పులివర్తి నానీపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు
ABN , Publish Date - May 17 , 2024 | 01:55 AM
చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానీపై హత్యాయత్నం కేసులో మొత్తం 13మందిని అరెస్టు చేశారు. నిందితులను కడప సెంట్రల్ జైలుకు తరలించారు.
తిరుపతి(నేరవిభాగం), మే 16: చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానీపై హత్యాయత్నం కేసులో మొత్తం 13మందిని అరెస్టు చేశారు. నిందితులను కడప సెంట్రల్ జైలుకు తరలించారు. తిరుపతిలోని పద్మావతి మహిళా వర్సిటీలో ఏర్పాటు చేసిన స్ర్టాంగ్ రూమ్‌ని మంగళవారం సాయంత్రం పరిశీలించి వస్తున్న నాని, అతని గన్‌మేన్ ధరణిపై వైసీపీ శ్రేణులు సమ్మెటలు, రాడ్లు, రాళ్లు, కర్రలు, బీరు బాటిళ్లతో దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నాని చేతికి బలమైన గాయమవగా, గన్‌మేన్ కంటిపై తీవ్ర రక్తగాయమైంది. ఈ ఘటనపై ఎస్వీయూనివర్సిటీ పోలీసులకు, ఎన్నికల కమిషన్‌కూ నానీ ఫిర్యాదు చేశారు. ఎన్నికల కమిషన్ దృష్టికి వెళ్లడంతో వర్సిటీ సీఐ మురళీమోహన్‌రావు నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, గాలింపు చర్యలు వేగవంతం చేశారు. సంఘటన జరిగిన రోజునే ఏడుగురిని రోజు అదుపులోకి తీసుకోగా, మిగిలిన ఆరుగురిని బుధవారం రాత్రి పట్టుకుని విచారించారు. గురువారం వీరిని అరెస్టు చూపారు. నిందితులపై హత్యాయత్నానికి పాల్పడినట్లు కేసు నమోదు చేశారు. కాగా, 13 మంది నిందితులను అరెస్టు చేయడంలో ప్రతిభ చూపిన తిరుపతి డీఎస్పీ సురేంద్ర రెడ్డి, సీసీఎస్ డీఎస్పీ రవికుమార్, ఎస్వీయూ సీఐ మురళీమోహన్‌రావు, ఎస్‌ఐ రామాంజనేయులు, అంజనప్ప, ఐడీ పార్టీ సిబ్బంది ఏఎ్‌సఐ దామోదర్, మోహన్‌బాబు, ఈశ్వర్, సిబ్బందిని ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ అభినందించి, రివార్డులు ప్రకటించారు.
నిందితుల వివరాలిలా..
ప్రధాన నిందితుల్లో రామచంద్రాపురం మండలం దిగువ రామాపురానికి చెందిన జడ్పీటీసీ భర్త వల్లేటి భానుకుమార్ రెడ్డి, నడవలూరు సర్పంచ్ గణపతి రెడ్డి ఉండగా, మిగిలిన వారిలో.. దిగువ రామాపురానికి చెందిన ముదిపల్లి జానకిరెడ్డి, జానయ్యగారి జయచంద్రా రెడ్డి, పొదలకూరు కోదండమ్, బొక్కిసం చిరంజీవి, దండు పుష్పకాంత్ రెడ్డి, అదే మండలం గడ్డక్రింద పల్లికి చెందిన ఎద్దల భాస్కరరెడ్డి, కామసాని సాంబశివా రెడ్డి, తిరుమల బాలాజీ నగర్‌కు చెందిన అప్పన్నగారి సుధాకరరెడ్డి, తిరుపతి రూరల్ మండలం శెట్టిపల్లిలో కాపురమున్న పి.హరికృష్ణ, తిరుమల బాలాజీనగర్‌కు చెందిన పసుపులేటి రాము, రేణిగుంట మండలం కరకంబాడికి చెందిన గోగుల కోటయ్య ఉన్నారు.