Share News

వైసీపీ ప్రచార సామగ్రి సీజ్‌ చేసేవరకూ కదిలేది లేదు

ABN , Publish Date - Mar 27 , 2024 | 01:18 AM

రేణిగుంట మండలంలో పాత విమానాశ్రయం వద్ద ఉన్న ప్రైవేటు గోదాముల్లో నిల్వ వుంచిన వైసీపీ ప్రచార సామగ్రిని సీజ్‌ చేసేవరకూ ఇక్కడి నుంచీ కదిలేది లేదంటూ చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానీ సంబంధిత గోదాముల వద్ద మంగళవారం అర్ధరాత్రి బైఠాయించారు.

వైసీపీ ప్రచార సామగ్రి సీజ్‌ చేసేవరకూ కదిలేది లేదు

తిరుపతి, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): రేణిగుంట మండలంలో పాత విమానాశ్రయం వద్ద ఉన్న ప్రైవేటు గోదాముల్లో నిల్వ వుంచిన వైసీపీ ప్రచార సామగ్రిని సీజ్‌ చేసేవరకూ ఇక్కడి నుంచీ కదిలేది లేదంటూ చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానీ సంబంధిత గోదాముల వద్ద మంగళవారం అర్ధరాత్రి బైఠాయించారు. మొత్తం మూడు గోదాములుండగా అధికారులు కేవలం ఒక గోదాము మాత్రమే తెరిచి సామగ్రి పరిశీలించారని, మిగిలిన రెండు గోదాములను తెరవలేదని ఆరోపించారు. తెరిచిన గోదాములో కూడా వస్తువులను సీజ్‌ చేయలేదని, పంచనామా చేయలేదని, గోదాముకు సీల్‌ కూడా వేయలేదని ఆరోపించారు. రేణిగుంట తహసిల్దారు నాగేశ్వరరావు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, గోదాముకు తాళం మాత్రం వేసుకుని వెళ్ళారని ఆరోపించారు. ఆ గోదాముకు వెనుక తలుపు తెరిచే వుందన్నారు. మొత్తం రూ. 30 కోట్ల విలువైన ఎన్నికల ప్రచార సామగ్రి గోదాముల్లో నిల్వ వుంచారని ఆరోపించారు. గోదాముల్లో వున్న సామగ్రిలో వాచీలు, స్పీకర్లు, చీరలు వంటి పలు వస్తువులు ఓటర్లను ప్రలోభపెట్టడానికి ఉద్దేశించినవేనన్నారు. ఎన్నికల సంఘం తక్షణం జోక్యం చేసుకోవాలని, గోదాముల్లోని వైసీపీ ప్రచార సామగ్రిని ఆ పార్టీ ఎన్నికల వ్యయం కింద, అలాగే చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి, చంద్రగిరి వైసీపీ అభ్యర్థి మోహిత్‌రెడ్డి ఎన్నికల వ్యయం కింద నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. వారిద్దరినీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. మంగళవారం మధ్యాహ్నం నుంచీ ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులెవరూ స్పందించలేదని, జిల్లా అధికారులు కూడా గోదాములను తనిఖీ చేయలేదని ఆరోపించారు. ఎన్నికల విధుల్లో బాధ్యతారహితంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్‌ చేశారు. కాగా మంగళవారం రాత్రి సుమారు 10.30 గంటలకు తహసిల్దారు గోదాముకు తాళం వేసుకుని వెళ్ళగా 11.15 గంటలకు అనుచరులు, పార్టీ నాయకులతో వచ్చి గోదాముల వద్ద నానీ బైఠాయించారు. గోదాములను సీజ్‌ చేసి, కేసు నమోదు చేసేవరకూ ఇక్కడ నుంచీ కదిలేది లేదని ఆయన స్పష్టం చేశారు.

Updated Date - Mar 27 , 2024 | 01:18 AM