Share News

వైసీపీవన్నీ అబద్ధాలే: సీపీఐ

ABN , Publish Date - Jan 29 , 2024 | 12:13 AM

ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మొదలుకుని వైసీపీ నాయకులందరూ అబద్ధాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జగదీశ పేర్కొన్నారు.

 వైసీపీవన్నీ అబద్ధాలే: సీపీఐ

గుంతకల్లు, జనవరి 28: ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మొదలుకుని వైసీపీ నాయకులందరూ అబద్ధాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జగదీశ పేర్కొన్నారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో ఆదివారం ఉదయం ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. జగదీశ మాట్లాడుతూ రాగులపాడు వద్ద హంద్రీనీవా నుంచి కాలవను ఏర్పాటు చేయడానికి రూ. 42 కోట్లతో ప్రాజెక్టుకు రూపకల్పన చేసి నిధులను విడుదల చేశానని చెప్పిన సీఎం టెండర్లను కూడా పిలిచి డబ్బివ్వలేదన్నారు. తాజాగా రూ. 20 కోట్లు మంజూరు చేస్తానంటూ ఉరవకొండ సభలో అబద్ధాలు చెప్పాడన్నారు. అలాగే గత జూలై 8న వైఎస్‌ రాజశేఖర రెడ్డి జయంతికి కళ్యాణదుర్గంలో బీటీ ప్రాజెక్టుకింద భూములు కోల్పోయిన రైతులకు పరిహారాల చెల్లింపునకు రూ.208 కోట్లు జమచేస్తున్నట్లు చెప్పాడన్నారు. కానీ ఇంతవరకూ ఆ డబ్బు వచ్చింది లేదన్నారు. గుంతకల్లు నాయకులు కూడా జగనకు తీసిపోలేదన్నారు. పట్టణంలోని ధర్మవరం గేటు వద్ద రోడ్‌ అండర్‌ బ్రిడ్జి (ఆర్‌యూబీ)కి రైల్వే టెండరు పిలవడం తమ గొప్పేనంటూ ప్రచారాలను ఊదరగొట్టారన్నారు. దేశంలోని లెవెల్‌ క్రాసింగ్‌లను తొలగించే ప్రక్రియను రైల్వే శాఖ చేపట్టిందన్నారు. అందులో భాగంగానే గుంతకల్లులోని డీఎంఎం గేటు వద్ద ఆర్‌యూబీకి నిధులు వచ్చాయన్నారు. ధర్మవరం గేటు వద్ద ఆర్‌యూబీ తగిన ఎత్తులేదని కేవలం 3 మీటర్లు మాత్రమే ఉందన్నారు. దాని వల్ల భారీ వాహనాలు వెళ్లే అవకాశాలుండ వన్నారు. ఇక్కడ ఆర్‌యూబీ నిర్మిస్తే స్థానిక ప్రజలకు ఇబ్బంది కలుగుతుందన్నారు. వైసీపీ నాయకులకు చేతనైతే అక్కడ ఫ్లై ఓవర్‌ను నిర్మించాలన్నారు. అలాగే కసాపురం రోడ్డులో సమస్యగా ఉన్న వంతెన వద్ద ఆర్‌ఓబీని నిర్మించి గొప్పలు చెప్పుకోవాలని ఎద్దేవాచేశారు. సమావేశంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బీ గోవిందు, నియోజకవర్గ కార్యదర్శి వీరభద్రస్వామి, నాయకులు మహమ్మద్‌ గౌస్‌, రాము పాల్గొన్నారు.

Updated Date - Jan 29 , 2024 | 12:13 AM