Chandrababu Naidu: జగన్ ఏపీకి పట్టిన క్యాన్సర్ గడ్డ.. వైపీపీది పేదల రక్తం తాగే ప్రభుత్వం
ABN , Publish Date - Jan 18 , 2024 | 08:25 PM
కృష్ణా జిల్లా గుడివాడలో నిర్వహించిన ‘రా.. కదలిరా’ బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ ప్రభుత్వం చేసేదంతా పనికిమాలిన పనులని విమర్శించిన ఆయన.. జగన్ ఈ రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ అని ధ్వజమెత్తారు.
కృష్ణా జిల్లా గుడివాడలో నిర్వహించిన ‘రా.. కదలిరా’ బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ ప్రభుత్వం చేసేదంతా పనికిమాలిన పనులని విమర్శించిన ఆయన.. జగన్ ఈ రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ అని ధ్వజమెత్తారు. సినిమాల్లో విలన్ నాగభూషణం తరహాలో.. జగన్ తడి గుడ్డలతో గొంతుకోస్తాడని ఆరోపించారు. బాబాయిని చంపేయడంతో పాటు తన చెల్లెలిపై కేసులు పెట్టించిన ఘనత జగన్‌ది అని తూర్పారపట్టారు. తన ఇంటి ఆడబిడ్డకు ఆస్తిలో హక్కు కల్పించడం లేదని, విశ్వసనీయత అంటే ఇదేనా? అని ప్రశ్నించారు. నిన్నటి వరకు జగనన్న బాణమైన ఆమె.. ఇప్పుడేమైందని నిలదీశారు.
మద్యపానాన్ని నిషేధం చేస్తానంటూనే.. మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టాడని జగన్‌పై చంద్రబాబు ఫైర్ అయ్యారు. మద్య నిషేధం చేయకుంటే ఓట్లు అడనని జగన్ అన్నాడని, ఇప్పుడు అతనికి ఓట్లు అడిగే హక్కుందా? అని అడిగారు. మెగా డీఎస్సీ, జాబ్ క్యాలెండర్‌లు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం చేసిన ప్రతి ఒక్కటీ అరాచకమేనని మండిపడ్డారు. చెత్త మీద పన్ను వేసిన చెత్త సీఎం జగన్ అని, రూ.10 ఇచ్చి రూ.100 దోచుకుంటున్నాడని వ్యాఖ్యానించారు. పన్నులు, ధరల పెంపు వల్ల ప్రతి పేద కుటుంబంపై నాలుగైదు లక్షల భారం వేశారన్నారు. వైసీపీ ప్రభుత్వం.. పేదల రక్తం తాగే ప్రభుత్వమని నిప్పులు చెరిగారు. పోలవరం ఆగిపోయిందని, రాజధానిని కూడా ఆపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లు వేయమంటే.. నిన్నెవరు బస్సులో వెళ్లమన్నారని ప్రశ్నిస్తారా? అని వైసీపీ ప్రభుత్వాన్ని కడిగిపారేశారు. పరదాలు కట్టుకుని తిరిగే పరిస్థితికి జగన్ వచ్చారన్నారు. ఐదేళ్లల్లో జగన్ ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టలేదన్నారు. మనమంతా పండుగకి పల్లెకు వెళ్తే.. జగన్ మాత్రం తన ఇంటి వద్దే గుడిని, ప్యాలెస్‌లోనే పల్లెను కట్టేశారన్నారు. తాము అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఫాలో అవుతామని, రాజారెడ్డి రాజ్యాంగానికి భయపడమని తేల్చి చెప్పారు.
ఎవరైనా అడ్డం వస్తే తొక్కుకుంటూ వెళ్లే పార్టీ టీడీపీ అని.. సమాజాన్ని జాగృతం చేసే నాయకులు కృష్ణా జిల్లాలో పుట్టారని చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్టీఆర్ రాజకీయ ప్రస్ధానం కృష్ణా జిల్లా నుంచే ప్రారంభమైందన్నారు. గుడివాడ తులసీవనంలో గంజాయి మొక్కలు పుడుతున్నాయని, టీడీపీ ఎవ్వరికీ భయపడదని అన్నారు. తాము ఎవ్వరినీ వదిలిపెట్టమని, ప్రతి దానికీ వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. బూతు శ్రీకి ఎమ్మెల్యే, బూతు రత్నకు ఎంపీ, బూతు సామ్రాట్టుకు మంత్రి పదవి.. ఇదీ జగన్ చేసే రాజకీయమని విరుచుకుపడ్డారు. ఐదేళ్లల్లో సీఎం రెండుసార్లు మాత్రమే కలిశారని, అసలు పెత్తందారు జగన్ అని విమర్శించారు. భూరక్ష చట్టం పేరుతో భూ భక్షణ చేస్తారని.. రేపు భూముల దొంగల పడతారని అన్నారు. తాము అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. బీసీలను ఆదుకుంటామని, బీసీ సబ్ ప్లాన్ అమలు చేస్తామని మాటిచ్చారు. బీసీలే టీడీపీకి వెన్నెముక అని చెప్పుకొచ్చారు. పేదల అభ్యున్నతే ఎన్టీఆర్ లక్ష్యమని.. తాము సంపదని సృష్టించి, పేదరిక నిర్మూలన చేపడతామన్నారు. పేదలకి రూ.10 ఇచ్చి రూ.100 దోచేయడం జగన్ నైజమైతే.. సంపదని పెంచడం టీడీపీ సత్తా అని తెలిపారు.
