Share News

Budameru: కాస్త శాంతించిన బుడమేరు.. 48 గంటలుగా వరద నీటిలోనే ప్రజానీకం..

ABN , Publish Date - Sep 03 , 2024 | 07:41 AM

ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ పరిధిలోని జి. కొండూరు మండలంలోని బుడమేరు కాస్త శాంతించింది. నిన్నటి వరకూ మహోగ్రరూపం చూపించిన బుడమేరుకు ఇవాళ వరద ఉధృతి కాస్త తగ్గింది. బుడమేరు డిజైన్ కెపాసిటీ 15 వేల క్యూసెక్కులకు మించి వరద నీరు వచ్చి చేరింది.

Budameru: కాస్త శాంతించిన బుడమేరు.. 48 గంటలుగా వరద నీటిలోనే ప్రజానీకం..

అమరావతి: ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ పరిధిలోని జి. కొండూరు మండలంలోని బుడమేరు కాస్త శాంతించింది. నిన్నటి వరకూ మహోగ్రరూపం చూపించిన బుడమేరుకు ఇవాళ వరద ఉధృతి కాస్త తగ్గింది. బుడమేరు డిజైన్ కెపాసిటీ 15 వేల క్యూసెక్కులకు మించి వరద నీరు వచ్చి చేరింది. కుంభవృష్టి నమోదు కావడంతో బుడమేరు మహాగ్రరూపం దాల్చింది. ఫలితంగా విజయవాడలోని 16 డివిజన్లను వరద ముంచెత్తింది. 48 గంటలుగా సుమారు 2 .59 లక్షల మంది ప్రజానీకం వరద నీటిలోనే ఉండిపోయింది. చివరి వరకూ వారికి ప్రభుత్వ సహాయక చర్యలు అందలేదు. సీఎం చంద్రబాబు స్వయంగా మకాం వేసినా కూడా చివరి వరకు సహాయం చేరలేదు. బుడమేరులో ప్రస్తుతం, 6 వేల క్యూసెక్కులు మాత్రమే వరద ప్రవాహం ఉంది. ఇది మరింత తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు.


బుడమేరు వరదలో తాజాగా మహిళ గల్లంతైన విషయం తెలిసిందే. ఆదివారం సాయంత్రం బుడమేరు వరదలో జి.కొండూరు నుంచి హెచ్.ముత్యాలంపాడు గ్రామానికి ట్రాక్టర్‌పై వెళ్లేందుకు గ్రామస్తులు ప్రయత్నించగా ఈ ఘటన చోటు చేసుకుంది. బుడమేరుకు పెద్ద ఎత్తున వరద వచ్చి చేరింది. వరద ధాటికి ట్రాక్టర్ కొట్టుకుపోయింది. ప్రమాద సమయంలో ట్రాక్టర్ పై 10 మంది గ్రామస్థులు ఉండగా.. వారిలో 9 మందిని స్థానికులు రక్షించారు. గొర్రె శివపార్వతి (35) అనే మహిళ మాత్రం గల్లంతైంది. వరద ప్రభావంతో పరిసర గ్రామ ప్రజలంతా తీవ్ర ఆందోళన చెందారు. ఇవాళ బుడమేరు కాస్త శాంతించడంతో గ్రామస్తులంతా ఊపిరి పీల్చుకున్నారు. బుడమేరు వరద ధాటికి వందల ఎకరాల్లో పత్తి, వరి పొలాలు నీట మునిగాయి. బుడమేరుతో పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్షించారు.

Updated Date - Sep 03 , 2024 | 07:41 AM