Share News

ధరల చింత

ABN , Publish Date - Mar 14 , 2024 | 11:37 PM

హిందూపురం వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌లో చింతపండు ధర కొంత తగ్గింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి ఆశించిన మేర ధరలు పలుకుతూ వచ్చాయి.

ధరల చింత

తగ్గిన చింతపండు ధర

ఫ క్వింటానికి రూ.2 వేలు పడిపోయిన వైనం

ఫ ఆందోళన చెందుతున్న రైతుల

హిందూపురం, మార్చి 14: హిందూపురం వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌లో చింతపండు ధర కొంత తగ్గింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి ఆశించిన మేర ధరలు పలుకుతూ వచ్చాయి. మార్చిలో ధర మరింత పెరగాల్సి ఉండేది. అలాంటిది మార్చి రెండోవారంలోనే క్వింటాపై రూ. 1500 నుంచి రూ. 2వేలదాకా ధరలు తగ్గడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. హిందూపురం వ్యవసాయ మార్కెట్‌యార్డ్‌కు జిల్లా నుంచే కాక కర్ణాటక నుంచి పెద్దఎత్తున చింతపండు వస్తోంది. ఇక్కడికి కర్పూలీ రకం ఎక్కువగా వస్తుంది. గురువారం మార్కెట్‌లో కర్పూలీ క్వింటా గరిష్ఠంగా రూ.30వేలు పలికింది. హిందూపురం వ్యవసాయ మార్కెట్‌యార్డ్‌కు కర్పులీ, ఫ్లవర్‌, బోటురకం చింతపండు వస్తుంది. గురువారం మార్కెట్‌కు వచ్చిన మేలురకం కర్పూలీ క్వింటా రూ.30వేలు పలకగా రెండోరకం రూ.20వేలు, మూడో రకం 18వేలు పలికింది. ఫ్లవర్‌ క్వింటా రూ.16వేలు, రెండో రకం రూ.14వేలు, మూడో రకం రూ.10వేలు పలికింది. బోటురకం క్వింటా మొదటి రకం రూ.10వేలు, రెండో రకం రూ.5వేలు, మూడో రకం రూ.2600దాకా పలికినట్లు మార్కెట్‌వర్గాలు పేర్కొంటున్నాయి. గతంతో పోల్చుకుంటే కర్పూలీ క్వింటాల్‌పై రూ.2వేలు తగ్గిందని పేర్కొంటున్నారు.

బయట వ్యాపారులు రాలేదంటూ...

సాధారణంగా హిందూపురం వ్యవసాయ మార్కెట్‌యార్డ్‌కు మార్చినెలలో బయటి నుంచి వ్యాపారులు వస్తారు. ఎందుకంటే మార్చి నుంచి ఏప్రిల్‌ 15లోపు చింతపండు నాణ్యతగా ఉంటుంది. ఈ సమయంలోనే ఎక్కువగా ఏసీలో నిల్వ ఉంచుతారు. అందుకోసం బయటి నుంచి వ్యాపారులు ఇక్కడికి చేరుకుని కొనుగోలు చేస్తారు. ఇందులో కొందరు స్థానికంగాను, మరికొంతమంది కర్నూలు, చిత్తూరు, తమిళనాడు ప్రాంతాల్లో నిల్వ చేసుకుంటుంటారు. అయితే ఈసారి ఎందుకో మార్చి రెండోవారంలో కూడా బయటి నుంచి వ్యాపారులు రాలేదు. దీనిని సాకుగా తీసుకుని స్థానిక వ్యాపారులు ధరలు తగ్గించినట్లు తెలుస్తోంది.

ఈ ఏడాది ఆలస్యంగా మార్కెట్‌ ప్రారంభం

ప్రతియేడాది జనవరి మాసంలో సంక్రాంతి పండగకే కొత్త చింతపండు మార్కెట్‌కు రావడంతో అదేరోజు మార్కెట్‌ ప్రారంబిస్తారు. ఈసారి జనవరి 20పైన మార్కెట్‌ ప్రారంభించారు. అయినా మార్చి మాసంలో ధరలు తగ్గడం వెనుక కారణాలు ఏంటని రైతులు ఆలోచనలో పడ్డారు. సాధారణంగా రైతులు జనవరి, ఫిబ్రవరి మాసంలో మార్కెట్‌కు పండు తీసుకొచ్చేందుకు సిద్ధమైనా మార్చి మాసంలో అమ్ముకుంటే మంచి ధర వస్తుందని భావిస్తుంటారు. గత ఏడాదికూడా చింతపండు ధరలు అంతంతమాత్రంగానే ఉన్నా యి. అయితే సీజన లో కాకుండా కొంతమంది వ్యాపారులు, రైతులు, ఏసీ గోదాములో నిల్వ ఉంచుకున్న సరుకుకు జూలై, సెప్టెంబరు నెలల్లో అధిక దరలకు అమ్ముకున్నారు.

కూలి కూడా గిట్టదు

ప్రస్తుతం చింత చెట్టు నుంచి కాయ దులపాలంటే ఒక కూలీకి రూ.వెయ్యి ఇవ్వాలి. చింతకాయలు ఏరేందుకు రూ.400లు మహిళా కూలీకి ఇవ్వాలి. దులిపిన చింతకాయను పొట్టు ఊడదీసి కట్టికాయ చేసేందుకు కూలీకి రూ.600 ఇవ్వాలి. ఇక కట్టికాయని కర్పూలీ రకం చేసేందుకు కిలోకు రూ.25ఇవ్వాలి. ఇలా కూలీలను లెక్కిస్తే రైతుకుగాని, చింతమాను కొనుగోలుచేసిన వ్యాపారికి గాని మిగిలే పరిస్థితి లేదు. దీనికితోడు గత ఏడాది జూలై నుంచి డిసెంబరులోపు వర్షాలు పడకపోవడంతో దిగుబడి కూడా తగ్గుతూ వచ్చింది. మామూలుగా కొన్ని చింతచెట్ల నుంచి పది కేజీల కట్టికాయ కొడితే 6 నుంచి 7కేజీల కర్పూలీ రావాలి. ఈసారి 5కేజీల నుంచి 5.50కేజీలకు పడిపోయింది. ఈ లెక్కన పది కేజీల కట్టికాయకు రూ.250నుంచి రూ.350దాకా నష్టం వస్తోంది. ఇక మార్కెట్‌కు తీసుకొచ్చిన కూలీలు, కమిషనలు లెక్కిస్తే పెద్దగా లాభం వచ్చేదిలేద రైతులు అంటున్నారు.

Updated Date - Mar 14 , 2024 | 11:37 PM