | 01:03 AM

తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ డిప్యూటీ మేయర్‌ భూమన అభినయ్‌ తన పదవికి రాజీనామా చేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న 4వ డివిజన్‌ కార్పొరేటర్‌ పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. పోలింగ్‌కు 40 రోజుల ముందే రాజీనామా లేఖ సమర్పించారని తెలిసింది. అయితే మున్సిపల్‌ యంత్రాంగం ఈ విషయం చాలా గోప్యంగా ఉంచింది.

డిప్యూటీ మేయర్‌, కార్పొరేటర్‌ పదవులకు అభినయ్‌ రాజీనామా

తిరుపతి, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ డిప్యూటీ మేయర్‌ భూమన అభినయ్‌ తన పదవికి రాజీనామా చేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న 4వ డివిజన్‌ కార్పొరేటర్‌ పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. పోలింగ్‌కు 40 రోజుల ముందే రాజీనామా లేఖ సమర్పించారని తెలిసింది. అయితే మున్సిపల్‌ యంత్రాంగం ఈ విషయం చాలా గోప్యంగా ఉంచింది. ఎన్నికల ఫలితాలు వచ్చేవరకు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా లేఖను బయటపెట్టవద్దని తీవ్రంగా ఒత్తిడి చేసినట్టు తెలిసింది. ఫలితాల తర్వాత అభినయ్‌ రాజీనామా చేసినట్టు లీకులు వచ్చినా అధికారులు ధృవీకరించలేదు. అయితే అభినయ్‌ రాజీనామా లేఖ బుధవారం బయటకు వచ్చింది. తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తున్న నేపథ్యంలో డిప్యూటీ మేయర్‌ పదవితో పాటు కార్పొరేటర్‌గా రాజీనామా చేస్తున్నట్టు అందులో ఆయన పేర్కొన్నారు. ఏప్రిల్‌ 6న మేయర్‌కు లేఖ రాయగా, అదేరోజు మేయర్‌ డాక్టర్‌ శిరీష రాజీనామా లేఖను ఆమోదించారని తెలుస్తోంది.

గోప్యత ఎందుకు?

రాజీనామాపై ఇంత గోప్యత పాటించడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.జనవరి 4న అభినయ్‌ని ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ అధినాయకత్వం ప్రకటించింది.అప్పటినుంచి ఆత్మీయ సమ్మేళనాలు, సమావేశాలతో బిజీగా మారారు.నామినేషన్‌ వేయకముందే డిప్యూటీ మేయర్‌ హోదాతో ఇద్దరు గన్‌మెన్లను ప్రభుత్వం నుంచి నియమించుకున్నారు. నిజానికి డిప్యూటీ మేయర్‌ హోదాకు గన్‌మెన్లను ఇవ్వరు. చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి కూడా చంద్రగిరి అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే తన ఎంపీపీ పదవికి రాజీనామా ఇచ్చారు. అభినయ్‌ ఏప్రిల్‌ 6న ఎవ్వరికీ చెప్పకుండా రాజీనామా చేసేసినా రహస్యంగానే ఉంచారు. ఎలాగూ తామే గెలుస్తామన్న ధీమాతోనే కార్పొరేటర్‌ పదవికి కూడా రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. కాగా ఎన్నికల ఫలితాల అనంతరం అంచనాలు తారుమారవ్వడంతో రాజీనామాను వెనక్కి తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం.

4వ డివిజన్‌ నుంచి ఎన్నికై...

తిరుపతిలోని 4వ డివిజన్‌ నుంచి ఏకగ్రీవంగా అభినయ్‌ కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. టీడీపీ అభ్యర్థి గీతను వైసీపీ నేతలు బెదిరించడంతో ఆమె నామినేషన్‌ వేయకుండానే తిరుగుముఖం పట్టారు. 2021 మార్చి 18న అభినయ్‌ కార్పొరేటర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. నాలుగు నెలల తర్వాత తన పుట్టినరోజైన జులై 30న డిప్యూటీ మేయర్‌గా బాధ్యతలు చేపట్టారు. 31వ డివిజన్‌ కార్పొరేటర్‌ సీకే రేవతి ప్రతిపాదించగా 49వ డివిజన్‌ కార్పొరేటర్‌ సంధ్యారాణి తదితర కార్పొరేటర్లు బలిపరిచారు. కాగా ప్రతిపాదించిన కార్పొరేటర్‌ రేవతి ఎన్నికలకు ముందే జనసేనలో చేరిపోయారు.

Updated Date - Jun 27 , 2024 | 01:03 AM