Share News

వైభవంగా కైలాసగిరి ప్రదక్షిణ

ABN , Publish Date - Jan 17 , 2024 | 02:13 AM

శ్రీకాళహస్తిలో కైలాసగిరి ప్రదక్షిణ సంబరం అంబరాన్ని తాకింది.తమ కళ్యాణ మహోత్సవానికి దేవగణాలను శివపార్వతులు ఆహ్వానించే వేడుకకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.

వైభవంగా కైలాసగిరి ప్రదక్షిణ
గిరి ప్రదక్షిణలో ఊరేగుతున్న స్వామి అమ్మవారు

వివాహ వేడుకకు దేవగణాలను ఆహ్వానించిన పార్వతీ పరమేశ్వరులు

శ్రీకాళహస్తి జనవరి 16: శ్రీకాళహస్తిలో కైలాసగిరి ప్రదక్షిణ సంబరం అంబరాన్ని తాకింది.తమ కళ్యాణ మహోత్సవానికి దేవగణాలను శివపార్వతులు ఆహ్వానించే వేడుకకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. మహాశివరాత్రి ఉత్సవాల్లో శివపార్వతుల కల్యాణ వేడుక వైభవంగా జరుగుతుంది.ఈ వేడుకకు రావాలంటూ పరమశివుడు సతీసమేతుడై కనుమ పండుగ రోజున దేవగణాలకు ఆహ్వానం పలుకుతారు.ఇందులో భాగంగా మంగళవారం స్వామి అమ్మవార్లు గిరిప్రదక్షిణగా వెళ్లి దేవగణాలకు ఆహ్వానం అందజేశారు.సోమవారం త్రిశూలం,పల్లకి గిరి ప్రదక్షిణ జరిగింది.మంగళవారం అర్చకులు అలంకార మండపంలో స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించారు.భక్తుల శివనామ స్మరణ మధ్య స్వామి అమ్మవార్ల గిరిప్రదక్షిణ ఉదయం 7.30గంటలకు ఆలయం నుంచి మొదలైంది.వివిధ వాయిద్యాలు,కోలాట నృత్యాల నడుమ పార్వతీ పరమేశ్వరులతో పాటు వేలాది మంది భక్తులు వెంట నడిచారు.విడిది మండపాల వద్ద స్వామి అమ్మవార్లను కొలువుదీర్చగా స్థానిక ఉభయ దారులు నైవేద్యాలు సమర్పించారు.దాతలు పెద్దసంఖ్యలో మంచినీళ్లు,మజ్జిగ,శీతల పానీయాలు, అన్నప్రసాదాలు అందించారు. కైలాసగిరి రిజర్వాయర్‌ ఎదురుగా అంజూరు వారి మండపం వద్ద ముక్కంటి ఆలయం తరఫున భక్తులకు అన్నదానం చేశారు. చైర్మన్‌ శ్రీనివాసులు, ఈవో రామారావు భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించారు. గిరి ప్రదక్షిణకు హాజరు కానివారు పట్టణ శివారులోని శుకబ్రహ్మశ్రమం వద్దకు సాయంత్రం వేలాదిగా తరలివచ్చారు. స్వామి అమ్మవార్లు తిరిగి వచ్చేలోపు స్వర్ణముఖి నదిలో పిల్లలు పెద్దలు ఆటపాటలతో కేరింతలు కొట్టారు.కోనేటి మిట్ట ప్రాంతంలోని ఎదురు సేవ మండపం వద్దకు స్వామి అమ్మవార్లు రాగా ప్రత్యేక పూజలు చేసి నైవేద్య హారతులను సమర్పించారు. ఈ ఎదురు సేవలో ఎంపీ గురుమూర్తి , ఎమ్మెల్యే మధుసూదన రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.ఇక్కడి నుంచి ముక్కంటి ఆలయం వరకూ స్వామి అమ్మవార్లు ఊరేగి గిరి ప్రదక్షిణకు స్వస్తి పలికారు.రాత్రి స్వామి అమ్మవార్లు అశ్వ,సింహ వాహనంపై పురవీధుల్లో ఊరేగి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.

Updated Date - Jan 17 , 2024 | 02:13 AM