జగన్ పని అయిపోయిందని.. సర్వేలన్నీ వైసీపీ ఓడిపోతుందనే చెబుతున్నాయని.. సర్వే ఫలితాలు చూసి వైసీపీ నేతల ప్యాంట్లు తడుస్తున్నాయని చంద్రబాబు ఉద్ఘాటించారు. ఎన్ని స్థానాల్లో అభ్యర్థుల్ని మార్చినా.. జగన్ గెలిచేది లేదని ధీమా వ్యక్తం చేశారు. ‘వైనాట్ పులివెందుల’ అని నినదించిన చంద్రబాబు.. పులివెందుల వాసులు జగన్‌కు ఎందుకు ఓటేయాలి? బాబాయిని చంపినందుకు? అని ప్రశ్నించారు. జగన్ కౌంట్‌డౌన్ ప్రారంభమైందని.. ఇంకా మిగిలింది 83 రోజులేనని హెచ్చరించారు. టీడీపీ కట్టిన టిడ్కో ఇళ్లకు వైసీపీ రంగులేసినంత మాత్రానా.. వాళ్లు కట్టించినట్టు అవదని అన్నారు. ఇళ్లకు కాదు, మీ ముఖాలకు రంగులేసుకోండని వైసీపీ నేతలపై ధ్వజమెత్తారు. వైసీపీని భూస్థాపితం చేయడం టీడీపీ లక్ష్యమన్నారు. తన దగ్గరే ఓనమాలు నేర్చుకున్న కొడాలి నాని తననే విమర్శిస్తున్నాడని.. తానేంటో చూపిస్తానని చంద్రబాబు ఛాలెంజ్ చేశారు. గుడివాడకు ప్రధాన సమస్య కొడాలి నాని చెప్పిన చంద్రబాబు.. పిచ్చ పిచ్చ ఆటలొద్దు అని వార్నింగ్ ఇచ్చారు. రాము-రావి ఇద్దరూ కలిసి కొడాలి నానిని ఓడిస్తారని.. నానిని చరిత్రహీనులుగా కాలగర్భంలో కలిపేసేలా ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు.
గుడివాడలో బూతుల మంత్రి ఉంటే, బందరులో నీతుల మంత్రి ఉన్నారని.. పవన్‌ని తిట్టనిదే ఆ నీతుల మంత్రికి రోజు గడవదని చంద్రబాబు విసుర్లు విసిరారు. జగన్ను మించిన అక్రమార్జన చేయాలనేదే బందరు నాని లక్ష్యమన్నారు. తన పనైపోయిందని భావించే.. పేర్ని నాని తన సుపుత్రుడిని రంగంలోకి దింపారన్నారు. జోగి రమేష్ పెడనలో చెత్త అని, ఇప్పుడు ఆ చెత్తను పెనమలూరుకు వేశారని సెటైర్లు వేశారు. గన్నవరం ఎమ్మెల్యే పేరు చెప్పనని.. అతను తన స్థాయి కాదని తేల్చి చెప్పారు. గన్నవరం ఎమ్మెల్యే గంజాయి మొక్కని తనకు తెలియదని, తానే అతడ్ని పెంచి పోషించానని అన్నారు. కైలే అనిల్ అభివృద్ధి చేసింది సున్నా అయితే.. అవినీతి మాత్రం మిన్న అని ఆరోపించారు. ప్రస్తుతం ఏపీ మొత్తం టీడీపీ, జనసేన గాలి వీస్తోందని.. ఇది సునామీలా మారడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మరో 83 రోజులే ఉందని, అందరూ అప్రమత్తగా ఉండాలని సూచించారు. ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా.. నిర్లక్ష్యంతో వ్యవహరిస్తే పెద్ద తప్పిదం జరుగుతుంద్నారు. టీడీపీ, జనసేన పార్టీల అవసరం ఉందని ప్రజలను చైతన్యపరచాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.