Share News

హాస్టళ్ల బాగుకు రూ.6.55 కోట్లు అవసరం

ABN , Publish Date - Jul 05 , 2024 | 12:57 AM

జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వికలాంగుల శాఖల ఆధ్వర్యంలోని వసతిగృహాల మరమ్మతులకు రూ.6.55 కోట్లు అవసరమని అధికార యంత్రాంగం ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

హాస్టళ్ల బాగుకు రూ.6.55 కోట్లు అవసరం

ఫ ప్రతిపాదనలు సిద్ధం చేసిన యంత్రాంగం

చిత్తూరు, జూలై 4: జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వికలాంగుల శాఖల ఆధ్వర్యంలోని వసతిగృహాల మరమ్మతులకు రూ.6.55 కోట్లు అవసరమని అధికార యంత్రాంగం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వైసీపీ పాలనలో ఐదేళ్లుగా హాస్టళ్ల బాగోగులు పట్టించుకోలేదు. దీంతో శిథిలమైన భవనాలు, పెచ్చులూడిన పైకప్పులు, అధ్వాన మరుగుదొడ్లు, తాగునీటి సమస్యలతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కొత్తగా బాధ్యతలు తీసుకున్న కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ తొలిరోజే వసతిగృహాల స్థితిగతులపై సమీక్షించారు. వీటిపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. దీంతో సంక్షేమశాఖల అధికారులు రూ.6.55 కోట్లు అవసరమని నివేదిక అందించారు. ఇందులో మెష్‌, డోర్స్‌, విండోలకు రూ. 40 లక్షలు, బోరు మోటార్లు, పైపులైన్లు, ట్యాంకు రిపేర్లకు రూ.1.20 కోట్లు, డ్రైనేజీ, సెప్టిక్‌ ట్యాంకు, టాయిలెట్లకు రూ.70 లక్షలు, ఎలక్ట్రికల్‌ వర్క్స్‌, ఫ్యాన్లు, లైట్లకు రూ. 15 లక్షలు, కిచెన్‌ రిపేర్లు, గ్యాస్‌స్టవ్‌, ఆర్వో ప్లాంట్‌, గ్రైండర్లకు రూ. 70 లక్షలు, కొత్త ప్రహరి, వున్న ప్రహరీ ఎత్తు పెంచడానికి, మరమ్మతులకు రూ.1.90 కోట్లు, ఇతర పనులకు రూ. 1.50 కోట్లతో నివేదికను కలెక్టర్‌కు ఇచ్చారు. దీనిపై మరోసారి కూడా అధికారులు వసతిగృహాలను పరిశీలించి స్పష్టమైన నివేదిక ఇవ్వాలని కలెక్టరు ఆదేశించారు. దీంతో మండలస్థాయి అధికారుల బృందం మళ్లీ నివేదికల తయారీలో నిమగ్నమయ్యాయి. కాగా, ఒకట్రెండు రోజుల్లో ఈ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపనున్నారు. నిధులు మంజూరు కాగానే హాస్టళ్ల బాగుకు పనులు ప్రారంభించనున్నారు.

హాస్టళ్లు ఇలా..

జిల్లాలో సాంఘిక సంక్షేమశాఖ (ఎస్సీ) పరిధిలో 57, బీసీ 38, ఎస్టీ 11, మైనార్టీ, వికలాంగశాఖ పరిధిలో ఒక్కోటి వంతున 108 వసతిగృహాలు నడుస్తున్నాయి. వీటిలో 6500 మంది విద్యార్థులు ఉండి చదువుకుంటున్నారు.

Updated Date - Jul 05 , 2024 | 12:57 AM