Share News

తొలిరోజు 16 నామినేషన్లు

ABN , Publish Date - Apr 19 , 2024 | 01:17 AM

సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన తొలిరోజే తిరుపతి జిల్లాలో 16మంది నామినేషన్లు దాఖలు చేశారు. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒకటి, ఆరు అసెంబ్లీ స్థానాలకు 15 చొప్పున దాఖలయ్యాయి. 16 మంది అభ్యర్థులు మొత్తంగా 21సెట్ల నామినేషన్లు సమర్పించారు.

తొలిరోజు 16 నామినేషన్లు
శ్రీకాళహస్తిలో నామినేషను వేసేందుకు ఊరేగింపుగా వస్తున్న సుధీర్‌ రెడ్డి

తిరుపతి, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన తొలిరోజే తిరుపతి జిల్లాలో 16మంది నామినేషన్లు దాఖలు చేశారు. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒకటి, ఆరు అసెంబ్లీ స్థానాలకు 15 చొప్పున దాఖలయ్యాయి. 16 మంది అభ్యర్థులు మొత్తంగా 21సెట్ల నామినేషన్లు సమర్పించారు. తిరుపతి పార్లమెంటు స్థానానికి లిబరేషన్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున రిటైర్డు ఐఏఎస్‌ అధికారి విజయ్‌ కుమార్‌ తిరుపతిలో కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఎదుట నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారు.తిరుపతి అసెంబ్లీకి ఏడుగురు అభ్యర్థులు పది సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. శ్రీకాళహస్తి నుంచీ ముగ్గురు ఐదు సెట్ల నామినేషన్లు వేశారు. సత్యవేడుకు రెండు, సూళ్ళూరుపేట, వెంకటగిరి, చంద్రగిరి స్థానాలకు ఒక్కొక్కటి చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. గూడూరు అసెంబ్లీ స్థానానికి తొలిరోజు ఒక్క నామినేషన్‌ కూడా వేయలేదు.

చంద్రగిరి, శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థుల నామినేషన్లు

చంద్రగిరి అసెంబ్లీ స్థానానికి టీడీపీ అభ్యర్థి పులివర్తి వెంకట మణిప్రసాద్‌ అలియాస్‌ పులివర్తి నానీ నామినేషన్‌ దాఖలు చేశారు. తిరుపతి ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్‌ కేంద్రానికి ఆయన తన సతీమణి సుధారెడ్డితో కలసి వాహనంలో వెళ్ళారు. పోలీసులు కార్యాలయ ఆవరణలోకి వాహనాన్ని అనుమతించలేదు. సుధారెడ్డి కాలికి గాయమైనందున నడవలేనని చెప్పడంతో తర్వాత వాహనాన్ని అనుమతించారు. గాయంతో నడవలేని స్థితిలో నామినేషన్‌ పత్రాలు దాఖలు చేసేందుకు వచ్చిన తమను వాహనం అడ్డుకుని ఇబ్బంది పెట్టడంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని టీడీపీ అభ్యర్థి పులివర్తి నానీ మీడియాకు చెప్పారు. కాగా శ్రీకాళహస్తిలో టీడీపీ అభ్యర్థి బొజ్జల వెంకట సుధీర్‌రెడ్డి అట్టహాసంగా వేలాదిమంది కార్యకర్తలు, అనుచరులతో ఊరేగింపుగా వెళ్ళి నామినేషన్‌ వేశారు. ఆయన రెండు సెట్లు, ఆయన సతీమణి బొజ్జల రిషిత రెండు సెట్లు చొప్పున నామినేషన్లు వేశారు.నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలి రావడం, బాణాసంచా భారీ ఎత్తున పేల్చడంతో పట్టణమంతా సందడి నెలకొంది. నామినేషన్‌ దాఖలు చేసిన సమయంలో తిరుపతి బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్‌, తిరుపతి పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు నరసింహ యాదవ్‌, మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు, బీజేపీ నేత కోలా ఆనంద్‌ తదితరులు ఆయన వెంట వున్నారు. భారత చైతన్య యువజన పార్టీ తరపున దినద్‌ బాబు నామినేషన్‌ దాఖలు చేశారు.

నాలుగు సెగ్మెంట్లలో వైసీపీ అభ్యర్థుల నామినేషన్లు

తిరుపతిలో వైసీపీ అభ్యర్థి భూమన అభినయ్‌రెడ్డి రెండు సెట్ల నామినేషన్లు వేయగా మరో ఆరుగురు ఇండిపెండెంట్లుగా నామినేషన్‌ పత్రాలు సమర్పించారు.సూళ్ళూరుపేటలో వైసీపీ అభ్యర్థి కిలివేటి సంజీవయ్య నామినేషన్‌ వేశారు. వెంకటగిరిలో వైసీపీ అభ్యర్థి నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి నామినేషన్‌ పత్రాలను ఆయన తల్లి రాజ్యలక్ష్మి ఆర్వోకు సమర్పించారు. సత్యవేడులో వైసీపీ అభ్యర్థి నూకతోటి రాజేష్‌ తరపున ఆయన సతీమణి చైతన్య భాను నామినేషన్‌ వేశారు.ఆ సందర్భంగా రాజేశ్‌ నామినేషన్‌ కేంద్రం వెలుపలే వున్నారు. అక్కడే కాంగ్రెస్‌ అభ్యర్థిగా బాలగురవం బాబు కూడా నామినేషన్‌ పత్రాలు అందజేశారు.

Updated Date - Apr 19 , 2024 | 01:17 AM