Share News

17 నుంచి ఆరో స్థానానికి..

ABN , Publish Date - Apr 23 , 2024 | 12:29 AM

జిల్లాల విభజన తర్వాత రెండోసారి సోమవారం విడుదలైన టెన్త్‌ ఫలితాల్లో జిల్లా ఆరో స్థానంలో నిలిచింది.

17 నుంచి ఆరో స్థానానికి..

చిత్తూరు (సెంట్రల్‌), ఏప్రిల్‌ 22: జిల్లాల విభజన తర్వాత రెండోసారి సోమవారం విడుదలైన టెన్త్‌ ఫలితాల్లో జిల్లా ఆరో స్థానంలో నిలిచింది. గతేడాది 17వ స్థానంలో నిలవగా, ఈ ఏడాది ఆరో స్ధానానికి ఎగబాకింది. ఎప్పటిలాగే ఈ ఏడాదీ బాలికలు సత్తా చాటారు. జిల్లా స్థాయిలో టెన్త్‌ ఫలితాలను డీఈవో దేవరాజు, పరీక్షల విభాగం సహాయ కమిషనర్‌ చాముండేశ్వరి డీఈవో కార్యాలయంలో విడుదల చేశారు. స్థానిక కేశవరెడ్డి పాఠశాలల్లో చదువుతున్న వీఎన్‌ రోషిణి 600 మార్కులకు గాను 596 మార్కులు సాధించి జిల్లా టాపర్‌గా నిలిచింది. జిల్లాలో 20,939 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 19,113 మంది (91.28 శాతం) ఉత్తీర్ణులయ్యారు. 1,826 మంది ఫెయిలయ్యారు. 10,146 మంది బాలికలకు గాను 9,517 మంది (93.8శాతం) ఉత్తీర్ణులు కాగా, 629 మంది ఫెయిలయ్యారు. 10,793 మంది బాలురుకు గాను 9,596 మంది (88.91శాతం) పాస్‌ కాగా 1,197 మంది ఫెయిలయ్యారు. 15,463 మంది విద్యార్థులు ఫస్ట్‌ క్లాసు, 2,593 మంది సెకండ్‌ క్లాసు, 1,057 మంది థర్డ్‌ క్లాసులో ఉత్తీర్ణులయ్యారు.

ఫ వంద శాతం ఉత్తీర్ణతతో ఎయిడెడ్‌, ఏపీ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ ముందంజలో ఉండగా, 79.05 శాతం ఉత్తీర్ణతతో మున్సిపల్‌ స్కూల్స్‌ చివరి స్థానంలో నిలిచాయి. కాగా జిల్లాలో 159 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించగా, ఇందులో ప్రైవేటు పాఠశాలలు 83 ఉండగా, ప్రభుత్వ పాఠశాలలు 76 ఉన్నాయి.

Updated Date - Apr 23 , 2024 | 12:29 AM