ఇనచార్జా.. మజాకా..!
ABN , Publish Date - Mar 01 , 2024 | 12:36 AM
పట్టణంలో ఎక్కడైనా మట్టి అడ్డంగా ఉందనీ, తొలగించాలని మున్సిపల్ అధికారులకు స్థానికులు విన్నవించుకున్నా పనులు చేసేందుకు నెలలు పడుతుంది. రోడ్డులో గుంత పూడ్చాలని వేడుకున్నా యంత్రాంగం కనికరించదు. అలాంటిది అధికార పార్టీ నాయకుల సొంత స్థలాల్లో మాత్రం ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు వాలిపోయి, అధికారులు పనులు చక్కదిద్దుతున్నారు.
సొంత లేఔట్‌లో మున్సిపల్ యంత్రాలు
ప్రారంభోత్సవ పనులకు కార్మికులు సైతం..
వాహనాలు వెళ్లేందుకు రోడ్డు చదును..
కార్యాలయానికి పిలిపించి.. అధికారికి ఆదేశాలు
తెల్లారకనే లేఔట్‌లో పనులు ప్రారంభం
హిందూపురం, ఫిబ్రవరి 29: పట్టణంలో ఎక్కడైనా మట్టి అడ్డంగా ఉందనీ, తొలగించాలని మున్సిపల్ అధికారులకు స్థానికులు విన్నవించుకున్నా పనులు చేసేందుకు నెలలు పడుతుంది. రోడ్డులో గుంత పూడ్చాలని వేడుకున్నా యంత్రాంగం కనికరించదు. అలాంటిది అధికార పార్టీ నాయకుల సొంత స్థలాల్లో మాత్రం ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు వాలిపోయి, అధికారులు పనులు చక్కదిద్దుతున్నారు. హిందూపురం పట్టణ సమీపాన పూలకుంట పంచాయతీ పరిధిలో వైసీపీ సమన్వయకర్త భర్తతోపాటు నియోజకవర్గంలో అన్నీ తానై చూసే మరో ముఖ్యనేత కలిసి లేఔట్ వేశారు. ప్రారంభోత్సవం గురువారం నిర్వహించారు. దీంతో లేఔట్ వద్ద చదును చేయాల్సి వచ్చింది. అధికారం ఉంది కదా అని బుధవారం సాయంత్రం మున్సిపాలిటీకి చెందిన ముఖ్య అధికారిని పిలిపించుకొని ఎక్స్‌కవేటర్, డౌజర్ యంత్రాలను పంపాలని ఆదేశించారు. తనకు ఇబ్బంది లేకుండా వాహనాలను తీసుకెళ్లాలనీ, తేడా వస్తే మీరే చూసుకోవాలంటూ చెప్పినట్లు సమాచారం. అవన్నీ తెలీదనీ, పంపాల్సిందేనంటూ వైసీపీ నేత హుకుం జారీ చేసినట్లు తెలిసింది. ఆయన వెంట ఉన్న మరో అధికారి అత్యుత్సాహం చూపి పంపిద్దాం లే అంటూ ముఖ్య అధికారికి సలహా ఇచ్చాడు. దాంతో అప్పటికప్పుడే ఆపరేటర్లకు ఫోన చేసి, తెల్లారకనే లేఔట్‌లోకి వెళ్లాలని ఆదేశాలిచ్చారు. ఆ మేరకు గురువారం తెల్లవారుజామున అక్కడికి రెండు వాహనాలు వెళ్లి సాయంత్రం 3 గంటల వరకు పనులు చేశాయి. నిబంధనలకు విరుద్ధంగా సదరు లేఔట్‌లోకి చెరువు మట్టిని ఎక్స్‌కవేటర్ సాయంతో తరలించారు. పులమతి రోడ్డు ఇరుగ్గా ఉండటంతో గంగమ్మ గుడి వద్ద నుంచి లేఔట్ వరకు రోడ్డుకిరువైపులా మట్టి వేసి చదును చేశారు. లేఔట్ ప్రారంభోత్సవానికి వెళ్లే వారి కోసం మట్టిరోడ్డును వెడల్పు చేశారు. అంతేనా.. మున్సిపాలిటీలో పనులు చేపట్టే కాంట్రాక్టర్లు కొన్ని ట్రాక్టర్లను ఉచితంగా పంపినట్లు తెలిసింది. ప్రారంభోత్సవ పనుల్లో మున్సిపల్ కార్మికులను కూడా వినియోగించినట్లు సమాచారం. దీనిపై మున్సిపల్ కమిషనర్ శ్రీకాంతరెడ్డిని వివరణ కోరగా.. విషయం తనకు తెలీదనీ, ఆధారాలిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పడం మరో విశేషం. వారు చేపట్టిన పనులకు సంబంధించి మున్సిపల్ కమిషనర్ ఉండే వాట్సాప్ గ్రూపుల్లోనే సదరు ఫొటోలు వచ్చినా ముఖ్యనేతల వద్ద వాహనాలు పంపడానికి ఆంగీకరించిన ఆయన ఆధారాలు చూపితే చర్యలు తీసుకుంటామని చెప్పడం గమనార్హం. లేఔట్ ప్రారంభోత్సవానికి వెళ్లిన అధికార పార్టీ నాయకులే అక్కడ పనుల్లో ఉపయోగిస్తున్న మున్సిపల్ యంత్రాలను చూసి నివ్వెరపోయారు. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి.