Share News

YSRCP: మూడ్రోజులుగా ముభావమే..! వైసీపీ ఎమ్మెల్యేల ముఖాల్లో కనిపించని కళాకాంతులు!!

ABN , Publish Date - Feb 08 , 2024 | 03:04 AM

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు గురువారంతో ముగియనున్నాయి. ఈ నెలాఖరులోగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ వచ్చే అవకాశం ఉన్నందున.. ప్రస్తుత అసెంబ్లీకి ఇవే చిట్టచివరి సమావేశాలు. రాజ్యసభ ద్వైవార్ష ఎన్నికలకు ఈ నెల 27వ తేదీన పోలింగ్‌ అనివార్యమైతేనే ఎమ్మెల్యేలు ఇక

YSRCP: మూడ్రోజులుగా ముభావమే..! వైసీపీ ఎమ్మెల్యేల ముఖాల్లో కనిపించని కళాకాంతులు!!

వైసీపీ ఎమ్మెల్యేల ముఖాల్లో కనిపించని కళాకాంతులు!!

81 మంది మాత్రమే సభకు హాజరు

టికెట్లు దక్కని వారు లాబీలకే పరిమితం

ఎవరు కలిసినా సీట్ల గురించే చర్చ

ఓటాన్‌ అకౌంట్‌పై పేలవంగా స్పందన

సీఎం ముఖంలోనూ కనిపించని నవ్వు

అసెంబ్లీ సమావేశాలు నేటితో ఆఖరు!

సభ్యులతో కలసి స్పీకర్‌ ఫొటో సెషన్‌

హాజరు కాబోమంటున్న టీడీపీ ఎమ్మెల్యేలు

రాజ్యసభ ఎన్నికలకే మళ్లీ అందరూ వచ్చేది?

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు గురువారంతో ముగియనున్నాయి. ఈ నెలాఖరులోగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ వచ్చే అవకాశం ఉన్నందున.. ప్రస్తుత అసెంబ్లీకి ఇవే చిట్టచివరి సమావేశాలు. రాజ్యసభ ద్వైవార్ష ఎన్నికలకు ఈ నెల 27వ తేదీన పోలింగ్‌ అనివార్యమైతేనే ఎమ్మెల్యేలు ఇక అసెంబ్లీ ముఖం చూసేది. ఇప్పటికే వారిలో చాలా మంది అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. గత మూడ్రోజులుగా సభకు వస్తున్నా ముభావంగానే ఉన్నారు. అత్యధికుల ముఖాల్లో కళ తప్పింది. సర్వేల సాకుతో పలువురు సిటింగ్‌లకు సీఎం జగన్‌ మొండిచేయి చూపుతుండడంతో వారిలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. మొక్కుబడిగా మాత్రమే హాజరవుతున్నారు. విపక్ష టీడీపీ విరుచుకుపడుతున్నా.. ఒకరిద్దరు మినహా ఎవరూ స్పందించడం లేదు. ఓటాన్‌ అకౌంట్‌పై కూడా పెద్దగా మాట్లాడలేదు. గురువారం ద్రవ్య వినిమయ బిల్లు, బడ్జెట్‌ ఆమోదం తర్వాత అసెంబ్లీ ఉభయసభలూ వాయిదాపడతాయి. చివరి రోజున సభ్యులకు వీడ్కోలు పలుకుతూ.. సభానాయకుడు, ప్రతిపక్ష నాయకుడి సమక్షంలో సభాపతి వారితో కలిసి ఫొటో దిగడం ఆనవాయితీ. అయితే స్పీకర్‌ తమ్మినేని సీతారాం తమ పట్ల వివక్ష చూపుతున్నందున ఆయనతో కలసి ఫోటో సెషన్‌లో పాలుపంచుకోబోమని టీడీపీ సభ్యులు చెబుతున్నారు. ఇక అధికారపక్షంలోనూ పలువురు హాజరు కాకపోడంతో.. వీడ్కోలు ఫొటో పలుచగా ఉండనుంది. ఐదో తేదీన బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కాగా.. శాసనసభకు అధికారపక్షానికి చెందిన 81 మంది ఎమ్మెల్యేలు మాత్రమే వచ్చారు. టీడీపీ తరఫున 14 మంది ఎమ్మెల్యేలు హాజరవుతుండగా.. వారిని కూడా ఏరోజుకారోజు సభ నుంచి సస్పెండ్‌ చేస్తున్నారు. మొత్తంగా 175 మంది ఉండాల్సిన సభలో.. 95 మంది మాత్రమే ఉంటుండడం.. వారిలోనూ కొందరు బయటకు వెళ్లిపోతుండడం.. సస్పెన్షన్లతో సభ వెలవెలబోతోంది.

ఉత్సాహం మాయం..

గత అసెంబ్లీ సమావేశాల్లో ఎక్కడా లేని దూకుడు ప్రదర్శించిన వైసీపీ సభ్యులు ఈసారి పూర్తిగా రివర్స్‌ అయ్యారు. తొలిరోజున గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగ సమయంలో గానీ.. ఆయన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో గానీ, సీఎం సమాధానమిచ్చే సమయంలో గానీ.. బుధవారం ఆర్థిక మంత్రి బుగ్గన బడ్జెట్‌ ప్రసంగం చేసేటప్పుడు గానీ.. అధికారపక్ష సభ్యుల నుంచి ఎలాంటి స్పందనా కనిపించలేదు. ఎవరిలోనూ మునుపటి దూకుడు, ఉత్సాహం లేవు. ముఖ్యంగా టికెట్లు రాని వారిలో నిరాశానిస్పృహలు స్పష్టంగా కనిపించగా.. టికెట్లు రానివారు అసెంబ్లీ లాబీల్లో దిగాలుగా కూర్చున్నారు. నలుగైదుగురు ఒకచోటకు చేరి.. తమకు టికెట్లు వస్తాయో రావోనన్న నిర్వేదంతో భావి కార్యాచరణపై చర్చించుకోవడం కనిపించింది. అలాగే సీఎం కూడా తెచ్చిపెట్టుకున్న నవ్వుతోనే కనిపిస్తున్నారు. ధన్యవాద తీర్మానానికి జవాబిచ్చే సమయంలోనూ, బడ్జెట్‌ చదివేటప్పుడు బల్లలు చరిచేటప్పుడూ సీరియ్‌సగానే కనిపించారు. కాగా.. గురువారం అసెంబ్లీ నిరవధికంగా వాయిదాపడుతుంది. 27న రాజ్యసభ ఎన్నిలకు పోలింగ్‌ నిర్వహించాల్సి వస్తే.. ఓటు వేయడానికి మాత్రమే ఎమ్మెల్యేలు రావలసి ఉంటుంది. ఏకగ్రీవమైతే ఇక ఇప్పట్లో వెలగపూడి అసెంబ్లీవైపు కన్నెత్తి చూడాల్సిన అవసరమే ఉండదు.

Updated Date - Feb 08 , 2024 | 07:33 AM