Share News

పలమనేరులో రూ.16.5 లక్షల పట్టివేత

ABN , Publish Date - Apr 06 , 2024 | 01:41 AM

శుక్రవారం రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో పోలీసులు రూ.16.5 లక్షలు పట్టుకొన్నారు.

పలమనేరులో  రూ.16.5 లక్షల పట్టివేత

పలమనేరు, ఏప్రిల్‌ 5: పలమనేరు గంటావూరు కాలనీలోని అస్లాం వద్ద శుక్రవారం రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో పోలీసులు రూ.16.5 లక్షలు పట్టుకొన్నారు. తమకు అందిన సమాచారం మేరకు వీరు తనిఖీ చేసి ఈ మొత్తాన్ని గుర్తించారు. వెంటనే ఎఫ్‌ఎ్‌సటీ అధికారులకు సమాచారమిచ్చారు. ఎఫ్‌ఎ్‌సటీ అధికారి రుషివర్మ తదితరులు అక్కడకు చేరుకున్నారు. డబ్బుకు సంబంధించి విచారించగా.. తనవద్ద బిల్లులు ఉన్నాయని అస్లాం చెప్పారు. వాటిని తీసుకురావాలని ఎఫ్‌ఎ్‌సటీ అధికారి సూచించారు. పలమనేరులో కొందరి నుంచి నగదుకు సంబంధించి కొన్ని బిల్లులను అస్లాం తీసుకొచ్చి ఇచ్చారు. ఎఫ్‌ఎ్‌సటీ అధికారులు రాత్రి 12 గంటల వరకు కూడా బిల్లులు పరిశీలిస్తున్నారు. పట్టుబడిన రూ.16.50 లక్షలకు గాను అతడు రూ.15.80 లక్షలకు బిల్లులు తీసుకొచ్చి చూపారని, మిగిలిన మొత్తానికి కూడా బిల్లులు తెస్తే సరిపోతుందని అధికారులు మీడియాకు లీకులిచ్చారు.

ఎందుకిలా.. ?

సాధారణంగా ఎన్నికల నిబంధనల మేరకు నగదు పట్టుకొన్నప్పుడే ఆధారాలు చూపించాలి. లేదంటే ఆ నగదును అధికారులు పంచనామా రాసి సీజ్‌చేయాలి. ఆ తర్వాత బిల్లులు చూపి నగదు తీసుకోవచ్చు. వారం క్రితం పలమనేరులోనే లక్ష్మి అనే మహిళ ఇంట్లో పోలీసులు తనిఖీచేసి రూ.16 లక్షలు పట్టుకొని వెంటనే ఎఫ్‌ఎ్‌సటీం అధికారులకు సమాచారమిచ్చారు. వాళ్లు వచ్చి వెంటనే ఆ నగదును సీజ్‌ చేశారు. శుక్రవారం రాత్రి మాత్రం బిల్లులు తెచ్చేందుకు గంటల వ్యవధి ఎందుకు ఇచ్చారన్న అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. ఈవిషయమై ఎస్‌ఐ సహదేవిని వివరణ కోరగా.. నగదు పట్టుకోవడం వరకు తమ విధి అని తరువాత విచారణ ఎఫ్‌ఎ్‌సటీ అధికారులు చూస్తారని తెలిపారు.

Updated Date - Apr 06 , 2024 | 01:42 AM