ఆరేళ్ల తర్వాత ఆర్టీసీకి కొత్త కళ
ABN , Publish Date - Jan 06 , 2024 | 01:20 AM
ఆరేళ్ల తర్వాత జిల్లాకు కొత్త ఆర్టీసీ బస్సులు రానున్నాయి. పైగా తాజా సాంకేతిక పరిజ్ఞానం(భారత్‌స్టేజ్ 6 టాటా, లేల్యాండ్ బస్సులు)తో కూడిన సరికొత్త బస్సులు రానున్నాయి.
తిరుపతి(కొర్లగుంట), జనవరి 5: ఆరేళ్ల తర్వాత జిల్లాకు కొత్త ఆర్టీసీ బస్సులు రానున్నాయి. పైగా తాజా సాంకేతిక పరిజ్ఞానం(భారత్‌స్టేజ్ 6 టాటా, లేల్యాండ్ బస్సులు)తో కూడిన సరికొత్త బస్సులు రానున్నాయి. ఫిబ్రవరి నుంచి మే వరకు విడతల వారీగా ఇవి రోడ్డెక్కనున్నాయి. తిరుపతి జిల్లాలోని 11డిపోల పరిధిలో దాదాపు 800 ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. ఇవన్నీ 2018 జూలైకు ముందు ఆయా డిపోలకు వచ్చినవే. ఆ తర్వాత ఒక్క బస్సును కూడా ఆర్టీసీ సొంతంగా కొనుగోలు చేయలేదు. ఉన్నవాటికే తాత్కాలిక రిపేర్లు, మరమ్మతులు చేసుకుంటూ కాలం గడిపింది. ఈ క్రమంలో విజయవాడ ఆర్టీసీ ప్రధాన కార్యాలయం మార్గదర్శకాల ప్రకారం 252(అమరావతి ఏసీ వోల్వో-10, సూపర్‌లగ్జరి-32, అల్ర్టాడీలెక్స్-11, ఎక్స్‌ప్రెస్-52, పల్లెవెలుగు-147)బస్సులను కాలం చెల్లినవిగా గుర్తించారు. వాటి స్థానంలో కొత్తవి ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. టాటా, అశోక్ లేల్యాండ్ కంపెనీల నుంచి కొత్త బస్సుల ఏర్పాటు పనులు జోరుగా సాగుతున్నాయి.
డిపోల వారీగా కొత్తబస్సులు
తిరుపతి-41 : సూపర్‌లగ్జరీ 7, అల్ర్టాడీలెక్స్ 8, ఎక్స్‌ప్రెస్ 3, పల్లెవెలుగు 23
మంగళం-29 : అమరావతి ఏసీ వోల్వో 10, సూపర్‌లగ్జరీ 2, పల్లెవెలుగు 17
పుత్తూరు-18 : సూపర్‌లగ్జరీ 2, పల్లెవెలుగు 16
శ్రీకాళహస్తి-11 : సూపర్‌లగ్జరీ 2, అల్ర్టాడీలెక్స్ 2, పల్లెవెలుగు 7
వెంకటగిరి-41 : సూపర్‌లగ్జరీ 13, ఎక్స్‌ప్రెస్ 11, పల్లెవెలుగు 17
గూడూరు-36 : ఎక్స్‌ప్రెస్ 16, పల్లెవెలుగు 20
వాకాడు-43 : ఎక్స్‌ప్రెస్ 16, పల్లెవెలుగు 27
సూళ్లూరుపేట-20 : సూపర్‌లగ్జరీ 5, ఎక్స్‌ప్రెస్ 4, పల్లెవెలుగు 11
సత్యవేడు-13 : సూపర్‌లగ్జరీ 1, అల్ర్టాడీలెక్స్ 1, ఎక్స్‌ప్రెస్ 2, పల్లెవెలుగు 9
త్వరలో మరో 50 ఎలక్ర్టిక్ బస్సులు
అద్దె ప్రాతిపదికన త్వరలో మరో 50 ఎలక్ర్టిక్ బస్సులు తిరుపతి జిల్లాకు రానున్నాయి. ఈ మేరకు టెండర్ ప్రక్రియను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ఒలెక్ర్టా కంపెనీకి చెందిన ఎలక్ర్టిక్ బస్సులు ఇప్పటికే జిల్లాలో 100 దాకా తిరుగుతున్నాయి.తాజాగా వచ్చే బస్సులను శ్రీకాళహస్తి- తిరుపతి మధ్య 24, మిగిలిన 26 తిరుపతి కేంద్రంగా 70కిలోమీటర్ల దూరం వరకు ప్రముఖ నగరాలకు నడిపేందుకు కసరత్తు చేస్తున్నారు.