Share News

ఏనుగుల గుంపు స్వైరవిహారం

ABN , Publish Date - Feb 12 , 2024 | 01:32 AM

సోమల మండలంలోని పేటూరు గ్రామ సమీపంలో శనివారం రాత్రి ఏనుగుల గుంపు స్వైర విహారం చేసింది.

ఏనుగుల గుంపు స్వైరవిహారం
ధ్వంసమైన మామిడి తోట

సోమల, ఫిబ్రవరి 11: సోమల మండలంలోని పేటూరు గ్రామ సమీపంలో శనివారం రాత్రి ఏనుగుల గుంపు స్వైర విహారం చేసింది. గ్రామానికి చెందిన చిట్టిబాబు, ప్రసాద్‌, సుబ్రహ్మణ్యం, రఘు, టమోటాతోటల్లో కాయలను తిన్నంతా తిని ఊతంగా నాటిన కర్రలను, డ్రిప్‌ పరికరాలను ధ్వంసం చేశాయి. ఆ సమీపంలోనే ఇళ్లపల్లెకు చెందిన ఊసన్న మరో ఇద్దరి ఇళ్లనూ ధ్వంసం చేశాయి. ఏనుగుల భీకర అరుపులతో ఇళ్ల నుంచి జనం పరుగులు పెట్టారు. మేకల మందలను తీసుకుని తలో దిక్కుకు పారిపోయారు. పది ఏనుగుల గుంపు సంచారంతో రైతులు భయాందోళన చెందుతున్నారు. వారం రోజులుగా సోమల, నెల్లిమంద, తమ్మినాయనపల్లె, ఇరికిపెంట పంచాయతీల్లోని పొలాల్లో ఏనుగుల సంచారంతో టమోటా తోటల్లో కాయలు కోతలు జరగడం లేదు. కొందరు రైతులు జట్లుగా ఏర్పడి టపాసులు పేల్చుకుంటూ, డప్పుల శబ్దం చేస్తున్నారు. మరికొందరు పొలాల వద్దనే మంటలు వేసుకుని జాగరణ చేస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఇకనైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Updated Date - Feb 12 , 2024 | 01:33 AM