Share News

ఒకే రోజు 89 మందికి కుక్కకాటు

ABN , Publish Date - Feb 12 , 2024 | 01:42 AM

చిత్తూరులో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. ఆదివారం ఒక్క రోజే నగరంలోని పలు ప్రాంతాల్లో 89 మందిని కరిచాయి.

ఒకే రోజు 89 మందికి కుక్కకాటు
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శిస్తున్న కమిషనర్‌ అరుణ

చిత్తూరు రూరల్‌, ఫిబ్రవరి 11: చిత్తూరులో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. ఆదివారం ఒక్క రోజే నగరంలోని పలు ప్రాంతాల్లో 89 మందిని కరిచాయి. జెండామాను వీధి, తోటపాళ్యం, సంతపేట, ఇంద్రానగర్‌, కోర్టు జంక్షన్‌, ఎంఎ్‌సఆర్‌ సర్కిల్‌, కట్టమంచి, బజారు వీధుల్లోకొచ్చిన వాహనదారులతోపాటు స్థానికులు బాధితులుగా ఉన్నారు. వీరిలో 60 మందిపై ఒకే కుక్క దాడి చేయడం గమనార్హం. బాధితులంతా చిత్తూరు ప్రభుత్వాస్పత్రిల్లో చికిత్స తీసుకున్నారు.

కార్పొరేషన్‌ లెక్కల ప్రకారమే 50 డివిజన్లలో 4వేలున్నాయి

50 డివిజన్లలో కార్పొరేషన్‌ లెక్కల ప్రకారమే నాలుగు వేల వీధికుక్కలు ఉన్నట్లు సమాచారం. అయితే స్వచ్ఛంద సంస్థల సర్వే ప్రకారం సుమారు 15వేల కంటే ఎక్కువ ఉన్నట్లు సమాచారం. ఒక్కో వీధిలోనే పది కుక్కల వరకు ఉంటున్నాయి. పది రోజుల కిందట కూడా 13వ డివిజన్‌ పరిధిలోని మాపాక్షికి చెందిన రామస్వామి యాదవ్‌ గొర్రెల షెడ్‌లో దూరి సుమారు పది గొర్రెలపై దాడి చేసి, చంపేశాయి. రెండ్రోజుల కిందట మిట్టూరులోని రెడ్‌క్రాస్‌ వీధిలోని కిడోస్‌ ప్రీప్రైమరీ స్కూల్‌ సమీపంలో ఇద్దరు వృద్ధులు వాకింగ్‌ కోసం మెసానికల్‌ మైదానానికి వెళ్తుండగా సుమారు 10 వీధి కుక్కలు దాడి చేశాయి. వారు గట్టిగా అరవడంతో చుట్టుపక్కల వారు వచ్చి రాళ్లు రువ్వడంతో చిన్న గాయాలతో బయట పడ్డారు. ఇలా శునకాల దాడిలో గాయపడటంతో రోజూ యూపీహెచ్‌సీల్లో, ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో పదుల సంఖ్యలో కుక్క కాటు కేసులు నమోదు అవుతున్నాయి.

సిరంజులు లేవట

చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో సిరంజులు లేవని అక్కడి వైద్య సిబ్బంది చెబుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. దీంతో చేసేదేమీలేక బయట మెడికల్‌ షాపునకు వెళ్లి సిరంజి తీసుకొచ్చి వ్యాక్సిన్‌ వేయించుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

బాధితులను పరామర్శించిన

డీసీహెచ్‌ఎ్‌స, కమిషనర్‌

వీధి కుక్కల దాడిలో గాయపడిన వారిని డీసీహెచ్‌ఎ్‌స రాజశేఖర్‌రెడ్డి, నగరపాలక సంసంస్థ కమిషనరు అరుణ పరామర్శించారు. సిరంజులు, మందులు బయట రాస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంఘటన జరిగినప్పుడే అధికారుల హడావుడి

ఏదైనా సంఘటన జరిగినప్పుడే అధికారులు హడావుడి చేస్తారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పైగా నాలుగువేల కుక్కలుంటే 20 కూడా పట్టని ఓ వాహనాన్ని తీసుకొచ్చి ఫొటోలు ఫోజులిచ్చి వెళ్లిపోతారని వాపోతున్నారు. పైగా ఓ వీధిలో పట్టుకున్న కుక్కలను కూడా మరో వీధిలో విడిచి పెడుతున్నారన్న విమర్శలూ లేకపోలేదు. ఆదివారం కూడా 60 మందిపై దాడి చేసిన కుక్కను పట్టుకున్నట్లు నగరపాలక సంస్థ తెలిపారు. అయితే బాధితులు మాత్రం అది తమను కరిచిన కుక్క కాదని చెబుతున్నారు.

Updated Date - Feb 12 , 2024 | 01:42 AM