కాంట్రాక్టర్లకు రూ.13వేల కోట్లు పంచారు
ABN , Publish Date - Apr 03 , 2024 | 01:07 AM
సొంత పార్టీ కాంట్రాకర్లకు దొడ్డిదారిన రూ.13వేల కోట్లు చెల్లించిన జగన్‌రెడ్డి ప్రభుత్వం వద్ద పెన్షన్ల పంపిణీకి నిజంగా డబ్బులు లేవా? అంటూ టీడీపీ నాయకులు ప్రశ్నించారు

చిత్తూరు కలెక్టరేట్, ఏప్రిల్ 2: సొంత పార్టీ కాంట్రాకర్లకు దొడ్డిదారిన రూ.13వేల కోట్లు చెల్లించిన జగన్‌రెడ్డి ప్రభుత్వం వద్ద పెన్షన్ల పంపిణీకి నిజంగా డబ్బులు లేవా? అంటూ టీడీపీ నాయకులు ప్రశ్నించారు. ఎండల్లో వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులను సచివాలయాలకు వెళ్లి పెన్షన్ తీసుకోవాని ప్రభుత్వం ఆదేశించడం దుర్మార్గమన్నారు. వలంటీర్ల స్థానంలో ప్రభుత్వ సిబ్బంది ద్వారా ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు నేరుగా పెన్షన్లు అందించే చర్యలు చేపట్టాలని కోరారు. లేకుంటే కలెక్టరేట్, మున్సిపాలిటీ, తహసీల్దారు కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ఈమేరకు వీరు మంగళవారం కలెక్టరేట్‌లో జేసీ శ్రీనివాసులును కలిసి వినతిపత్రాన్ని అందించారు. ఈ వ్యవహారంపై కలెక్టర్ల నుంచి ప్రభుత్వం ఫీడ్‌బ్యాక్ తీసుకుంటోందని, త్వరలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోనుందని జేసీ వెల్లడించారు. అనంతరం కలెక్టరేట్ వెలుపల వీరు మీడియాతో మాట్లాడారు. జేసీని కలిసిన వారిలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, జిల్లా పార్టీ అధ్యక్షుడు సీఆర్ రాజన్, ప్రధాన కార్యదర్శి కోదండయాదవ్, సురేంద్రకుమార్, రాజశేఖర్ ఉన్నారు.