Share News

ధర్మవరంలో రౌడీయిజం లేకుండా చేస్తా

ABN , Publish Date - Jan 07 , 2024 | 12:33 AM

ధర్మవరం, జనవరి 6: టీడీపీ అధికారంలోకి రాగానే ధర్మవరం నియోజకవర్గంలో రౌడీయిజం లేకుండా చేయడానికి కృషి చేస్తానని ఆ పార్టీ నియోజకవర్గ ఇనచార్జి పరిటాలశ్రీరామ్‌ అన్నారు.

 ధర్మవరంలో రౌడీయిజం లేకుండా చేస్తా

-ఎమ్మెల్యే కేతిరెడ్డి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు

- పాదయాత్రలో టీడీపీ నియోజకవర్గ ఇనచార్జి పరిటాల శ్రీరామ్‌

ధర్మవరం, జనవరి 6: టీడీపీ అధికారంలోకి రాగానే ధర్మవరం నియోజకవర్గంలో రౌడీయిజం లేకుండా చేయడానికి కృషి చేస్తానని ఆ పార్టీ నియోజకవర్గ ఇనచార్జి పరిటాలశ్రీరామ్‌ అన్నారు. ప్రజాచైతన్య పాదయాత్రలో భాగంగా శనివారం మూడో రోజు ఆయన పట్టణంలోని పలు కాలనీల్లో పర్యటించారు. 32వ వార్డు పరిధిలోని సత్యసాయినగర్‌లో ఉన్న అన్నపూర్ణేశ్వరి ఆలయం నుంచి ప్రారంభమైన పాదయాత్ర గిర్రాజుకాలనీ, దుర్గానగర్‌, సుందరయ్యనగర్‌, ప్రియాంకనగర్‌, లక్ష్మీచెన్నకేశవపురం మీదుగా ఇందిరమ్మకాలనీ వరకు సాగింది. ఇందులో ప్రజలు అనేక సమస్యల్ని శ్రీరామ్‌ దృష్టికి తెచ్చారు. ముఖ్యంగా పింఛనలు, రేషనకార్డులు అందలేదని , డ్రైనేజీ సమస్యతో ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. మరో వైపు స్వయం సహాయక సంఘాల ప్రతినిధులకు సంబంధించిన దాదాపు నాలుగు కోట్ల రూపాయలను పక్కదారి పట్టించినట్టు కొందరు ఆయన దృష్టికి తెచ్చారు. దీనిపై విచారణ జరిపి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు శ్రీరామ్‌ స్పందిస్తూ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేకంగా కమిషన వేసి విచారణ చేయిస్తానని హామీ ఇచ్చారు. టైలరింగ్‌ వృత్తిపై ఆధారపడి పట్టణంలో దాదాపు 2వేల మంది మహిళలు జీవిస్తున్నారని, ఇటీవల రెడీమేడ్‌ షోరూంలు పెరిగిపోవడం వల్ల తమకు ఉపాధిలేకుండా పోయిందని దుర్గానగర్‌కు చెందిన మహిళలు వాపోయారు. తమకు గార్మెంట్స్‌ పరిశ్రమలు లాంటివి తీసుకురావాలని విజ్ఞప్తిచేశారు. అధికారంలోకి రాగానే గార్మెంట్స్‌ పరిశ్రమ స్థాపన కోసం కృషిచేస్తానని శ్రీరామ్‌ తెలిపారు. అనంతరం ఆయన స్థానిక పరిస్థితులపై మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కేతిరెడ్డి గుడ్‌మార్నింగ్‌ ద్వారా ఏం సమస్యలు పరిష్కరించారని ప్రశ్నించారు. పైగా నేను పాదయాత్ర చేస్తుంటే నా వద్దకు రాకుండా ప్రజల్ని బెదిరింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. శ్రీరామ్‌ వద్దకు వెళ్తే మీకు సంక్షేమపథకాలు అందవని వైసీపీ నాయకులు బెదిరిస్తున్నారన్నారు. మరోవైపు తాను ముందు వెళ్తుంటే వెనుక వైపు నుంచి కొందరు శ్రీరామ్‌కు ఓటు వేయకపోతే చంపేస్తామని, మాది వెంకటాపురం అంటూ కుట్రపూరిత చర్యలకు పాల్పడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. గతంలో పరిటాల రవీంద్రపై కూడా ఇలాంటి కుట్రలే చేశారన్నారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. వైసీపీవారి బెదిరింపులు, దౌర్జన్యాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే ధర్మవరంలో రౌడీయిజం లేకుం డా చేస్తానని అన్నారు. ప్రజలు ఎవరినో చూసి భయపడాల్సిన అవస రం లేదన్నారు. ప్రతిఒక్కరికీ టీడీపీ అండగా ఉంటుందన్నారు. దైర్యం గా వచ్చి సమస్యలను తెలియజేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

టీడీపీలోకి చేరికలు

నియోజకవర్గంలో వైసీపీకి దెబ్బమీద దెబ్బపడుతోంది. పరిటాలశ్రీరామ్‌ పాదయాత్ర సందర్భంగా యువకులు పెద్ద ఎత్తున తెలుగుదేశంలోకి చేరుతున్నారు. తాజాగా 32వవార్డుకు చెందిన సాధిక్‌, రిజ్వానఖాన, షామీర్‌తో పాటు 40 కుటుంబాల మైనారిటీలు పరిటాలశ్రీరామ్‌ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి శ్రీరామ్‌ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. టీడీపీ గెలుపుకోసం ప్రతిఒక్కరూ కృషిచేయాలని పరిటాలశ్రీరామ్‌ వారికి సూచించారు.

Updated Date - Jan 07 , 2024 | 12:33 AM